హాస్పిటల్ ముందు పార్క్ చేసిన బైక్‌లను వేషాలు మార్చి కొట్టేసే ముఠా అరెస్ట్

హాస్పిటల్ ముందు పార్క్ చేసిన బైక్‌లను వేషాలు మార్చి కొట్టేసే ముఠా అరెస్ట్

సికింద్రాబాద్: వేషాలు మారుస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో పార్కు చేసిన బైక్ లను చోరి చేస్తున్న దొంగల ముఠాను చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కామారెడ్డి జిల్లాకు చెందిన శ్రీనివాస్ హైదరాబాద్ తోపాటు వివిధ జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పార్కు చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలించి తక్కువ ధరకు ముగ్గురు వ్యక్తులకు అమ్ముతున్నాడు. వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. గత 3 సంవత్సరాల నుంచి ఇదే పనిగా దొంగతనాలు చేస్తున్నా ఇప్పటి వరకు పట్టుపడలేదని సౌత్ ఈస్ట్ జోన్ డిసిపి బాలస్వామి తెలిపారు. 

ALSO READ | హైడ్రా వ్యర్థాల తొలగింపు, కూల్చివేతలకు టెండర్లు క్లోజ్

శ్రీనివాస్ తో పాటు దొంగలించిన బైక్ లను కొనుగోలు చేసే ముగ్గురు వ్యక్తులు ఏసురత్నం, శాంతారావు, అన్నగాని శ్రీనులను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.10 లక్షల విలువైన 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డిసిపి బాలస్వామి వెల్లడించారు. గాంధీ ఆసుపత్రిలో దొంగతనం చేస్తుండగా సిసి ఫుటేజీ ద్వారా గుర్తించి అరెస్టు చేశామని డిసిపి పేర్కొన్నారు. తక్కువ ధరకు వస్తున్నాయని బైక్ లను ఎవరు కొనవద్దని డాక్యుమెంట్లు ఉన్న తర్వాతనే వాటిని కొనుగోలు చేయాలని ప్రజలకు డీసీపీ బాలస్వామి సూచించారు.