బాలల అక్రమ రవాణాకు అడ్డుకట్టేది.. ?

ఇతర రాష్ట్రాల నుంచి ఆగని చైల్డ్​ ట్రాఫికింగ్​

  •     హైదరాబాద్​, వరంగల్​ నగరాలకు తరలిస్తున్న దుండగులు
  •     చిన్నారులను తీసుకొచ్చి పనిలో పెడుతున్నరు
  •     వరంగల్ లో దాదాపు 426 మంది బాలలను పట్టుకున్న అధికారులు
  •     నేటి నుంచి ఆపరేషన్​ ముస్కాన్​ 

హనుమకొండ, వెలుగు : ఇతర రాష్ట్రాల నుంచి వరంగల్​ మీదుగా బాల కార్మికుల అక్రమ రవాణా ఆగడం లేదు. అధికారులు నెలనెలా పట్టుకుంటున్నా.. శాశ్వత చర్యలపై దృష్టిపెట్టడం లేదు. నేటి నుంచి ఆపరేషన్​ ముస్కాన్​ నిర్వహిస్తున సందర్భంగా తగ్గని బాల కార్మికుల తరలింపు చర్చనీయాంశం అవుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది పిల్లలను తీసుకొస్తున్న ట్రాఫికర్స్​ వారిని హైదరాబాద్​, వరంగల్ నగరాలకు చేరవేస్తున్నారు. 

యాంటీ హ్యూమన్​ ట్రాఫికింగ్ టీమ్స్(ఏహెచ్​టీ)​,బచ్​పన్​ బచావో ఆందోళన్​(బీబీఏ), డీసీపీవోలు, పోలీసులు ఇలా వివిధ విభాగాల అధికారులు చర్యలు తీసుకుంటున్నా.. గడిచిన ఆరు నెలల్లో ఇతర రాష్ట్రాల నుంచి వరంగల్ మీదుగా తరలిస్తున్న దాదాపు 426 మంది పిల్లలు పట్టుబడడంకలవరానికి గురి చేస్తోంది. పకడ్బందీ చర్యలు లేకనే చైల్డ్​ ట్రాఫికింగ్​కు అడ్డుకట్ట పడటం లేదనే ఆరోపణలున్నాయి.

ఓరుగల్లు మీదుగా రవాణా

రాజస్థాన్​, బిహార్​, ఝార్ఖండ్​, మధ్యప్రదేశ్​, ఉత్తరప్రదేశ్​, ఒడిశా, ఛత్తీస్​ గడ్​, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి చిన్నపిల్లలను అక్రమంగా తీసుకొస్తున్నారు. ఇందుకు రైలు మార్గాన్ని అనువుగా ఎంచుకున్నారు. ఉత్తర, దక్షిణ రాష్ట్రాలను కలిపే వారధిగా ఉన్న ఓరుగల్లు మీదుగా ఏటా వందల మంది పిల్లలను హైదరాబాద్​, వరంగల్​ కు తరలిస్తున్నారు. అనంతరం వారిని హోటల్స్​, బార్స్​, రెస్టారెంట్స్​, వుడ్​ వర్క్​ షాప్స్​, డెయిరీ ఫామ్స్​, ప్లంబింగ్, కన్​స్ట్రక్షన్ సెక్టార్లలో పనుల్లో పెడుతున్నారు. 

కాంట్రాక్టర్​ గా మారి నెలకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వేతనంతో 14 ఏండ్ల లోపు పిల్లలతో కూడా వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. వాస్తవానికి 1979లో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుపాదస్వామి కమిటీ సిఫార్సుల మేరకు 14 ఏండ్లలోపు పిల్లలతో వెట్టిచాకిరి చేయించకూడదు. 14 నుంచి 18 ఏండ్ల బాలలను ప్రమాదకర పనుల్లో పెట్టకూడదు. వరంగల్ లోని చాలా హోటల్స్​, బార్స్​, కన్​స్ట్రక్షన్​ వర్క్​ సైట్స్​, ఇటుక బట్టీల్లో ఎంతోమంది పిల్లలతో గొడ్డుచాకిరీ చేయిస్తున్నారు. 

