వ్యాక్సిన్ వేసిన కాసేపటికే చిన్నారి మృతి

వ్యాక్సిన్ వేసిన కాసేపటికే చిన్నారి మృతి
  • వైద్య సిబ్బందే కారణమంటూ బాధిత కుటుంబసభ్యుల ఆరోపణ
  • పీహెచ్‌‌సీ వద్ద  ఆందోళన రాజన్న సిరిసిల్ల జిల్లా  నేరెళ్లలో ఘటన 

తంగళ్లపల్లి, వెలుగు: వ్యాక్సిన్ వేయించిన కొద్ది సేపటికే చిన్నారి చనిపోవడంతో  కుటుంబసభ్యులు ఆందోళనకు దిగిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తంగళ్లపల్లి మండలం నేరెళ్లకు చెందిన దాసరి రమేశ్‌‌, లత దంపతులకు కొడుకు ఉండగా.. ఇటీవల కూతురు పుట్టింది. చిన్నారికి 45 రోజులు నిండగా వ్యాక్సిన్ వేయించేందుకు బుధవారం నేరెళ్ల పీహెచ్‌‌సీకి తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది చిన్నారికి వ్యాక్సిన్ చేసిన కాసేపటికే చనిపోయింది.

తమ కూతురు మృతికి వైద్య సిబ్బందే కారణమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్ద ధర్నాకు దిగారు. అనంతరం రోడ్డుపై ధర్నాకు యత్నించగా..  పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ వచ్చి తమకు న్యాయం చేయాలని చిన్నారి పేరెంట్స్ డిమాండ్ చేశారు. దీంతో 3 గంటలపాటు ఉద్రిక్తత నెలకొంది. ధర్నా విరమించకపోవడంతో కుటుంబ సభ్యులను పోలీసులు స్టేషన్‌‌కు తరలించారు. ఘటనా స్థలానికి ఆర్డీవో వెళ్లి మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.