- పురుగుల మందు తాగి బిడ్డ ఆత్మహత్య..రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి
- నిజామాబాద్ జిల్లాలో విషాదాలు
- పోలీస్ కమిషనరేట్‌కు తరలివచ్చిన బాధిత కుటుంబీకులు
నిజామాబాద్, వెలుగు : భర్త పెట్టే వేధింపులు భరించలేక ఓ వివాహిత సూసైడ్ చేసుకోగా, విషయం తెలుసుకుని ఆమెను చూసేందుకు వస్తున్న తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్ట తండాకు చెందిన మాలోత్ జ్యోతి (34)కి నవీపేట మండలం అబ్బాపూర్ తండాకు చెందిన ప్రకాశ్‌కు 15 ఏండ్ల కింద పెండ్లయ్యింది. వీరికి ఇద్దరు కూతుళ్లున్నారు. తండాలోని మరో మహిళను ప్రకాశ్ రెండున్నరేండ్ల కింద పెండ్లి చేసుకోగా, కొడుకు పుట్టాడు.
అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నా..మొదటి భార్యతో ప్రకాశ్ తరచూ గొడవపడేవాడని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ నెల 22న జ్యోతితో లొల్లి పెట్టుకున్న ప్రకాశ్ ఆమెను కొట్టగా సాయంత్రం గడ్డి మందు తాగింది. దీంతో నిజామాబాద్‌లోని జీజీహెచ్‌కు తరలించి చికిత్స చేయిస్తున్నారు. గురువారం రాత్రి పరిస్థితి విషమంగా ఉందని ఆమె తండ్రి లక్ష్మణ్ రాథోడ్‌కు ఫోన్లో సమాచారం ఇచ్చారు.
దీంతో గాబరా పడుతూ కూతురిని చూడడానికి వీరన్నగుట్ట తండా నుంచి టూ వీలర్‌పై వస్తుండగా కల్యాపూర్ చౌరస్తా వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే చనిపోయాడు. రోడ్డు ప్రమాదానికి కారణమైన వారిని, జ్యోతి మృతికి కారకుడైన ప్రకాశ్‌ను అరెస్టు చేయాలని బంధువులు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు తరలివచ్చి ఆందోళన చేశారు. స్పందించిన అడిషనల్ డీసీపీ కోటేశ్వర్రావు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వెళ్లిపోయారు.