హైదరాబాద్లో చిన్న పిల్లలను కొని అమ్ముతున్నారు.. ఆడ పిల్లకు రూ.3 లక్షలు.. మగ పిల్లాడికి రూ.5 లక్షలు

హైదరాబాద్లో చిన్న పిల్లలను కొని అమ్ముతున్నారు.. ఆడ పిల్లకు రూ.3 లక్షలు.. మగ పిల్లాడికి రూ.5 లక్షలు
  • చిన్న పిల్లలను కొని అమ్ముతున్న 9 మంది ముఠా అరెస్ట్
  • 10 మంది చిన్నారులు గుర్తింపు.. వీరిలో ఆరుగురు అమ్మాయిలు

ఎల్బీనగర్, వెలుగు: అంగట్లో సరుకు లెక్క చిన్న పిల్లలను కొని, విక్రయిస్తున్న 9 మంది అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ ​చేశారు. 10 మంది చిన్నారులను ట్రేస్ ​చేశారు. నలుగురి(ముగ్గురు బాలికలు, ఒక బాలుడు)ని కాపాడారు. వారిలో ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీ నగర్ ​చైతన్యపురి ప్రాంతానికి చెందిన కందుల కృష్ణవేణి, దీప్తి మరికొంత మందితో కలిసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా చిన్నారులను కొంటున్నారు. వారిని పిల్లలు లేనివారికి విక్రయిస్తున్నారు.

సమాచారం అందుకున్న చైతన్యపురి, మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు నిఘా పెట్టారు. గత నెల 24న కృష్ణవేణి, దీప్తితో కలిపి11 మందిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈ ముఠా మొత్తం 25 మంది చిన్నపిల్లలను అక్రమంగా కొని, విక్రయించినట్లు గుర్తించారు. కృష్ణవేణి, దీప్తి ఇచ్చిన సమాచారంతో మలక్ పేటకు చెందిన ఆశా వర్కర్​సోము అమూల్య(29)ను బుధవారం అరెస్ట్​చేశారు.

దీప్తితో కలిసి అమూల్య10 మంది చిన్నారులను (నలుగురు అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు) హైదరాబాద్, ముంబై, కాన్పూర్, రాయ్​పూర్, అమరావతి(మహారాష్ట్ర), కోల్​కతా, చెన్నై, బెంగళూరు, గుంటూరు ప్రాంతాల్లో విక్రయించారు. ఆడపిల్లను రూ.3 లక్షలకు, మగ పిల్లాడిని రూ.5 లక్షల వరకు అమ్మారు. వారందరిని పోలీసులు ట్రేస్ ​చేశారు.

ముఠాలోని సభ్యులైన కొత్తపేట మారుతినగర్ కు చెందిన జాన్పల్లి కార్తీక్(గాంధీ హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్), ఘాన్సీ బజార్ కు చెందిన సజ్జన అగర్వాల్, అబ్దుల్లాపూర్ మెట్ కు చెందిన బాణాల మంగయ్య, ఆసిఫాబాద్ కు చెందిన బోదాసు నాగరాజు, నేరేడ్ మెట్ చెందిన రామారం అశోక్, మైలార్ దేవులపల్లికి చెందిన షేక్ ఇస్మాయిల్, నిజాంపేటకు చెందిన మాచర్ల వంశీ కృష్ణను పోలీసులు అరెస్ట్​చేశారు. పిల్లలను కొన్న 17 మంది తల్లిదండ్రులు గుర్తించారు. రెస్క్యూ చేసిన పిల్లలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించామని సీపీ తెలిపారు.