ప్రపంచ దేశాల యుద్ధాల్లో అమానుషంగా బలవుతున్నవారిలో పసిపిల్లలే ఎక్కువ. మొన్నటికి మొన్న ఉక్రెయిన్‌పై రష్యా దాడుల్లో ఆహుతైన వేలాదిమంది పిల్లల ఉదంతం మరిచిపోకముందే, తాజాగా పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య యుద్ధజ్వాలల్లో చిన్నారులు సమిధలై ప్రాణాలు విడుస్తున్నారు. ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ సంస్థ 'హమాస్' మెరుపు దాడుల్లో పిల్లలు చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురవుతున్నారు. తీవ్రగాయాలతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పిల్లల మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. 1973లో పొరుగు దేశాలతో ఇజ్రాయెల్ చేసిన యుద్ధానికి 50 ఏండ్లయిన సందర్భంగా హమాస్ ఈ దాడులకు దిగుతుండడం గమనార్హం.
మెరుపుదాడులతో ఉలిక్కిపడిన ఇజ్రాయెల్, తిరిగి పాలస్తీనాలోని గాజాపై జరుపుతున్న వైమానిక దాడుల్లోనూ చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ఉగ్రవాదుల చేతుల్లో బందీలవుతున్న పిల్లల ఆర్తనాదాలు గుండెను పిండేస్తున్నాయి. ఓ జంట తమ కుమారుడు, కుమార్తెతో కలిసి నేలపై కూర్చొని తుపాకీ మోతల మధ్య భయంభయంగా బిగుసుకుపోతున్నారు. ‘మీ చేతులకు రక్తం ఎందుకుంది నాన్నా?’ అని ఆరేండ్ల బాలుడు భోరున ఏడుస్తూ తండ్రిని అడుగుతున్న తీరు సామాజిక మాధ్యమాల్లో గింగురులు కొడుతూ ప్రపంచ ప్రజలకు కన్నీళ్లను తెప్పిస్తోంది. ‘ నేను ఆమె బతికి ఉండాలని కోరుకున్నా.. కానీ నా సోదరి చనిపోయింది’ అని హమాస్ ఉగ్రవాదుల దురాగతాన్ని ఆ చిన్నారి చెబుతోంది. ‘అలా ఏమీ జరగలేదమ్మా’ అని తల్లి కన్నీళ్లు దిగమింగుతూ ఓదార్చే ప్రయత్నం చేస్తోంది. ఉగ్రవాదుల కంటపడకుండా తమ పిల్లలను నేలపై పడుకోపెడుతున్న తల్లిదండ్రుల వేదన అంతా ఇంతా కాదు. ఓ కుటుంబాన్ని బంధించి, వారి కళ్లముందే కుమార్తెను నిర్దాక్షిణ్యంగా ఉరితీసిన సంఘటన కూడా చోటుచేసుకుంది. ఇది క్రూరత్వానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ఓ నృత్య వేడుకపై జరిపిన దాడుల్లో రక్తం ఏరులై పారింది. ఆ ప్రాంతం మరుభూమిని తలపించింది. మృతుల్లో చాలామంది మహిళలు, చిన్నారులే ఉన్నారు.
ఇస్లామిక్ రాజ్యమే హమాస్ లక్ష్యం
హమాస్ అంటే 'హర్కత్ అల్ ముఖావమా అల్- ఇస్లామియా”. పాలస్తీనాలోని రెండు రాజకీయ పక్షాల్లో ఇదొకటి. 1987లో వెస్ట్‌బ్యాంక్, గాజా, తూర్పు జెరుసలేంలో ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రాంతాల్లో మొదటి ఇంతిఫదా (తిరుగుబాటు) ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమ సందర్భంగానే హమాస్ ఏర్పాటైంది. 1988లో ఈ సంస్థ తన చార్టర్‌ను ప్రకటించింది. ఒకప్పటి పాలస్తీనాను పునరుద్ధరించి ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది. 1998లో పాలస్తీనా నేత యాసర్ అరాఫత్, అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఇజ్ఞాక్ రాబిన్ మధ్య ఓస్లో ఒప్పందం కుదిరింది.
దీని ప్రకారం వెస్ట్‌బ్యాంక్, గాజాల్లో పాలస్తీనా అథారిటీ ఆధ్వర్యంలో పరిమిత స్వయం పాలన ప్రభుత్వం ఏర్పడింది. దీన్ని హమాస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఒప్పందాన్ని నిరసిస్తూ హింసకు దిగింది. ఆత్మాహుతి దాడికి పాల్పడింది. అది మొదలు హమాస్ దాడులకు పాల్పడుతూనే ఉంది. ఇస్లామిక్ సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌ను పాలిస్తున్న హమాస్ పక్కా ప్రణాళికతో వేలసంఖ్యలో రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతున్నది. మరోపక్క ఇజ్రాయెల్ సాయుధ దళాలు గాజాను పూర్తిగా దిగ్బంధించాలని తీసుకున్న నిర్ణయంతో అనేక కన్నీటి గాథలు వెలుగులోకి వస్తున్నాయి.