ఆరు నెలలు.. 426 మందికిపైగా చిన్నారులు

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ హ్యూమన్​ ట్రాఫికింగ్​ టీమ్స్​ తో చర్యలు తీసుకుంటున్నా అక్రమ రవాణాకు అడ్డుకట్టపడటం లేదు. దీంతోనే పిల్లల కాంట్రాక్టర్ల అవతారమెత్తిన చాలామంది రైలు మార్గంలో చైల్డ్​ ట్రాఫికింగ్​ కు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే గడిచిన ఆరు నెలల్లో ఆర్పీఎఫ్​, జీఆర్పీ, బీబీఏ, డీసీపీవోస్​, సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో దాదాపు 68 రైడ్స్​ చేసి 426 మంది చిన్నారులను రెస్క్యూ చేశారు. వారి ఆధార్​ కార్డులు సేకరించి, ఆయా రాష్ట్రాల సీడబ్ల్యూసీలకు సమాచారం అందించి తిరిగి వారిని ఇండ్లకు పంపించారు. 

వివిధ రాష్ట్రాల నుంచి వారిని హైదరాబాద్​, వరంగల్ నగరాలకు చేరవేస్తున్న 60 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో కొంతమంది ఇదివరకు పట్టుబడినవారు కూడా ఉన్నారు. ఇలా తరచూ బాలల అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితులపై సీరియస్​ యాక్షన్​ తీసుకోవాల్సిన ఆఫీసర్లు నామమాత్రపు కేసులతో సరిపెడుతుండటం, తరచూ పట్టుబడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే నిందితులు ట్రాఫికింగ్​ ఆపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 

నామమాత్రపు చర్యలే

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్​, జులైలో ఆపరేషన్​ ముస్కాన్​ పేరిట పోలీసులు, చైల్డ్​ వెల్ఫేర్​ కమిటీలు, లేబర్​ డిపార్ట్మెంట్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. వరంగల్ కమిషనరేట్​ పరిధిలో ఇలా గడిచిన మూడేండ్లలో వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న దాదాపు 1,286 మంది బాల కార్మికులను గుర్తించారు. ఇందులో సగానికిపైగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన చైల్డ్​ లేబర్లే కావడం గమనార్హం. ఆఫీసర్లు పట్టుకుంటున్నా క్షేత్రస్థాయిలో మార్పు రావడం లేదు. దీంతో బాలలతో వెట్టి చాకిరీ చేయిస్తున్న వారిపై మాత్రం సీరియస్​ యాక్షన్​ తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రైలు మార్గంలో తరలిస్తున్న వందలాది మంది చిన్నారులను రెస్క్యూ చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

 ఇటీవల  రెస్క్యూ  ఘటనలు

జూన్​ 29: బిహార్​ వైపు నుంచి వస్తున్న రక్సోల్ ఎక్స్ప్రెస్ లో 11 మంది బాలకార్మికులను జీఆర్పీ పోలీసులు పట్టుకున్నారు
జూన్​ 15: కాజీపేట ఆర్పీఎఫ్​, జీఆర్పీ పోలీసులు 18 మంది చిన్నారులను రెస్క్యూ చేశారు.
జూన్​ 2:   వరంగల్​ రైల్వే స్టేషన్​ లో 57 మంది బాలురను చైల్డ్​ లైన్​ సిబ్బంది పట్టుకున్నారు.
ఏప్రిల్​ 23: కాజీపేట రైల్వే పోలీసులు వివిధ రాష్ట్రాలకు చెందిన 10 మంది మైనర్లను కాపాడారు. 
ఏప్రిల్​ 19: ఢిల్లీ వైపు సికింద్రాబాద్​ వెళ్లే ఎక్స్​ ప్రెస్​ లో 34 మంది బాలలను పట్టుకున్నారు.