శిథిలాల మధ్య భావితరం

ప్రపంచవ్యాప్తంగా వివిధ సందర్భాల్లో జరిగిన, జరుగుతున్న సాయుధ ఘర్షణలు, ప్రకృతి విపత్తుల మధ్య చిన్నారులు చిక్కుకుని గిలగిలలాడుతున్నారు. ప్రతి నలుగురిలో ఒకరు మృత్యువాత పడుతున్నారు. యెమెన్, మాలి, దక్షిణ సుడాన్, ఉక్రెయిన్, తుర్కియే(టర్కీ), సిరియా, శ్రీలంకలతో పాటు పలు దేశాల్లో సాయుధ ఘర్షణలల్లో మరణించిన పిల్లలు లెక్కలేదు. ఏడాదికి సగటున15.5 కోట్లు మంది చిన్నారులు విపత్తుల ప్రభావానికి గురవుతున్నారు. గాయపడి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడినవారి సంఖ్య లక్షల్లో ఉంటోంది. ఆచూకీ లేకుండా పోయిన చిన్నారులు వేలల్లో ఉంటున్నారు. ఒంటరిగా మిగిలిపోతున్న పిల్లలు ఎన్నో శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. పుట్టకొకరు చెట్టుకొకరుగా మారిన పిల్లలు18 శాతం వరకు ఉంటున్నారు. బాల కార్మికులుగా దుర్భర జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. అది భోపాల్ ఉదంతమే కావొచ్చు, ఉక్రెయిన్​పై రష్యా దాడులే కావొచ్చు, లేదంటే తాజాగా జరిగిన తుర్కియే, సిరియాల్లో సంభవించిన భారీ భూకంపమే కావొచ్చు. ఈనెల మొదటి వారంలో జరిగిన ఈ భూవిలయం పెద్ద విషాదాన్ని మిగిల్చింది. రెక్టర్ స్కేల్​పై 7.8 తీవ్రతతో భూమి కంపించడంతో కాళ్ల కింద నేల బీటలు వారింది. కళ్లెదుటే నిలువెత్తు భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఎక్కడ చూసినా శిథిలాలు, వాటి కింద చిక్కుకున్న బాధితుల ఆర్తనాదాలు, చిన్నారులు ఆక్రందనలు. లెక్కించలేని ప్రాణ, ఆస్తి నష్టం. 46 వేలకుపైగా దాటిన మృతుల సంఖ్యతో జపాన్​లోని పుకుషిమాలో చోటు చేసుకున్న భూకంపం, సునామీలను మరిపించింది. వేల మంది గాయాలతో బయటపడ్డారు. లక్షలాది మంది ఆ ప్రాంతాన్ని వదిలి వేరే చోటుకు వలస వెళ్లారు. ఇందులో చిన్నారుల వెతలు అంతా ఇంతా కాదు. ప్రకృతి కన్నెర్రకి పసికందులు వడలిపోయారు. అంతులేని విషాదాన్ని మిగిల్చిన ఈ భూకంపం భావిపౌరులను ఆ దేశాలకు దూరం చేశాయి. ఒక తరాన్ని కళ్లముందే నేలకూల్చింది. మరో తరం అందిరాకుండా పోయింది.

రెండు జాగిలాల కృషితో..

ఒకరోజుతో సరిపోయింది కాదు. ఏకంగా నాలుగైదు రోజుల పాటు భవన శిథిలాల కింద చిక్కుకు పోయారు. ఆహారం, నీళ్లు లేకపోయినా ప్రాణాలు నిలబెట్టుకున్నారు. అద్నాన్ మహ్మ ద్ కోర్కుట్ అనే ఓ యువకుడు దాహార్తికి తాళలేక తన మూత్రాన్నే తాగాడు. చలిగాలులు వణికిస్తున్నా, ఎటూ కదలలేక చిన్నారులు మృత్యువుతో పోరాడుతూ అజేయులుగా నిలిచారు. మరో యువకుడిని వాట్సప్ కాపాడింది. తూర్పు తుర్కియేలోని ఓ అపార్టుమెంట్ భవన శిథిలాల కింద చిక్కుకున్న ఆ యువకుడు, సమయస్ఫూర్తితో తన స్నేహితులకు వాట్సప్ లో వీడియో సందేశం పంపాడు. అందులో తాను ఏ ప్రాంతంలో ఉన్నదీ చెప్పాడు. అదియామన్ ప్రాంతంలో ఉన్నట్లు చెప్పాడు. అతడి స్నేహితులు సహాయ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు ఆ యువకుడ్ని కాపాడారు. నాలుగేళ్ల చిన్నారి ఏకంగా నాలుగు రోజులకుపైగా శిథిలాల కింద చిక్కుకుని ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడింది. బొడ్డు ఊడకుండా ఉన్న ఓ పసికందును సహాయక బృందాలు రక్షించిన తీరు ప్రశంసనీయంగా మారింది. జన్మనిచ్చిన తల్లితో సహా కుటుంబమంతా చనిపోవడంతో పాపాయికి చికిత్స అందిస్తోన్న ఓ వైద్యుడి భార్య ఆ శిశువుకు పాలు పట్టి మానవత్వాన్ని చాటుకుంది. డాక్టర్ ఆ శిశువుకు ‘అద్భుతం’ అని అర్థం వచ్చే పేరు పెట్టాడు. ఈ పాపను దత్తత తీసుకునేందుకు వందల మంది ముందుకు వస్తుండంతో ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ప్రచారం పొందింది. ఈ భూకంప దుర్ఘటనలో తుర్కియేలోని ఏడంతస్తుల హెూటల్​లో బస చేస్తున్న వాలీబాల్ క్రీడాకారుల ఆచూకీ తెలియకుండా పోయింది. బాలబాలికలతో కూడిన ఆటగాళ్ల బృందం ఆనవాళ్లు దొరక్కపోవడం గుండెను నలిపెడుతోంది. బెరెన్ అనే ఓ ఆరేళ్ల బాలికది మరో విషాదగాథ. ఈ బాలికను రక్షించడంలో ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన రోమియో, జూలీ అనే రెండు జాగిలాలు హీరోలయ్యాయి.

