
హైదరాబాద్ సిటీ, వెలుగు: గుజరాత్ నుంచి పిల్లలను తీసుకువచ్చి ఏపీ, తెలంగాణలో అమ్ముతున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో 11 మంది నిందితులను అరెస్ట్ చేసి, నలుగురు పిల్లలను రక్షించారు. చైతన్యపురి పోలీసులతో కలిసి మల్కాజ్ గిరి ఎస్ వోటీ టీమ్ ఈ ఆపరేషన్ నిర్వహించింది. వివరాలను రాచకొండ సీపీ సుధీర్‌బాబు మంగళవారం వెల్లడించారు. కుత్బుల్లాపూర్‌కు చెందిన కోల కృష్ణవేణి బయో కెమిస్ట్రీ చదివింది. పెండ్లై విడాకులు కావడంతో డబ్బు సంపాదించడం కోసం అప్పుడే పుట్టిన పిల్లలను అమ్మే దందా మొదలుపెట్టింది. ఈమెకు 2024లో సోషల్ మీడియాలో ఢిల్లీకి చెందిన మనోజ్‌తో పరిచయం ఏర్పడింది. తన దగ్గర మగ పిల్లాడు ఉన్నాడని, రూ.5 లక్షలకు అమ్ముతానని మనోజ్ చెప్పాడు. అన్నట్టుగానే మనోజ్ మగబిడ్డను హైదరాబాద్ కు తీసుకువచ్చాడు.
సమాచారం అందుకున్న గోపాలపురం పోలీసులు ఇద్దరినీ పట్టుకున్నారు. వీరిపై జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు. అయినప్పటికీ పిల్లలను అమ్మే వృత్తిని వదలని కృష్ణవేణి.. కొత్తపేటకు చెందిన స్నేహితురాలు బట్టు దీప్తి , సికింద్రాబాద్ కు చెందిన సంపత్ కుమార్ తో కలిసి దందాను డెవలప్ చేసింది. కృష్ణవేణికి.. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లోని వందనతో పరిచయం ఏర్పడింది. వందన రూ. 1.5 లక్ష తీసుకుని ఒక ఆడపిల్లను, రూ.2.5 లక్షలు తీసుకుని మగపిల్లవాడిని ఇచ్చేది. వీరు ఆడపిల్లను రూ.3 లక్షలకు, అబ్బాయిని రూ.5 లక్షలకు అమ్మేవారు. ఇందులో భాగంగా వందన వద్ద 4 రోజుల వయస్సున్న ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలను కొన్నారు.
వీరు సునీత, సుమన్ దంపతుల సహాయంతో గుజరాత్ కు చెందిన సావిత్రి దేవి, శారద, సంపత్ కుమార్ ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 3 కుటుంబాలకు ముగ్గురు పిల్లలను అమ్మారు. మిగిలిన పాపను అమ్మడానికి మంగళవారం సాయంత్రం కృష్ణవేణి, దీప్తి సిద్ధంగా ఉండగా.. చైతన్యపురి బస్టాప్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. పాపతో ఉన్న కృష్ణవేణి, దీప్తిని అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో మిగిలిన వాళ్లను అరెస్ట్ చేశారు. దీప్తి ఇంట్లో మరో ముగ్గురు చిన్నారులను చైల్డ్ కేర్ సెంటర్‌కు తరలించారు. కాగా, ఉమారాణి, జయశ్రీ, శ్రవణ్, సోనీ కీర్తి ముగ్గురు పిల్లలను అమ్మినట్టు విచారణలో తేలడంతో.. శ్రవణ్, సోనీ కీర్తిని అరెస్ట్ చేశారు.