శంకర్పల్లి, వెలుగు: బిల్డింగ్ పై నుంచి కిందపడి మూడేండ్ల చిన్నారి చనిపోయిన ఘటన రంగారెడ్డి జిల్లా మోకిల పీఎస్పరిధిలో జరిగింది. సీఐ నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్ పల్లి మండలం దొంతాన్పల్లి గ్రామానికి చెందిన రుద్రగిరి సింగ్, రేష్మికుమారి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. రుద్రగిరి సింగ్ ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. గురువారం సాయంత్రం అతని రెండో కూతురు ఇషిక(3) ఆడుకుంటూ బిల్డింగ్ మొదటి అంతస్తు నుంచి రెండో అంతస్తు టెర్రస్‌పైకి వెళ్లింది. ప్రమాదవశాత్తు అక్కడి నుంచి జారి కిందపడింది. పెద్దగా శబ్దం రావడాన్ని గమనించిన రేష్మి బయటికి వచ్చి చూడగా.. గ్రౌండ్ ఫ్లోర్లో ఇషిక గాయాలతో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. వెంటనే శంకర్‌పల్లిలోని ఓ హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇషిక శుక్రవారం ఉదయం చనిపోయింది. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.