కారులో ఊపిరాడక చిన్నారి మృతి 

కారులో ఊపిరాడక చిన్నారి మృతి 
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన 

మణుగూరు, వెలుగు: కారు డోర్స్ లాక్ అవడంతో మూడేండ్ల చిన్నారికి ఊపిరాడక చనిపోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబాయిగూడెం గ్రామంలో బుధవారం వెలుగు చూసింది. మడకం సాయి కుమార్, లికిత దంపతులకు కుమార్తె కల్నీషా (3), ఐదు నెలల కుమారుడు ఉన్నారు. సాయి జేసీబీ ఆపరేటర్‌‌‌‌గా పనిచేస్తుండగా, లిఖిత కూలి పనులు చేస్తుంది.

మంగళవారం సాయంత్రం కల్నీషా ఇంటి పక్కన ఆడుకుంటూ.. పక్కనే పార్క్‌‌ చేసిన కారులోకి ఎక్కింది. చిన్నారి కార్ ఎక్కిన వెంటనే డోర్లు మూసుకుపోయి లాక్ అయ్యాయి. కొద్దిసేపటి తర్వాత చిన్నారి కోసం తల్లి లిఖిత చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు. స్థానికంగా ఉన్న పిల్లలను ఆరా తీయగా కొద్దిసేపటి క్రితం కారు దగ్గర ఆడుకుంటుందని చెప్పారు. కారులో చూడగా కల్నీషా అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే ఆమెను హాస్పిటల్‌‌కు తీసుకువెళ్లగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. ఆడుతూపాడుతూ తిరిగిన కూతురు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.