హైదరాబాద్ : తన కారు చోరీ సాధారణ దొంగతనం కాదని, ఎవరో కావాలనే రెక్కీ నిర్వహించి ఉంటారని క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ అనుమానం వ్యక్తం చేశారు. తనకు ప్రత్యర్థుల నుండి ప్రాణహాని ఉందన్నారు. తన ఇంటి వద్ద గత కొంతకాలంగా దుండగులు రెక్కి నిర్వహిస్తున్నారని, దీనిపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపి, తనకు భద్రత పెంచాలని కోరారు. గతంలో తనపై నమోదైన కేసు ప్రస్తుతం ఈడీ దర్యాప్తులో ఉందన్నారు. ప్రస్తుతం కూడా క్యాసినో నిర్వహిస్తునే ఉన్నానని, అది తన వృత్తి అని చెప్పారు. ప్రభుత్వానికి ట్యాక్సులు చెల్లించి లీగల్ ఉన్న చోటే క్యాసినో నిర్వహిస్తున్నానని స్పష్టం చేశారు.
తన కారు చోరీ చేసింది దొంగలా..? లేక ఇంకా ఎవరు అనేది తనకు కూడా అర్థం కావడం లేదని చీకోటి ప్రవీణ్ అన్నారు. ఈ విషయంలో ప్రత్యర్థులు ఇన్ డైరెక్టుగా తనకు వార్నింగ్ ఇస్తున్నారో లేదో పోలీసులే తేల్చాలని డిమాండ్ చేశారు. గతంలోనూ తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయన్నారు. తాను మాట్లాడే మాటలు కొంతమందికి నచ్చకపోవచ్చని చెప్పారు. తన కారును చోరీ చేసిన నిందితుడు.. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ చేసి, కారును వదిలేసి పారిపోయాడని చెప్పారు. ప్రస్తుతం కారు ఆచూకీ దొరికిందన్నారు. అయితే.. కారు చోరీ చేసిన నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడా..? లేదా అనే విషయం మాత్రం తనకు తెలియదన్నారు.
హిందుత్వం కోసం క్యాసినో కూడా వదులుకోడానికి తాను సిద్ధంగా ఉన్నానని చీకోటి ప్రవీణ్ చెప్పారు. అవకాశం ఉంటే రాజకీయాల్లోకి రావడానికి రెడీగా ఉన్నానని తన మనసులో మాట చెప్పారు. తాను పాలిటిక్స్ లోకి రావడం కొంతమందికి ఇష్టం లేదన్నారు. తాను భవిష్యత్తులో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననేది ఇంకా క్లారిటీ లేదన్నారు. తాను రాజకీయాల్లోకి రావాలని మాత్రం ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.