వరంగల్, వెలుగు: వరంగల్‌లోని సీకేఎం హాస్పిటల్‌లో నాలుగు రోజుల బాబు కిడ్నాప్‌నకు గురయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు 48 గంటల్లో బాబును గుర్తించి, కిడ్నాప్ చేసిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఇంతేజార్ గంజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలకు చెందిన సిద్దం రాజేశ్, బీమాబాయ్ దంపతులకు ఈ నెల 4న అక్కడి గవర్నమెంట్ హాస్పిటల్‌లో బాబు పుట్టాడు. 7 నెలలకే డెలివరీ కావడంతో తల్లితో పాటు బాబు ఆరోగ్యం సరిగా లేదు.
ఈ టైంలో వారికి సునీత అనే మహిళ పరిచయమై తల్లీకొడుకుకు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌చేయిద్దామని కుటుంబసభ్యులకు చెప్పి ఇక్కడికి తీసుకొచ్చింది. బాబును మెరుగైన చికిత్స కోసం వేరే హాస్పిటల్‌లో చేర్పిస్తానని చెప్పి శనివారం సాయంత్రం సీకేఎం హాస్పిటల్ వద్దకు తీసుకెళ్లింది. అక్కడ చిన్నారిని డాక్టర్‌కు చూపిస్తానని లోపలికి వెళ్లి చిన్నారితో సహా పరారైంది. కొద్దిసేపటి తర్వాత గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా మహిళ చిన్నారితో సహా మహారాష్ట్ర వైపు వెళ్లినట్లు గుర్తించారు.
ఒంటరిగా ఉండలేక.. బాలుడి కిడ్నాప్
మహిళ ఒంటరిగా ఉండలేకే బాలుడిని కిడ్నాప్ చేసిందని పోలీసులు వెల్లడించారు. ఆదిలాబాద్‌జిల్లా గాంధీచౌక్ సుందరయ్య నగర్‌లో ఉండే సునీత సొంతూరు మహారాష్ట్రంలోని నాంధేడ్. తండ్రి చిన్నప్పుడే చనిపోగా, కరోనా టైంలో తల్లి కూడా చనిపోవడంతో ఒంటరైంది. ఈ క్రమంలో ఉట్నూర్‌కు చెందిన ఆత్రం ఆనందరావు పరిచయం కాగా ఇద్దరూ పెండ్లి చేసుకున్నారు. తర్వాత ఆనంద్ హైదరాబాద్‌లో ఉంటూ సునీతను పట్టించుకోలేదు. దీంతో ఒంటరిగా ఉండలేక బాబును దత్తత తీసుకునేందుకు ప్రయత్నించినా వీలుకాకపోవడంతో కిడ్నాప్‌కు ప్లాన్ చేసింది.
పది రోజుల కింద కరీంనగర్‌లోని ప్రతిమ హాస్పిటల్ వద్ద కిడ్నాప్‌కు యత్నించగా వీలు కాలేదు. తర్వాత మంచిర్యాలలోని సర్కార్ హాస్పిటల్ వద్ద రాజేశ్‌దంపతులు కలవడంతో మాట కలిపి ట్రీట్‌మెంట్ పేరుతో వరంగల్‌తీసుకొచ్చింది. ఆ తర్వాత టైం చూసుకొని బాబును తీసుకొని వరంగల్ మీదుగా నిజామాబాద్, అక్కడి నుంచి ఉట్నూర్ వెళ్లింది. సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించిన పోలీసులు ఉట్నూర్‌లో మహిళను అదుపులోకి తీసుకున్నారు. శిశువును తల్లిదండ్రులకు అప్పగించిన అనంతరం ఆరోగ్య పరీక్షల కోసం ఎంజీఎంలోని పిల్లల వార్డుకు తరలించారు.