మహిళలు, చిన్నారుల కిడ్నాప్
భార్య, పిల్లలు అపహరణకు గురవడంతో ఓ బాధిత వ్యక్తి రోదిస్తున్న తీరు గుండెల్ని నులిపెడుతోంది. యోనీఅషెర్ ఉద్యోగరీత్యా సెంట్రల్ ఇజ్రాయెల్‌లో ఉంటున్నాడు. అతడి భార్య డోరాన్ ఇటీవల తన ఇద్దరు కుమార్తెలతో కలిసి గాజా సరిహద్దు సమీపంలోని పుట్టింటికి వెళ్లింది. ఒక్కసారిగా ఉగ్రవాదులు ఆ ఊరిపై విరుచుకుపడటంతో,తన భర్తకు ఫోన్ చేసి మాట్లాడుతుండగానే ఇంట్లోకి చొరబడ్డ మిలిటెంట్లు ఫోన్‌ను కట్ చేశారు. ఆ సమయంలో భర్త బాధను ఏ భాషలోకి అనువదించగలం? మహిళలు, చిన్నారులను బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకుని తీసుకెళ్తున్న తీరు మానవత్వ సంక్షోభానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. పిల్లలను వదిలేసి మమ్మల్ని బందీలుగా తీసుకెళ్లండని రోదిస్తున్న తల్లిదండ్రుల వెతను ఎవరు ఓదార్చగలరు? ప్రసార మాధ్యమాల వేదికగా వస్తున్న ఈ వీడియో దృశ్యాలు ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్నాయి. మానవత్వమున్న ప్రతి మనస్సును మెలిపెడుతోంది. కెఫర్ అజా కిబుజ్‌లో ఇజ్రాయెల్ రక్షణ దళం అభం శుభం తెలియని నలభై మందికిపైగా చిన్నారుల మృతదేహాలను గుర్తించింది.
అందులో కొన్నింటికి తలలు లేకపోవడం దిగ్ర్భాంతికి గురి చేస్తోంది. మరికొన్ని మృతదేహాలు మంచాలపై కాలిపడివున్నాయి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా మృతదేహాలు ఎక్కడపడితే అక్కడ పడివుండడం మరుభూమిని తలపిస్తోంది. గాజా స్ట్రిప్ నుంచి దక్షిణ ఇజ్రాయెల్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు కెఫర్అజా కిబూజ్ లో వీరిపై దాడికి దిగి 40 మంది చిన్నారులు, యువకులను నిర్బంధంలోకి తీసుకున్నారు. పిల్లల తలలను నరికివేశారు. మహిళలు, పిల్లల చేతులకు సంకెళ్లు వేసి నుదిటిపై కాల్చి చంపారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) ప్రకటించింది.
చావు బతుకుల మధ్య శిశువులు
ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మృతదేహాలను సేకరించి అంత్యక్రియలు జరిపే జాకా అనే సంస్థ వలంటీర్లు అక్కడి అకృత్యాలు చూసి చలించిపోతున్నారు. 388 ఏండ్లుగా ఈ సంస్థ తరఫున వలంటీర్లు పనిచేస్తున్నారు. గాజాలో చెల్లాచెదురుగా పడివున్న మృతదేహాలను సేకరించి బ్యాగుల్లో పెట్టడానికి వాళ్లకు పదకొండు గంటల సమయం పట్టింది. ఉత్తర గాజాలోని ఆసుపత్రుల్లో మరింత ఇబ్బందికర వాతావరణం నెలకొంది. ప్రధాన ఆసుపత్రిలో 35 వేలమంది రోగులున్నారు.
యుద్ధంలో గాయపడిన వేలాదిమందితో మిగతా ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. ఇంక్యుబేటర్లు, ఐసీయుల్లో శిశువులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఆసుపత్రుల్లో ఇంధనం తగ్గిపోతున్నదని, ఇది రోగులపాలిట ఉరిశిక్షగా మారనుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. మరోవైపు ఆహార నిల్వలు పడిపోతుండటం, నీటి సరఫరాకు ఇబ్బంది కలుగనుండడంతో గాజాలో తీవ్ర సంక్షోభం ఏర్పడనుంది.
గాజా ప్రజలు విలవిల
గాజా ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని ఒకచోటు నుంచి మరోచోటుకు... రక్షణ అందే ప్రాంతానికి పరుగులు తీస్తున్నారు. పిల్లలను తీసుకుని పాలస్తీనా శరణార్థులుండే చోటకు ప్రాణభయంతో వెళుతున్నారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లల ప్రాణాలు కోసం తపన పడుతున్నారు. పిల్లలను వారి భుజాలపై ఉంచుకుని వణుకుతూ పరిగెత్తుతున్న దృశ్యాలు అనేకం కనిపిస్తున్నాయి. మొత్తం 23 లక్షల మంది జనాభా ఉన్న గాజా నగరంలో సగం మంది పిల్లలే ఉన్నారు. 40 శాతం మంది 15 ఏండ్లలోపు వారే. ప్రపంచంలో ఎక్కడాలేనంత 45శాతం నిరుద్యోగం ఇక్కడ తాండవిస్తోంది. 75 శాతం మంది ప్రజలు రోజువారీ ఆహారం కోసం అంతర్జాతీయ సాయం కోసం ఎదురుచూస్తుంటారు. తాగునీరు, విద్యుత్, ఆహారం, నిత్యావసరాలు ఏది కావాలన్నా ఇజ్రాయెల్‌పై గాజా ఆధారపడుతోంది. 95 శాతం ప్రజలకు మంచినీరు అందుబాటులో లేదు. అందుకే గాజాను పూర్తిగా నిర్చంధిస్తున్నామంటూ ఇజ్రాయెల్ చేసిన ప్రకటనపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
- కోడం పవన్‌కుమార్, సీనియర్ జర్నలిస్ట్