‘పిల్లలూ దేవుడూ చల్లనివారే కల్ల కపట మెరుగని కరుణామయులే, తప్పులు మన్నించుటే దేవుని సుగుణం’ అని ఆరుద్ర ఒక పాట రాశారు. పిల్లలు దైవానికి ప్రతిరూపాలు, దివ్యత్వానికి ప్రతినిధులు. కల్మషం, కర్కశం, కపటం, అసూయ, ద్వేషాలు ఎరుగని అమలినమైన ప్రవర్తన వారి సొంతం. అలాంటి పిల్లలకు తల్లిదండ్రులుగా, కుటుంబం నుంచి ఎలాంటి మార్గదర్శకత్వం, సమాజపరంగా లేదా పాఠశాలపరంగా ఎటువంటి వాతావరణం పిల్లలకు మనం అందిస్తున్నామనే దానిపైనే వారి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. న్యూటన్ ‘చర్య, ప్రతిచర్య’ సిద్ధాంతంలాగ చర్యలపరంగా ఎలాంటి శిక్షణ అందిస్తామో ప్రతి చర్యగా అలాంటి ఉత్తమమైన ప్రవర్తనను వారినుంచి మనం ఆశించవచ్చు. ఇటీవల చైనా కంపెనీ వీవో మనదేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగంపై ఓ సర్వే నిర్వహించగా విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ సర్వే ప్రకారం స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల తల్లిదండ్రులు, పిల్లల సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని, రోజులో సగటున పెద్దలు 5గంటలకుపైగా, పిల్లలు నాలుగు గంటలకుపైగా స్మార్ట్ఫోన్లు వాడుతున్నారని తేలింది. ఎక్కువభాగం సోషల్ మీడియా..ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్(ట్విట్టర్), వినోద కార్యక్రమాలు వీక్షిస్తున్నట్టు తెలిపింది.
దీని ద్వారా యుక్త వయస్సు పిల్లలు, చిన్న పిల్లలు ఇతర దురలవాట్లకు గురయ్యే ప్రమాదం ఉందని కూడా సూచించింది. సంబంధాలు దెబ్బతినడానికి స్మార్ట్‌ఫోన్ కూడా ప్రధాన కారణం అని 73 శాతం మంది తల్లిదండ్రులు, 69శాతం మంది పిల్లలు ఈ సర్వేలో అంగీకరించటం విశేషం. అలాగే స్మార్ట్‌ఫోన్ లేకుండా మేం ఉండలేం అని 76 శాతం మంది తల్లిదండ్రులు, 71 శాతం మంది పిల్లలు ఈ సర్వేలో ఒప్పుకున్నారంటే దేశంలో సోషల్‌మీడియా వినియోగం వల్ల మానవ సంబంధాల విధ్వంసం రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు.
ఆస్ట్రేలియాలో పిల్లలు స్మార్ట్‌ఫోన్ వినియోగంపై నిషేధం
స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని ఇటీవలే ఆస్ట్రేలియా దేశం 16 ఏండ్లలోపు పిల్లలకు నిషేధించింది. మన దేశం కూడా ముందు ముందు విపత్కర పరిస్థితులు ఎదుర్కోకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగానే మేల్కొని పిల్లలకు, పెద్దలకు హానికల్గించే స్మార్ట్‌ఫోన్లను, సోషల్ మీడియాలో వచ్చే అశ్లీలమైన వీడియోలు ఏవైనా ఉంటే నిలిపివేసేవిధంగా కఠిన చర్యలు తీసుకోవాలి.
ఒక చిన్న యంత్రం కుటుంబ బంధాల్లో చిచ్చుపెట్టి విడిపోవడానికి కారణం అవుతోందంటే మనం దీనిని ఏ స్థాయిలో దుర్వినియోగం చేసున్నామో అర్థం చేసుకోవచ్చు. టీనేజ్ మనిషి జీవితంలో ఒక సునామీ వంటిది. శరీరంలో మానసికంగా భావోద్వేగపరమైన హార్మోన్ల మార్పులు ఒక్క
సారిగా మనిషిని చుట్టుముడతాయి. వాటిని అర్థం చేసుకోలేక సమన్వయం చేసుకోలేక యువతీ, యువకులు తీవ్రమైన ఒత్తిడికిలోనై ఇతర ఆకర్షణలకు బానిసలవుతుంటారు.
మనిషి జీవితంలో విలువైనది బాల్యం
ఈ సమయంలోనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను, యువతీ, యువకులను గమనించి పాజిటివ్ కౌన్సెలింగ్ ఇవ్వాలి. లేనిపక్షంలో అనేక రకాల సంఘర్షణలకులోనై మాదకద్రవ్యాలకు, చెడువ్యసనాలకు, ఇతర అసాంఘిక కార్యక్రమాల వైపు వెళ్ళి తల్లిదండ్రులను ముద్దాయిలుగా చిత్రించే ప్రమాదం కూడా ఉంటుంది. మనిషి జీవితంలో అత్యంత విలువైనది బాల్యమే.
అలాంటి బాల్యాన్ని రంగులమయం చేసుకొని, విలువైన యవ్వన కాలంలో అకడమిక్ విషయాలపై ప్రధానంగా దృష్టిపెడితే పిల్లలు సుందరమైన భవిష్యత్తును నిర్మించుకోగలరు. అందుకే తమ సంతానం వ్యక్తిత్వాన్ని తల్లిదండ్రులు ఎలా అయితే తీర్చిదిద్దుతారో వారికి అలాంటి భవిష్యత్ ముందు ముందు దొరుకుతుంది. సంస్కారం, శిక్షణలతోనే మనిషి వ్యక్తిత్వం రూపు దిద్దుకుంటుంది. కాబట్టి, అలాంటి ఉత్తమ శిక్షణ పిల్లలకు ఇచ్చి ఉత్తమ విలువలుగల పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
- డా. మహ్మద్ హసన్,అసిస్టెంట్ ప్రొఫెసర్-