బాలలకు రాజ్యాంగ విలువలు నేర్పాలి

బాలలకు రాజ్యాంగ విలువలు నేర్పాలి

 నేటి బాలలే రేపటి పౌరులు. 142 కోట్ల భారతదేశ జనాభాలో 15 ఏళ్లలోపు ఉన్న బాలలు 36 కోట్లు.  దేశ జనాభాలో వీరు 25.4%. భవిష్యత్తు భారతావని ముఖచిత్రాన్ని మార్చే మూలస్తంభాలే ఈ చిన్నారులు.  ప్రస్తుత పరిస్థితుల్లో భారత రాజ్యాంగ విలువలను నేటి బాలలకు నేర్పించడం అత్యావశ్యకం. నవ భారత నిర్మాత బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లు ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడు. భారతదేశ ప్రజలందరి ఆశయాలు, ఆకాంక్షల కూర్పే మన రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత.

 దేశ ప్రజలందరూ ఇష్టపూర్వకంగా ఒప్పుకొని ఆమోదించుకున్న నియమాలు, ప్రతిజ్ఞలు, హక్కులు, బాధ్యతల సమాహారమే భారత రాజ్యాంగం. రాజ్యాంగం అంటే కేవలం ప్రభుత్వ విధివిధానాలే కాదు అణగారిన వర్గాల, పీడిత ప్రజల ఆశయాలను ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉండాలన్నది అంబేద్కర్ ఆశయం. ఆయన కృషి ఫలితంగానే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నూతన రాజ్యాంగం రూపొందించబడింది.

26 నవంబర్‌‌‌‌ 1949న భారత రాజ్యాంగసభ అధికారికంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. రాజ్యాంగ విలువల పట్ల దేశ ప్రజల్లో గౌరవ భావాన్ని పెంపొందించడానికి 2015 నవంబర్ 26 నుంచి ప్రతి ఏటా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రాజ్యాంగ దినోత్సవం నాడు ప్రభుత్వ కార్యాలయాల్లో,  ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో రాజ్యాంగ ప్రాముఖ్యతపై ఉపన్యాసాలు, వ్యాసరచన పోటీలు నిర్వహించి రాజ్యాంగ విలువల విశిష్టతను తెలపాలని నిర్ణయించారు.

భారత రాజ్యాంగం ప్రాముఖ్యతను తెలియజేయడానికి  బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు, భావవ్యాప్తి కోసం నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 74 సంవత్సరాలు పూర్తి అయింది. దేశంలో భిన్నత్వంలో ఏకత్వం కొనసాగడానికి రాజ్యాంగం ఎంతో దోహదపడింది.  ప్రతి ప్రభుత్వానికి రాజ్యాంగం అతి ముఖ్యమైనది. ప్రభుత్వం అనేది శరీరమైతే రాజ్యాంగం అనేది ఆత్మవంటిది. 

రాజ్యాంగ ప్రవేశికపై ప్రతిజ్ఞ చేయించాలి

భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశ సూత్రాలతో దేశ ప్రజలందరూ ఒక్కటే అని చాటి చెప్పింది. నేటి బాలల్లో చిన్నప్పటి నుంచే భారత రాజ్యాంగ విలువలు పెంపొందించడానికి, ప్రజలంతా ఒకటే అనే భావన కల్పించుటకు, మనుషుల మధ్య ఉన్న సామాజిక, ఆర్థిక అంతరాలు మనుషులను దూరం చేయకూడదని, వీరిలో సమతా భావం పెంపొందించుటకు భాలలకు భారత రాజ్యాంగ విలువలు నేర్పించాలి. బాలలకు భారత రాజ్యాంగ విలువలపై అవగాహన కల్పించడం కోసం బాల్యం నుంచే ప్రతిరోజు బడుల్లో, కళాశాలల్లో ప్రార్థన సమయంలో విధిగా భారత రాజ్యాంగ ప్రవేశికపై ప్రతిజ్ఞ చేయించాలి.

తెలంగాణ బాలలకూ.. 

బాల్యం నుండే భారత రాజ్యాంగంపై గౌరవం, మౌలిక లక్ష్యాలను ఆచరించాలనే ఆలోచన బాలల్లో పెరుగుతుంది. బాలల్లో రాజ్యాంగ విలువలు, లక్ష్యాల మీద పూర్తి అవగాహన కల్పించడం వల్ల వారిని అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్ది భవిష్యత్ తరానికి అందించిన వారమవుతాం. రాజ్యాంగ రచయితల ఆశయ సాధనకు మనం కృషి చేసినవారం అవుతాం. సెప్టెంబర్ 2023 నుంచి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం బడుల్లో, కాలేజీల్లో  ప్రార్థన సమయంలో విద్యార్థులు ప్రతి  రోజూ భారత రాజ్యాంగ ప్రవేశిక విధిగా చదవాలని నిర్ణయించి అమలు చేస్తున్నది.

తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం చొరవ తీసుకొని బాలల్లో భారత రాజ్యాంగ విలువల పెంపుపై  నిర్ణయం తీసుకొని రాజ్యాంగ మౌలిక లక్ష్య సాధన కోసం రాష్ట్రంలోని అన్ని బడుల్లో, కళాశాలల్లో ప్రార్థన సమయంలో భారత రాజ్యాంగ ప్రవేశ ప్రతిజ్ఞ చేయించేలా చర్యలు తీసుకోవాలి.  తెలంగాణ పౌరులను భారతదేశంలోనే అత్యున్నత విలువలు గల వ్యక్తులుగా తీర్చిదిద్దే ప్రయత్నం రేవంత్ సర్కారు చేస్తుందని ఆశిద్దాం.

- పాకాల శంకర్ గౌడ్
సోషల్​ ఎనలిస్ట్