రాజన్న ఆలయ ఆవరణలో చిన్నారి మిస్సింగ్

రాజన్న ఆలయ ఆవరణలో చిన్నారి మిస్సింగ్
  • మతిస్థిమితం సరిగా లేని తల్లితో వచ్చిన బాలిక 
  • ఆలస్యంగా తెలియడంతో బంధువు ఫిర్యాదు
  • కేసు నమోదు చేసిన వేములవాడ పోలీసులు 

వేములవాడ, వెలుగు: బాలిక మిస్సింగ్ అయిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. బంధువులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతలపల్లికి చెందిన మతి స్థిమితం సరిగాలేని లాస్య తన కూతురు అద్విత (4)తో కలిసి గత డిసెంబర్10న ఇంట్లోంచి బయటకు వచ్చింది.  

అప్పటి నుంచి బంధువులు ఎంత వెతికినా జాడ దొరకలేదు. అయితే అదే నెల 26న  వేములవాడ రాజన్న ఆలయ ఆవరణలో తల్లి, కూతురు ఉన్నారని సమాచారం తెలిసింది. దీంతో బంధువులు వచ్చి ఆలయ పరిసరాల్లో వెతకగా.. రెండు రోజుల తర్వాత తమ్ముడు గంగస్వామికి లాస్య కనిపించింది. ఆమెను విచారించగా గుడికి వచ్చినట్లు తెలిసింది. కూతురు గురించి అడిగితే పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలించగా గుర్తు తెలియని మహిళ వద్ద అద్విత కనిపించింది. అనంతరం చిన్నారి జాడ తెలియకపోవడంతో గురువారం వేములవాడ టౌన్​పోలీసులకు చిన్నారి మేనమామ గంగస్వామి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వీరప్రసాద్ ​తెలిపారు.