తప్పిపోయిన చిన్నారి కథ విషాదాంతం .. డ్రైనేజీలో మృతదేహం

జులై 27న అదృశ్యం అయిన మూడేళ్ల చిన్నారి ఘటన విషాదంతంగా ముగిసింది. ఇంటి నుంచి ఒంటరిగా బయటకు నడుచుకుంటూ వెళ్లిన ఆ చిన్నారి విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరు మన్నీరుగా విలపిస్తున్నారు.

కరీంనగర్ రాంనగర్ లోని శ్రీహరి నగర్ లో నివాసం ఉంటున్న వలస కూలీల చిన్నారి కృతిక జులై 27న అదృశ్యం అయింది. ఇంటి నుండి బయటకు నడుచుకుంటూ చిన్నారి గేటు దాటి వెళ్లినట్టు సీసీ ఫుటేజీలో రికార్డయింది. ఆ తరువాత చిన్నారి ఎటువైపు వెల్లింది, ఏమైపోయింది అన్నదే అంతు చిక్కకుండా పోయింది. జోరుగా కురుస్తున్న వర్షాలతో వరదలు ముంచెత్తుతున్న సమయంలో ఇంటి నుండి బయటకు వచ్చిన చిన్నారి డ్రైనేజీలో పడి గల్లంతయిందా లేక ఎవరైనా ఎత్తుకెళ్లారా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సమీప ప్రాంతాల్లో ఆరా తీసిన తల్లిదండ్రులకు చిన్నారి ఆచూకి లభ్యం కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. 

వీరు మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ ఏరియా నుండి వలస కూలీలుగా కరీంనగర్ కు వచ్చారు. నిర్మాణానికి సంబంధించిన పనుల్లో ఉపాధి పొందతూ జీవనం సాగిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ బిడ్డ అనూహ్యంగా అదృశ్యం కావడంతో.. తల్లిదండ్రులు తమ బిడ్డ ఆచూకిని కనిపెట్టాలని పోలీసులను వేడుకున్నారు. పోలీసులు కూడా వివిధ కోణాల్లో ఆరా తీసినప్పటికీ కృతిక జాడ మాత్రం తెలియకపోవడంతో.. పాప ఏమై పోయిందోనని తెలుసుకునే ప్రయత్నంలో నిమగ్నం అయ్యారు. వారం రోజులుగా ఆ చిన్నారి కోసం వెతుకుతున్న క్రమంలో గురువారం తెల్లవారు జామున కరీంనగర్ లోని లక్ష్మీ నగర్ డ్రైనేజీలో చిన్నారి శవం లభ్యమైంది. దీంతో పాప శవాన్ని సివిల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు పోలీసులు. అయితే చిన్నారి తల లేకుండా మొండెం మాత్రమే ఉండి.. తల దొరకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. వరదల ధాటికి చిన్నారి తల కొట్టుకపోయి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ కారణంగానే ఆమె చేతి భాగం కూడా కొంతమేర దెబ్బతిని ఉంటుందని అంచనా వేస్తున్నారు.