ఈ మధ్య ఖమ్మం జిల్లా పెరువంచ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు 12 మంది విద్యార్థులకు బలవంతంగా వెంట్రుకలు కత్తిరించిన వార్త రాష్ట్రవ్యాప్తంగా పెద్దచర్చకే తెరలేపింది. ఆమె చేసిన పనిని సమర్థించేవాళ్లు కొందరైతే, మరికొందరు సరికాదనే వాదనలు వెల్లువెత్తాయి. మొత్తానికి సమాజంలో పిల్లల పట్ల ఉన్న దృక్పథాలు ఇటువంటి సంఘటనల ద్వారా బయటపడతాయి. ముఖ్యంగా విద్యార్థులకు అన్ని సమయాల్లో బాసటగా ఉండాల్సిన ఉపాధ్యాయుల మానసిక స్థితిని కూడా తెలియజేస్తోంది. కొంతమంది ఉపాధ్యాయుల వివక్షతా దృక్పథం, ప్రవర్తన కారణంగా పిల్లలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇవి వివిధ రూపాల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ చర్యలను పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికే అనే సమర్థింపులు కూడా వింటున్నాం. సమాజంలో ఉపాధ్యాయులే పిల్లలకు రక్షకులుగా ముందు వరుసలో నిలుస్తారు. కానీ, పిల్లల పట్ల మన సమాజంలో ఉన్న చులకన భావం వలన పిల్లలకు రక్షణగా ఉండవలసిన ఉపాధ్యాయులే బాలల హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. పిల్లలపై క్రమశిక్షణ పేరుతొ శారీరక, మానసిక దండనలతో పిల్లల మనోభావాలను దెబ్బతీయడం వారి పట్ల వివక్షతకు దారితీస్తోంది. పాఠశాలలో విద్యార్థులపై దండన లేని వాతావరణం కలిగించడానికి జాతీయ బాలల హక్కుల కమిషన్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు చేసింది. వాటిని ఈ సందర్భంగా చర్చించడం చాలా అవసరం.
వివక్ష: కులం, లింగం, వృత్తి లేదా ప్రాంతం, ఫీజు చెల్లించకపోవడం, జుట్టు పెద్దగా ఉందని మగపిల్లలను, జుట్టు కత్తిరించుకున్నారని ఆడపిల్లలను, మగపిల్లలతో ఆడపిల్లలు మాట్లాడుతున్నారని, బట్టలు సరిగా వేసుకోలేదని ఇలాంటి కారణాలు చూపి పిల్లలను వివక్షకు గురిచేయడం. ఒక ప్రత్యేక సామాజిక సమూహం లేదా లింగ వివక్ష లేదా అసమర్థతపై దిగజారిన వ్యాఖ్యలను ఉపయోగించి సమాజపు సామాజిక దృక్పథాలు మూఢవిశ్వాసాలను పాఠశాలలోకి తీసుకురావడం. పాఠశాలల్లో విభిన్న పనులను, కూర్చునే స్థానాలను కేటాయించడం..ఇవన్నీ వివక్షగానే పరిగణించాలి. ఉదాహరణకు మరుగుదొడ్లను పిల్లలు శుభ్రపరచడం, టీచర్ల టిఫిన్ డబ్బాలు శుభ్రం చేయడం, టీచర్ల బ్యాగులను పిల్లలు మోయడం మొదలైనవి. అకడమిక్ సామర్థ్యంపై వ్యాఖ్యానించడం, కులం, సమాజం, మతం లేదా లింగం ఆధారంగా మధ్యాహ్న భోజనం వడ్డించడం లేదా గ్రంథాలయం పుస్తకాలు లేదా యూనిఫార్మ్ లేదా క్రీడా సామగ్రి పిల్లల సమూహానికి నిరాకరించడం. కావాలని ఉద్దేశపూర్వకంగా పిల్లల పట్ల నిర్లక్ష్యం వహించడాన్ని వివక్షగా పరిగణించాలి.
శారీరక వేధింపులు: పిల్లలను కొట్టడం, వెంట్రుకలు లాగడం, చెవులను పిండడం, చెంపలు కొట్టించడం, పిల్లలను అసౌకర్యమైన స్థితిలో ఉంచడం అంటే బెంచ్ పై నిలబెట్టడం, గోడకు కుర్చీలా నిలబెట్టడం, స్కూల్ బ్యాగ్ తలపై పెట్టి నిలబెట్టడం, వంగి కాళ్ల మధ్య నుంచి చేతులతో చెవులను పట్టుకోవడం, మోకాళ్లపై నిలబెట్టడం, జుట్టు కత్తిరించడంపై వస్తున్న వార్తలను తరచూ వింటున్నాం. ఉపాధ్యాయులు పిల్లల పట్ల కఠిన వైఖరిని ప్రదర్శించడం సరికాదు.
