నిర్మల్, వెలుగు : ఆరుగురు సంతానమున్న దంపతులు పేదరికంతో పిల్లలను పోషించుకోలేక చివరి సంతానమైన ఐదు రోజుల పసిపాపను రెండున్నర లక్షలకు అమ్ముకున్నారు. నిర్మల్‌లోని శాంతినగర్ కు చెందిన గొట్పటి అర్చన, శేఖర్ దంపతులకు ఇప్పటికే ఐదుగురు సంతానం ఉండగా.. ఐదు రోజుల కింద మరో పాప జన్మించింది. ఈ క్రమంలో మరో పాపను ఎలా పెంచి పోషించాలో తెలియక సతమతమయ్యారు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న నరేశ్ అనే వ్యక్తి అర్చన, శేఖర్ దంపతులతో పాపను విక్రయించేందుకు ఒప్పందం కుదిర్చాడు. సారంగాపూర్ మండలం జామ్ గ్రామానికి చెందిన కప్లై సంజీవ్, గంగమణి అనే దంపతులు సంతానం లేక చాలా రోజుల నుంచి బాధపడ్తున్నారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న నరేశ్ పసిపాపను అమ్మేందుకు మధ్యవర్తిత్వం చేశాడు. దీంతో పాప తల్లిదండ్రులకు రూ.2.5లక్షలను సంజీవ్ దంపతులు చెల్లించారు. అయితే రెండ్రోజుల కింద వీరు ఆ పాపకు బారసాల చేయడంతో స్థానికులు అనుమానించి చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీకి సమాచారం అందించారు. బుధవారం కమిటీ సభ్యులు జామ్ గ్రామానికి చేరుకొని పాపను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసులు, షీ టీంతో పాటు చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. పాపను చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు పోలీసులతో కలిసి మహిళా శిశు సంక్షేమ శాఖ ఆఫీసర్లకు అప్పజెప్పారు. అర్చన, శేఖర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ పురుషోత్తమాచారి తెలిపారు. నరేశ్‌పై విచారణ చేస్తున్నామన్నారు.