- చిలకలపల్లి గ్రామస్తుల నిరసన
సిద్దిపేట రూరల్, వెలుగు : అన్నపూర్ణ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా జరుగుతున్న బ్లాస్టింగ్స్తో తమ ఇండ్లు అదురుతున్నాయని, గోడలు బీటలు వారుతున్నాయని, స్లాబుల పెచ్చులూడుతున్నాయని చిన్నకోడూరు మండలం చెలకలపల్లి గ్రామస్తుల నిరసన బుధవారం అన్నపూర్ణ రిజర్వాయర్ వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో 750 మంది ఉంటున్నారని, రిజర్వాయర్ కు 100 మీటర్ల దగ్గరగా ఉందని, దీంతో వర్షాలు పడిన సమయంలో వచ్చిన బ్యాక్ వాటర్ తో పాములు, తేళ్లు తమ ఇళ్లల్లోకి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని అన్నారు.
ఇప్పటికే బ్లాస్టింగ్ వల్ల గ్రామంలో అనేక ఇల్లులు కూలిపోయాయని తెలిపారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అక్కడికి వచ్చారు. గ్రామస్తులతో మాట్లాడారు. సమస్యలను తెలుసుకుని దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తానని అన్నారు.