మానసిక వేధింపులు: విద్యార్థులపై మానసిక వేధింపులు విద్యారంగానికి, పిల్లల సంక్షేమానికి హానికరం. పిల్లలను హేళన చేయడం, అవమానకరమైన విశేషణాలను ఉపయోగించి పేర్లు పెట్టడం లేదా తిట్టడం, పిల్లలను అవమానించేలా వ్యాఖ్యలను ఉపయోగించడం శ్రేయస్కరం కాదు. విద్యాభ్యాసంలో వెనుకబడిన పిల్లలను పరోక్షంగా తిట్టడం. మీకు చదువు అబ్బదని, మీ అమ్మానాయనలాగానే అయిపోతారని పిల్లల నేపథ్యం లేదా స్థాయి లేదా తల్లిదండ్రుల వృత్తి లేదా కులం గురించి అవమానించడం వారిపై ప్రతికూల భావాలను పెంచుతాయి. పిల్లల ఆరోగ్య స్థితి లేదా కుటుంబ ఆరోగ్య పరిస్థితి గురించి అవమానించడం, విద్యా సామర్థ్యం అందుకోవడంలో వెనుకబడిన పిల్లలను తరగతి గదిలో తోటి పిల్లల మధ్యదూషించడం, ప్రత్యేక అవసరాలున్న పిల్లలు పుట్టుకతో వచ్చిన సమస్యలతో ఉన్న పిల్లలను లెర్నింగ్ డిఫికల్టీ లేదా మాట్లాడే లోపం, తడబాటు ఉన్న పిల్లలను అవమానించడం, శిక్షించడం, ఈ పిల్లలు ఇక మారరని మొండి పిల్లలని లేబుల్ వేయడం. పిల్లలను అవమానించేలా పేర్లు పెట్టడం మనం మానసిక వేధింపులుగా చూడాలి.
ఉపాధ్యాయులకు ఎన్సీపీసీఆర్సూచించిన మార్గదర్శకాలు..
సమయం, శుభ్రత, నియమాలు, అకడమిక్ సంబంధిత అంశాలను పాటించని పిల్లలపట్ల ఉపాధ్యాయులు సానుకూల ధోరణితో వ్యవహరించాలి. పిల్లలకు అర్థమయ్యేవిధంగా చెప్పి వారు మారడానికి అవకాశం ఇవ్వాలి. సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి పిల్లలకే అవకాశాలు ఇచ్చి చూడాలి. పిల్లల సమస్యలను కుటుంబ సభ్యులతో చర్చించాలి. పిల్లలు మనం అనుకుంటున్న లక్ష్యం సాధించలేకపోయినప్పుడు అసంతృప్తి కలిగినా పిల్లలకు తమకుతాముగా సమస్యలను ఎలా అధిగమించాలో వివరించాలి. విద్యపై దృష్టి సారించడానికి పిల్లలు కూర్చునే స్థలం మార్పు, తరగతిలో ఇతర పిల్లలతో సహాయం అందించడం, వారితో తరచుగా అవగాహన కలిగించడం చేయాలి. తరగతి గదిలో పిల్లల విషయంలో జరిగిన ప్రయత్నాలను తల్లిదండ్రులకు తెలియజేయాలి. పిల్లలకు కూడా ఇతర పిల్లల హక్కుల గురించి అవగాహన కలిగించాలి. ఇతరుల హక్కులను ఉల్లంఘించినప్పుడు పిల్లల ప్రవర్తనను బెదిరింపు లేకుండా వివరించడానికి ప్రయత్నం జరగాలి.
బడి ద్వారానే పేదరిక విముక్తి
పిల్లల సామాజిక, ఆర్థిక, నివాస ప్రదేశాల నేపథ్యం చాలా భిన్నమైనది. ఒక్కో విద్యార్థిది ఒక్కో నేపథ్యం. బడులకు వస్తున్న విద్యార్థుల మానసిక స్థితిగతులను తెలుసుకునేందుకు వారితో సంభాషించే సమయం తీరిక మన టీచర్లకు ఉండాలి. సమాజంలో జరుగుతున్న వివిధ మార్పులు మన పెద్దల మీద పడుతున్నట్లే పిల్లల మీద పడుతుంది. వారి భాష, వేషధారణ, నడక, ఆహారపు అలవాట్లు అన్నిటి మీద ప్రభావం ఉంటుంది. మన సమాజంలో అనుకరణలకు కొదవ లేదు. సినిమా హీరోలు, క్రికెట్ ఆటగాళ్ల వేషధారణ ప్రభావం ప్రతి యువతరం మీద పడుతున్నది. ఉపాధ్యాయులు సైతం ఈ ప్రభావం నుంచి వచ్చినవారే అని గ్రహించాలి. బడికి వస్తున్న పిల్లల కుటుంబాలు అత్యధిక శాతం సామాజిక, ఆర్థిక వెనుకబాటు నేపథ్యం ఉన్న కుటుంబాలు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను బడికి పంపే నైపుణ్యాన్ని ఇప్పుడిప్పుడే అంది పుచ్చుకుంటున్నారు. బడి ద్వారానే పేదరిక విముక్తి సాధ్యం. ఇది నమ్మిన తల్లిదండ్రులు వారి పిల్లలను అగౌరవపరిచే ఏ పని అయినా భరించలేరు. రాజ్యాంగం ప్రసాదించిన అన్ని హక్కులను ప్రభుత్వాలు అమలుచేసి బాలలపై అన్ని రకాల హింసను తుదముట్టించాలి. బాలల మనోభావాలను అర్థం చేసుకుని, పిల్లలతో సుహృద్భావంతో మెలగడానికి ఉపాద్యాయులు తగిన నైపుణ్యతలను పెంచుకోవాలి. పెద్ద మనసుతో పిల్లల ఉన్నతికి ఉపాధ్యాయులు అండగా నిలవాలి.
- ఆర్. వెంకట్ రెడ్డి
జాతీయ కన్వీనర్,
ఎం.వి.ఫౌండేషన్