
కౌడిపల్లి, వెలుగు : మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాజిపేట జాజి తండాలో సోమవారం సాయంత్రం ఈదురు గాలులకు రేకులతో పాటు మూడేండ్ల చిన్నారి కూడా ఎగిరి పడింది. తండా వాసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన మాలోత్ మాన్సింగ్ కూతురు సంగీత (3). ఇంట్లో వారంతా కూలీ పనులకు వెళ్లగా సంగీత నానమ్మ దగ్గర ఉంది. సాయంత్రం వర్షం వస్తుండడంతో చిన్నారి నానమ్మ పక్కనే ఉన్న పొలంలోకి వెళ్లగా సంగీత ఒక్కతే ఇంట్లో ఉంది.
ఈదురు గాలులు బలంగా వీయడంతో ఇంటిపై ఉన్న సిమెంట్ రేకులతో పాటు సంగీత (3) కూడా గాలిలో ఎగిరి పక్కనే ఉన్న మరో బిల్డింగ్ స్లాబ్ పై పడింది. దీంతో తీవ్రంగా గాయపడగా తండావాసులు హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది.