యాదాద్రి, వెలుగు : గర్భిణులకు న్యూట్రిషన్ పై అవగాహన కల్పించి శిశు మరణాలను తగ్గించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి ఎం.మనోహర్ సమక్షంలో చైల్డ్ డెత్ పై అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ ముఖ్యంగా చిన్నపిల్లలు నిమోనియా, ఉమ్మనీరు పోవుట, పోషకాహార లోపం, ఇతర కారణాలతో చనిపోతున్నారని తెలిపారు. అంగన్ వాడీ కేంద్రాల్లో గర్భిణులకు పోషకాహారంపై అవగాహన కల్పించాలని చెప్పారు.
‘జన్మనిచ్చిన ఏ తల్లి చనిపోకూడదు.. పుట్టిన ప్రతి బిడ్డ బ్రతకాలి’ అనే నినాదంతో ఆరోగ్య సేవలు అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా 19 ఏండ్లలోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు అందించాలని సూచించారు. సమావేశంలో జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డీసీహెచ్ఎస్ చిన్న నాయక్, గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి సూరింటెండెంట్ రాజారావు, డాక్టర్లు, మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.