హేట్టిగూడ గ్రామంలో బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఆఫీసర్లు

కాగజ్ నగర్, వెలుగు: చింతలమానేపల్లి మండలం హేట్టిగూడ గ్రామంలో జరుగుతున్న ఓ బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన బాలిక (16)ను నాలుగో తరగతి వరకే చదివించిన తల్లిదండ్రులు ఆపై బడికి పంపలేదు. ఈ క్రమంలోనే ఓ యువకుడితో పెండ్లి నిశ్చయించారు. సోమవారం పెండ్లి జరగనుండగా.. విషయాన్ని గ్రామస్తులు చైల్డ్​ హెల్ప్​ లైన్​ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో లీగల్ కం ప్రొబెషనరీ ఆఫీసర్ శ్రీనివాస్, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ బాల ప్రవీణ్, చైల్డ్ హెల్ప్ లైన్ కౌన్సిలర్ రవళి బృందం బాలిక ఇంటికి చేరుకున్నారు. వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పెండ్లిని నిలిపివేయించారు. బాల్య వివాహాలతో జరిగే అనర్థాలు, చట్టాలపై అవగాహన కల్పించారు. బాలికను సఖి కేంద్రానికి తరలించారు. మైనర్ కు పెళ్లి చేయడం నేరమని, బాల్య వివాహాలు జరపకుండా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మహిళా కానిస్టేబుల్ కాంత, పంచాయతీ సెక్రటరీ విఘ్నేశ్ పాల్గొన్నారు.