కుక్కల వల్ల కాలనీల్లో ఆడుకోవాలంటే జంకుతున్న చిన్నారులు

  •      రాత్రి వేళ బయటికి వెళ్లాలంటే భయం.. భయం..
  •      కుక్కల  ఆపరేషన్లు పట్టించుకోని మున్సిపల్​ ఆఫీసర్లు

నిజామాబాద్​, వెలుగు:  నగరంలో వీధికుక్కల బెడద రోజు రోజుకు పెరుగుతోంది. కుక్కల సంతతిని కంట్రోల్​ చేయడంలో బల్దియా అధికారులు విఫలమవుతుండడంతో కార్పొరేషన్ లోని ఏ కాలనీకి వెళ్లినా కుక్కల గుంపులే దర్శనమిస్తున్నాయి. రోడ్లపై పదుల సంఖ్యలో తిరుగుతుండడంతో చిన్నారులు బయట ఆడుకోవాలంటే  జంకుతున్నారు. మహిళలు కూడా  రాత్రి వేళ ఇంటి నుంచి బయటకు రావాలంటే  భయపడుతున్నారు. నిత్యం ఏదో ఒక కాలనీలో  చిన్నారులు, గొర్లు, మేకలు, ఇతర జీవాలపైన కుక్కలు దాడి చేస్తున్నాయని నగరవాసులు వాపోతున్నారు.  

వీధుల్లో హల్​చల్​..

 నగరంలోని చాలా కాలనీల్లో రాత్రయితే చాలు వీర విహారం చేస్తున్నాయి. గుంపులుగుంపులుగా తిరుగుతూ  కనిపించిన వారిపై మూకుమ్మడిగా   వేటాడి కరుస్తున్నాయి.  ముఖ్యంగా నగరంలోని  జంక్షన్లు, మురుగు కాలువలు, చెత్తకుప్పల వద్ద నుంచి నడుచుకుంటూ వెళ్లే వారిని వదలకుండా దాడులు చేస్తున్నాయి.  కుక్కల దాడుల్లో అనేకమంది చిన్నారులు, మహిళలు గాయాలపాలవ్వడంతో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు  కూడా ఉన్నాయి.  బైక్​లపై వెళ్లే వారి వెంట బడడంతో అదుపుతప్పి ప్రమాదాలు  జరుగుతున్నాయి.

కు.ని ఆపరేషన్లు పట్టించుకోని ఆఫీసర్లు

 కుక్కల బెడద తీవ్రంగా మారడంలో బల్దియా అధికారుల  నిర్లక్ష్యం  స్పష్టంగా కనిపిస్తోంది. యేటా కుక్కల సంఖ్యను లెక్కిస్తూ వృద్ధి చెందకుండా  కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేపట్టాల్సి ఉన్నా.. ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు  చేయడం లేదు. అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం..  గత ఏడాది నగరంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 1,000 కుక్కలకు కుటుంబ నియంత్రణ  ఆపరేషన్లు చేశారు. కానీ సంబంధిత ఫండ్స్​రాకపోవడంతో  ఆపరేషన్లను నిలిపివేశారు.  ఎవరైనా  తమ కాలనీలో కుక్కల సమస్య ఉందని  అధికారుల దృష్టికి  తీసుకెళ్తే ఆ ప్రాంతానికి వెళ్లి ఒకటి, రెండు కుక్కలను  పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలి చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.  ఫలితంగా నగరంలో వీధికుక్కల సంఖ్య  దాదాపు 10,000 పైగా ఉండవచ్చని వారు చెప్తున్నారు.  అయితే ఈ యేడాది జనవరి నెల వరకు  బల్దియాలో దాదాపు 300 కుక్క కాటు ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది.  

 యాక్షన్​ ప్లాన్​ రూపొందిస్తున్నాం..

నగరంలో కుక్కల బెడదను తగ్గించడానికి  యాక్షన్​ప్లాన్ రూపొందిస్తున్నామని బల్దియా అధికారులు చెప్తున్నారు.  డివిజన్ల వారీగా  శానిటరీ ఇన్​స్పెక్టర్లు వీధుల్లో తిరుగుతున్న కుక్కలను పట్టుకొని వాటికి కు.ని ఆపరేషన్లు చేసేందుకు వెటర్నరీ డాక్టర్లను నియమించుకుంటున్నామంటున్నారు.  దీంతో పాటు కుక్కలను పట్టుకునే  స్పెషల్​ టీమ్స్​ను కూడా రప్పించే ఏర్పాట్లు చేస్తున్నా మంటున్నారు. 

 వెంటనే చర్యలు తీసుకోవాలి 

నగరంలో కుక్కల బెడదను నివారించడానికి అధికారులు  వెంటనే చర్యలు తీసుకోవాలి. కుక్కల నివారణ కోసం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం, దొరికిన కుక్కలను బంధించి దూరంగా అటవీప్రాంతాల్లో వదిలేయడం లాంటి చర్యలు తీసుకోవాలి. కుక్కల నివారణ కోసం నిధులు ఖర్చు  చేస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ఆఫీసర్లు స్పెషల్​ఫోకస్​పెట్టి  యాక్షన్​ప్లాన్​అమలు చేస్తేనే ఫలితాలు ఉంటాయి. – న్యాలం రాజు, బీజేపీ డిఫ్యూటీ ప్లోర్​ లీడర్