అయ్యోబిడ్డా..ఈ పరిస్థితి ఏ బిడ్డకు రాకూడదు..పట్టుమని పదేళ్లూ కూడా లేవు.. కాలం కాటేసింది.. ఆరునెలల క్రితం తండ్రి.. ఇప్పుడు తల్లి.. ఆచిన్నారిని అనాథను చేసి అనంతలోకాలకు వెళ్లిపోయారు.. అమ్మనాన్నల ఒడిలో అల్లారుముద్దుగా పెరగాల్సిన పసితనం.. కాలం తల్లిని కబలిస్తే..అంత్యక్రియలకోసం ఆ చిన్నారి జోలె పట్టింది.. ఈ వార్త విన్న ప్రతి ఒక్కరినీ కంటనీరు పెట్టిస్తున్న హృదయ విదారక ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది.
తల్లి అంత్యక్రియలకు డబ్బులు లేక ఓ చిన్నారి భిక్షాటన చేసిన ఘటన హృదయాలను కలచివేస్తోంది. తానూర్ మండలం బెళ్తరోడాకు చెందిన గంగామణి (36) కూలిపనులు చేసుకుంటూ.. కూతురు దుర్గను పోషిస్తోంది. కొన్ని రోజుల క్రితం భర్త మృతి చెందాడు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపం చెందిన గంగామణికి ఆర్థిక ఇబ్బందులు కూడా తోడవడంతో ఉరి వేసుకుని చనిపోయింది.. ఇంట్లో డబ్బులు లేకపోవడం, తల్లి అంత్యక్రియలు ఎలా చేయాలో తెలియక చిన్నారి దుర్గ.. తన ఇంటి ముందు ఓ గుడ్డ వేసుకుని అంత్యక్రియలకు సాయం చేయాలని అక్కడున్న వారిని వేడుకుంది.
బంధువులు ఉన్నా ఆర్థికంగా ఎలాంటి సాయం చేయకపోవడంతో చిన్నారి దుర్గ తప్పని పరిస్థితుల్లో భిక్షాటన చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో దాతలు స్పందించి సహాయం అందిస్తున్నారు. అటు తల్లి అంత్యక్రియలకు డబ్బులు లేని దుస్థితిలో సాయం చేయాలన్న అనాథ చిన్నారి విజ్ఞప్తికి గ్రామస్తులు తోచిన సాయం చేస్తున్నారు. కాగా ఈ ఘటన స్థానికులను కలచివేసింది. కాగా గంగామణి ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.