యూనివర్సల్ క్యాష్ బెనిఫిట్ స్కీమ్​లతో..

తుర్కియే, సిరియా దేశాల్లో సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తుంటే ఎక్కువగా పిల్లలే శిథిలాల కింద నుంచి ప్రాణాలతో బయటికి వస్తున్నారు. వీరంతా తల్లిదండ్రులు, బంధువుల్ని కోల్పోయి అనాథలుగా మారడం విషాదంలోకెల్ల మరింత విషాదమైంది. పన్నెండేండ్లుగా అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియాలో ఇప్పటికే చిన్నారులు దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. యుద్ధ వాతావరణంలో గత పదేళ్లలో 50 లక్షల మంది జన్మిస్తే వారిలో మూడో వంతు మంది పిల్లలు మానసిక సమస్యలతో నలిగిపోతున్నారు. బాంబు దాడుల్లో ఇప్పటికే 25 లక్షల మంది మరణించారు. ఈ భూకంపం మరింత విలయాన్ని సృష్టించిం ది. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు జరిగే ప్రాంతాలు, కరువు, పేదరికం ఎదుర్కొంటున్న దేశాల్లో చిన్నారుల విద్య, సంక్షేమం కోసం ఐక్యరాజ్యసమితి సంస్థ యునిసెఫ్ కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. యూనివర్సల్ క్యాష్ బెనిఫిట్ స్కీమ్​లతో పిల్లలకు ప్రతి నెలా ఆదాయం వచ్చేలా చూడాలి. శరణార్థులు సహా అవసరంలో ఉన్న పిల్లలందరికీ సామాజిక సాయం అందించాలి. సంక్షేమ వ్యయాన్ని వీలైనంత వరకు పరిరక్షించాలి. చదువులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి. మాత శిశు సంరక్షణ, పోషకాహారం అందించాలి. బాధిత కుటుంబాలకు మూడు పూటలు కడుపు నిండేలా నిత్యావసరాలపై ధరల నియంత్రణ ప్రవేశపెట్టాలి. ఇవన్నీ పూర్తిస్థాయిలో ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు అందించగలిగితే భవిష్యత్ తరాన్ని  కాపాడుకోగలుగుతాము.

హృదయ విదారకం

భూకంప ధాటికి కకావికలమైన తుర్కియే, సిరియాల్లో శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాల కోసం కలవరపడుతున్న పలువురు చిన్నారులు కొందరైతే, బతికి బయటపడుతున్న చిన్నారులకు గుక్కెడు నీళ్లందక తల్లడిల్లుతున్న హృదయ విదారక దృశ్యాలు మరికొన్ని. భూకంపం ధాటికి భవనం కూలడంతో ఆ శిథిలాల్లో చిక్కుకుపోయిన అక్కాతమ్ముడి తండ్లాట నుంచి వచ్చిన కన్నీళ్లను కొలవలేము. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ తన బుజ్జి తమ్ముడికి ఏం కాకుండా చూసిందా ఏడేండ్ల బాలిక. ఓవైపు తాను బండరాయి కింద నలిగిపోతున్నా తమ్ముడికి దెబ్బలు తగలకుండా అతడి తలపై చెయ్యి అడ్డుపెట్టింది. ప్రకృతి విపత్తుతో అతలాకుతలమైన సిరియాలో కన్పించిన ఈ దృశ్యం హృదయాల లోతుల్ని ఆర్ద్రతతో తడిమింది. కహ్రామున్మారస్ నగరంలో కుప్పకూలిన అపార్ట్​మెంట్ భవన శిథిలాల నుంచి మూడేళ్ల బాలుడిని ప్రాణాలతో సహాయ బృందాలు బయటకు తీశాయి. అదియమాన్ నగరంలో 10 ఏళ్ల బాలికను కాపాడారు. అలెప్పో గ్రామీణ ప్రాంతంలో శిథిలాల మధ్య ఓ మహిళ ప్రసవించింది. కొత్తగా విధ్వంసకరమైన లోకాన్ని చూసిన ఆ శిశువును సహాయ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసి ప్రాణాన్ని కాపాడగలిగారు. కానీ తల్లి మాత్రం కన్నుమూసింది. ఓ విపత్తును ఎదిరించి పురుడు పోసుకున్న ఆ బాలుడు సిరియా దేశస్థులకు ఆశాకిరణంగా మారగా, తల్లీబిడ్డలను వేరు చేసిన ఘటనలు కూడా అనేకంగా ఉన్నాయి. కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకుని అనాథగా మారిన ఏడాదిన్నర బిడ్డ ‘మా అమ్మ ఏది, ఎక్కడుంది’ అని ఏడుస్తుంటే హృదయాలను పిండేస్తోంది.
- కోడం పవన్ కుమార్,
సీనియర్​ జర్నలిస్ట్