- కరీంనగర్‌లో విషాదాంతమైన చిన్నారి మిస్సింగ్
- వరదల్లో కొట్టుకపోవడంతో చనిపోయిన బాలిక
కరీంనగర్ క్రైం, వెలుగు: వారం రోజుల కిందట చిన్నారి కనిపించకుండా పోయిన ఘటన విషాదాంతమైంది. కరీంనగర్ సిటీలో ఇంటి నుంచి బయటికి వెళ్లి అదృశ్యమైన చిన్నారి.. గురువారం డ్రైనేజీలో శవమై తేలింది. వరదల్లో కొట్టుకపోయి మృతి చెందింది. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌కు చెందిన యశ్వంతరావు కావ్రే, సవిత దంపతులు కరీంనగర్‌లోని శ్రీహరినగర్‌లో ఉంటూ కూలీ పనులు చేసుకుని బతుకుతున్నారు. వారికి కూతురు క్రితిక (3) ఉంది. జులై 27న యశ్వంతరావు పనికి వెళ్లగా, అతని భార్య దగ్గర్లోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఆ రోజు సిటీలో వర్షం, వరద ఎక్కువగా ఉండడంతో కూతురు క్రితికను ఇంట్లోనే వదిలేసింది.
సవిత తిరిగి వచ్చే సరికి పాప కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకపోవడంతో అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీహరినగర్‌లో సీసీ టీవీ పుటేజీలు పరిశీలించగా.. చిన్నారి ఇంట్లో నుంచి విద్యానగర్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. కానీ పాప ఆచూకీ మాత్రం లభించలేదు. కృతిక తప్పిపోయిందా లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తుండగానే గురువారం తెల్లవారుజామున లక్ష్మీనగర్ లోని డ్రైనేజీలో నిర్జీవంగా కనిపించింది. వరదల్లో కొట్టుకపోవడంతో బాలిక చనిపోయిందని తెలుస్తోంది.