నెట్వర్క్, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల్లో గురువారం బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఫొటోకు నివాళులర్పించారు. భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్లో కలెక్టర్ జితేశ్ వి పాటిల్‌తోపాటు ఆయా చోట్ల పలువురు అధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. కలెక్టరేట్లో బాలల హక్కులపై రూపొందించిన బుక్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పిల్లలు భవిష్యత్‌లో ఎదిగేందుకు వారు కంటున్న కలలను సాకారం చేసేందుకు తల్లిదండ్రులతో పాటు టీచర్స్ తమవంతు కృషి చేయాలన్నారు. బాలల దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, సమాజంలో పిల్లల ప్రాముఖ్యతను చెప్పే సందర్భమని చెప్పారు. పిల్లల్లో నెలకొన్న సృజనాత్మకతను వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు దేశనాయకులు వేషధారణలో ఆకట్టుకున్నారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. పలు పోటీల్లో ప్రతిభ కనబరిచిన స్టూడెంట్స్‌కు ప్రశంసా పత్రాలు అందజేశారు.