- భిక్షాటన చేస్తుండగా పట్టుకెళ్లిన పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు
- భద్రాచలం శిశుగృహ వద్ద బుడగ జంగాల పెద్దల ఆందోళన
భద్రాచలం, వెలుగు : భిక్షాటన చేస్తున్న చిన్నారులను పోలీసులు, అధికారులు పట్టుకెళ్లడంతో బేడ బుడగ జంగాల పెద్దలు ఆందోళన దిగారు. తమ పిల్లలను అప్పగిస్తే భిక్షాటన మానివేస్తామని వేడుకోగా.. అందుకు ఆఫీసర్లు ఒప్పుకోలేదు. దీంతో వారు ఆందోళన కొనసాగించారు. ‘నగదు భిక్షాటన నిలిపివేయండి’ అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నినాదంతో భద్రాచలంలో సోమవారం పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు.
టౌన్ లోని బేడ జంగాల కాలనీకి చెందిన 16 మంది పిల్లలు భిక్షాటన చేస్తుండగా అధికారులు పట్టుకుని గోదావరి బ్రిడ్జి సెంటర్ వద్ద శిశు గృహకు తరలించారు. వీరిలో పాలు తాగే 9 మంది చిన్నారులను మినహాయించి మిగిలిన 7 మంది పిల్లలను హాస్టల్కు పంపించారు. దీంతో తమ పిల్లలను ఆఫీసర్లు పట్టుకెళ్లడంతో బేడ బుడగ జంగాల పెద్దలు శిశు గృహ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. గంటా, శంఖం తీసుకుని భిక్షాటన చేసుకుని బతకడమే తమ కులవృత్తి అని.. ఇది కొన్ని వందల ఏండ్లుగా చేస్తున్నామని పలువురు బేడ బుడగ జంగాల పెద్దలు పేర్కొన్నారు. భిక్షాటన ఆపమని ముందుగా తమకు ఎవరూ చెప్పలేదని, అలా చెప్పి ఉంటే ఆపేసి వేరే కూలీ పనులు చేసుకునే వాళ్లమని చెప్పారు.