
వాషింగ్టన్: అమెరికాలో వేలాదిమంది ఇండియన్లు బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్నారు. డిపెండెంట్ వీసాతో తల్లిదండ్రులతోపాటు చిన్నతనంలోనే అమెరికాలో అడుగుపెట్టిన వారు తమకు 21 ఏండ్లు దాటుతుండడంతో టెన్షన్ పడుతున్నారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం.. హెచ్1 బి వీసా హోల్డర్ వెంట వచ్చిన చిన్నారులు 21 ఏండ్లు నిండే వరకూ అమెరికాలో ఉండొచ్చు.
ఆ తర్వాత వారికి డిపెండెంట్ హోదా రక్షణ ఉండదు. రెండేళ్ల గడువులో వీసా స్టేటస్ ను మార్చుకోకుంటే తాము పుట్టిన దేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈలోపే తల్లిదండ్రులకు గ్రీన్ కార్డ్ వస్తే గొడవేలేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే మనోళ్లు ఆందోళనకు గురవుతున్నారు.
స్టూడెంట్ వీసా కిందికి మారొచ్చు..
వీసా స్టేటస్‌ను డిపెండెంట్ నుంచి స్టూడెంట్ వీసా కిందికి మార్చుకునే అవకాశం ఉంది. ఇలాచేస్తే ఇంటర్నేషనల్ స్టూడెంట్‌గా మారుతారు. దీంతో ప్రభుత్వం నుంచి సాయం అందదు. స్కాలర్ షిప్ కానీ ఇతరత్రా ప్రయోజనాలు కానీ పొందలేరు. దీంతో తల్లిదండ్రులకు భారంగా మారనున్నారు. ఇప్పటికే కాస్టాఫ్ లివింగ్ వల్ల ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులకు ఇది అదనపు భారం కానుంది. ఈ క్రమంలోనే డిపెండెంట్ వీసా గడువు ముగింపు దశకు చేరుకున్న భారత సంతతి యువతలో ఎక్కువమంది అమెరికా వీడేందుకే మొగ్గు చూపుతున్నారు.
అయితే, ఇండియా తిరిగి వచ్చేందుకు మాత్రం ఇష్టపడడంలేదు. చిన్నతనంలోనే అమెరికా వచ్చేసిన తమకు ఇండియాలో ఎవరూ తెలియదని, ఆ లెక్కన భారత్ కూడా తమకు పరాయి దేశమే అవుతుందని చెప్పారు. అమెరికా వీడాల్సి వస్తే కెనడాకో లేక యూరప్ కో వెళతామని చెబుతున్నారు. అక్కడి ఇమ్మిగ్రేషన్ నిబంధనలు అంత కఠినంగా ఉండకపోవడమే దీనికి కారణమని చెప్పారు.