
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్, హరిద్వార్(గ్రామీణ) అసెంబ్లీ స్థానాల నుంచి ఇద్దరు మాజీ సీఎంల కుమార్తెలు తమ తండ్రుల ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. కోట్‌ద్వార్ స్థానం నుంచి బీజేపీ మాజీ సీఎం భువన్ చంద్ర ఖండూరి కుమార్తె రీతూ ఖండూరి భూషణ్ పోటీ చేస్తుండగా, హరిద్వార్ రూరల్ స్థానం నుంచి కాంగ్రెస్ మాజీ సీఎం హరీశ్ రావత్ కుమార్తె అనుపమ రావత్ బరిలోకి దిగారు. ఖండూరి 2012 ఎన్నికల్లో కోట్‌ద్వార్ నుంచి ఓడిపోగా, 2017లో హరిద్వార్ రూరల్ నుంచి హరీశ్ రావత్ వెనుదిరిగారు. 2012లో కోట్‌ద్వార్‌లో ఖండూరిపై కాంగ్రెస్ అభ్యర్థి సురేంద్ర సింగ్ నేగి 4,623 ఓట్ల తేడాతో గెలిచారు. 2017లో హరిద్వార్ రూరల్ నుంచి పోటీ చేసిన హరీశ్ రావత్ బీజేపీ అభ్యర్థి స్వామి యతీశ్వరానంద చేతిలో 12,278 ఓట్ల తేడాతో ఓడిపోయారు. వారి తండ్రులను ఓడించిన ప్రత్యర్థులతోనే ఇప్పుడా సీఎంల బిడ్డలు బరిలోకి దిగుతున్నారు.