
సంగారెడ్డి టౌన్, వెలుగు: బాల కార్మిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఎవరైనా పనిలో పెట్టుకుంటే రూ. 20 వేల నుంచి రూ. 50 వేల వరకు జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష ఉంటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయవాది సదానందం హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లోని కార్మిక శాఖ కార్యాలయంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కార్మిక చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
జిల్లా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ యాదయ్య మాట్లాడుతూ బాల కార్మికుల్లో సగంమంది ప్రమాదకరమైన పనుల్లో ఉన్నారని, వారిని గుర్తించి విముక్తి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబరర్ ఆఫీసర్ జహీరాబాద్ ప్రవీణ్, అసిస్టెంట్ కమిషనర్ జాసన్, వీరేశం, సంగారెడ్డి క్లాత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మురళి పాండురంగం, బీఎంఎస్ జనరల్ సెక్రటరీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.