- గత సర్కారు విధానాలతో గిరి పుత్రులు చదువులకు దూరం
- హైస్కూళ్లలో వేధిస్తున్న సబ్జెక్ట్ టీచర్ల కొరత
నాగర్‌కర్నూల్, వెలుగు: వెనుకబడిన నాగర్‌కర్నూల్ జిల్లాలోని గిరిజన తండాల్లో పిల్లలు సర్కారు చదువులకు దూరమవుతున్నారు. రాష్ట్రంలో సింగిల్ టీచర్ స్కూల్స్ ఉండవంటూ గత ప్రభుత్వం ఆర్బాటంగా ప్రకటించి, టీచర్ల ఖాళీలను భర్తీ చేయక, విద్యా వలంటీర్ల నియామకాలు చేయక ప్రభుత్వ విద్యను అటకెక్కిచింది. జిల్లాలో 825 గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే, అందులో 61 బడులను శాశ్వతంగా మూసేశారు.
ఇందులో ఎక్కువగా గిరిజన తండాల్లోనివే కావడం విశేషం. తెలుగు మీడియం స్కూళ్లకు ఆదరణ తగ్గడంతో గిరిజన తండాలు, చిన్న పల్లెల నుంచి పిల్లలను మండల కేంద్రాల్లోని ఇంగ్లిష్ మీడియం స్కూల్స్‌కు పంపిస్తున్నారు. మిగిలిన వారు చదువు మానేసి ఇతరత్రా పనులకు
వెళ్తున్నారు.
61 బడులు మూతపడినయ్..
జిల్లాలో 825 బడులు ఉండగా, వివిధ కారణాలతో రెండేండ్లలో 61 ప్రైమరీ స్కూల్స్ మూతబడ్డాయి. కల్వకుర్తి, అచ్చంపేట పట్టణాలతో పాటు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సొంత ఊరిలోనూ స్కూల్ మూత పడింది. నాగర్‌కర్నూల్ మండలంలో 2, బిజినేపల్లి మండలంలో 4, తాడూరు మండలంలో1, తెల్కపల్లిలో 3 ,తిమ్మాజీపేటలో 2, పెద్దకొత్తపల్లిలో 2, కోడేరులో 4, కొల్లాపూర్‌లో 3, పెంట్లవెల్లిలో 1, బల్మూరులో 3, ఉప్పునుంతలలో 9, చారకొండలో 4, అచ్చంపేట పట్టణంలో 6, అమ్రాబాద్ లో 3, పదరలో 3, లింగాలలో 2, కల్వకుర్తి పట్టణంలో 1, వెల్దండలో 7, ఊర్కొండలో 3 స్కూల్స్ క్లోజ్ చేశారు. మరో 107 గవర్నమెంట్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య అంతంతమాత్రంగానే ఉంది.
వేధిస్తున్న ఖాళీలు..
పిల్లలు లేరని స్కూల్స్ మూసేస్తే మరోవైపు స్టూడెంట్స్ ఉన్న హైస్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్ల కొరత వేధిస్తోంది. జిల్లాలో 1,034 మంది స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, పండిత్‌లు బదిలీలకు సిద్దమైతే, 512 మందికి ప్రమోషన్లు దక్కనున్నాయి. ఇదిలాఉంటే జిల్లాలోని పలు స్కూళ్లలో కీలకమైన మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్, బయాలజీ సబ్జెక్ట్ టీచర్లు లేకుండా, ఒక్కలెసన్ కూడా చెప్పకుండానే విద్యా సంవత్సరం గడిచిపోయింది. జిల్లాలో 900 టీచర్ పోస్టులు ఖాళీ అవుతాయని విద్యాశాఖ అధికారుల అంచనా.
డిప్యుటేషన్లతో స్టూడెంట్లకు అన్యాయం..
గత విద్యా సంవత్సరంలో ఎమ్మెల్యేలు, ఉపాధ్యాయ సంఘాల లీడర్లను పట్టుకుని తిమ్మాజీపేట, బిజినేపల్లి, వెల్దండ మండలాల్లోని హైవేలు, మెయిన్ రోడ్ల పక్కన ఉండే స్కూళ్లకు టీచర్లు డిప్యుటేషన్లు వేయించుకున్నారు. స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని హై స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్‌లోని ఖాళీలను వర్క్ అడ్జస్ట్మెంట్ కింద డిప్యుటేషన్ల మీద పంపించడానికి ఏటా 200 మందిని టీచర్లను కోరుకున్న బడికి పంపించే ఆచారం జిల్లాలో కొనసాగుతోంది.
అయితే మారుమూల ప్రాంతాలకు మాత్రం టీచర్లను డిప్యుటేషన్‌పై పంపించడం లేదు. దీంతో అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని ఏజెన్సీ ప్రాంత స్కూళ్లు, కోడేరు, పెద్దకొత్తపల్లి, అమ్రాబాద్, పదర, లింగాల, బల్మూర్, వంగూరు మండలాల్లోని హైస్కూళ్లలో ఏండ్ల తరబడి సబ్జెక్ట్ టీచర్లు లేకపోయినా డిప్యుటేషన్‌పై పంపించడం లేదు. కోడేరు మండల కేంద్రంలోని హైస్కూల్లో గత ఏడాది మొత్తం బయాలజీ, ఇంగ్లిష్, హిందీ బోధించే టీచర్ లేకుండానే నడిచిపోయింది.
ప్రభుత్వం చర్యలు తీసుకున్నా..
విద్యా సంవత్సరానికి ముందే గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్‌కు యూనిఫాం, టెక్ట్స్, నోట్ బుక్స్, మిడ్ డే మీల్స్ఇస్తున్నా ప్రభుత్వపాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు. ఇక బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్చడానికి ప్రారంభించిన బడిబాట మొక్కుబడిగా సాగింది. టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ ప్రకటించడంతో టీచర్లు ట్రాన్స్ఫర్లపైనే దృష్టి పెట్టారు.
ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఇంట్రస్ట్ చూపించలేదు. జిల్లాలోని 20 మండలాల్లో గవర్నమెంట్ స్కూల్ టీచర్లు బడిబాట నిర్వహించినా ఫలితం అంతంత మాత్రమే. మధ్యాహ్న భోజనం సమకూర్చే ఏజెన్సీల బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో చాలా స్కూళ్లలో మిడ్ డే మీల్స్‌కు గ్యారెంటీ లేకుండాపోయింది. గత ప్రభుత్వం పుణ్యమాని పోయిన ఏడాది స్కూళ్లలో మధ్యాహ్న భోజనం అంతంతమాత్రంగానే పెట్టారు.