చాలామంది పిల్లలు అస్సలు బరువు పెరగరు. ఎప్పుడు చూసినా జ్వరం, కోల్డ్, దగ్గు. కాసేపు అడుకోగానే అలసిపోతారు. ఎప్పుడు చూసినా నీరసంగా కనిపిస్తారు. హెల్దీ ఫుడ్ పెడదామంటే తినరు.. అమ్మ పెడుతుంటే అడ్డంగా తల ఊపుతారు డు. కుర్కుడేలు, చిప్స్, చాక్లెట్స్ మాత్రం ఇష్టంగా తింటారు. అలాంటి పిల్లలకు సరైన పోషకాలు అందవని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రొటీన్స్ ఉన్న ఆహారం తినకపోవడం వల్లే ఎదుగుదల లేకపోవడం... ఇమ్యూనిటీ తగ్గడం వంటి సమస్యలకు దారితీస్తాయి. అయితే ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం లేదని అయితే కొన్నిరోజులపాటు ప్రొటీన్ పౌడరు వాడితే చాలని చెబుతున్నారు నిపుణులు.
వైద్యులు ప్రిస్కిప్షన్ లో రాసిన ప్రొటీన్ పౌడర్ చాలా ఖరీదు ఉంటుంది. అలాంటి పౌడర్ కొని వాడితే ఒక ప్యాకెట్ లేదా డబ్బా సరిగ్గా వాడితే వారం రావడం కూడా కష్టమే. చాలీచాలని జీతాలతో అలా ప్రొటీన్ పౌడర్ కొనాలంటే ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఈ ప్రొటీస్ పొడర్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.. అయితే ఈ ప్రోటీన్ పౌడర్ ను అనేక విధాలుగా తయారు చేసుకోవచ్చు. దీనిని ఎన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు.. ఏఏ పదార్ధాలు కావాలి.. ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. . .
నిజానికి ప్రొటీన్ పౌడర్ ను కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మనమే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. పైగా ఇంట్లో తయారు చేసుకున్న పౌడర్ మరింత ఆరోగ్యవంతమైనది కూడా. ఎటువంటి కల్తీకి అవకాశమే ఉండదు. బయటకొనే ప్రొటీన్ పౌడర్ అంత ఆరోగ్యవంతమైనది కాకపోవచ్చు. ఎందుకంటే ఎక్కువరోజులు నిల్వ ఉండడానికి కొన్నిరకాల ప్రిజర్వేటివ్స్ ను వాడతారు. ఈ రసాయనాలు ఆరోగ్యానికి హానికరమైనవే. అంతేకాదు.. ఇంట్లో చేస్తే తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది. పిల్లల కోసం మనమే చేసుకున్నామన్న సంతృప్తి కూడా ఉంటుంది. అన్నింటికీ మించి అమ్మ నేతి రుచి కూడా దానికి కలుస్తుంది.
ప్రోటీన్ పౌడర్ తయారీకి కావలసిన పదార్దాలు
- నానా ఫ్యాట్ మిల్క్ పౌడర్: మూడు కప్పులు డ్రై ఓట్స్ : ఒక కప్పు
- బాదం:ఒక కప్పు
- బెల్లం/చక్కెర : తగినంత
- కోకో పౌడర్: ఒక కప్పు (అవసరమనుకుంటే)
తయారీ విధానం: మిక్సీలో అన్ని పదార్థాలను వేసి మెత్తగా అయ్యేవరకు గ్రైండ్ చేయాలి. ఆతర్వాత ఆ మిశ్రమాన్ని శుభ్రమైన జార్లో భద్రపర్చుకోవాలి. మీరు ఎక్కువకాలం ఉంచాలనుకుంటే దాన్ని ఫ్రిజ్ లో భద్రపరుచుకోవచ్చు. ఇంట్లో తయారు చేసిన ఈ ప్రొటీన్ పౌడర్ ను దాని ప్రయోజనాలను పూర్తిగా పొందడానికి ప్రతిరోజూ వాడాలి. 1/2కప్పు స్కూప్ లో 180 కేలరీల శక్తి, 12 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. మీరు దీన్ని స్మూతీగానో, మిల్క్ షేర్ గానో చేసుకొని తాగొచ్చు. లేదంటే గోరువెచ్చని పాలలో కలిపి తాగినా పర్వాలేదు.
బాదం, పిస్తా వాల్ నట్స్ ప్రొటీన్ పౌడర్ తయారీకి కావలసిన పదార్థాలు
- బాదం : ఒక కప్పు
- పిస్తా వాల్ నట్స్ : ఒక కప్పు
- వేరుశెనగ గింజలు : ఒక కప్పు
- సోయా బీన్స్ : ఒక కప్పు
- గుమ్మడికాయ గింజలు : ఒక కప్పు
- అవిసెగింజలు : ఒక కప్పు
- చియా విత్తానాలు : ఒక కప్పు
- ఓట్స్ : ఒక కప్పు
తయారీ విధానం : అన్ని గింజలను ఒక కళాయిలో 2 నుండి 3 నిముషాలపాటు తక్కువ మంట మీద వేగించుకోవాలి. ఇదే పద్ధతిలో ఓట్స్ ను కూడా వేగించి పొడి చేసుకోవాలి. గింజలన్నీ చల్లబడ్డాక వాటిని కూడా పొడిగా చేసుకోవాలి. ఆ తర్వాత గ్రైండర్లో ఈ పదార్థాలన్నింటినీ పాలపొడితో కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత పొడిని జల్లెడ పట్టి ఒక జార్ లో భద్రపర్చుకోవాలి. అవసరమనుకుంటే 1/4 కప్పు కోకో పౌడర్ కూడా కలపొచ్చు. ఈ పొడిని, పాలు, షేక్స్, స్మూతీ, హల్వాగా చేసుకొని తినొచ్చు. ఈ పొడితో చేసిన ఒక స్కూప్ లో 10.3 గ్రాముల ప్రొటీన్ తోపాటు 4.5 కేలరీల శక్తి ఉంటుంది
బాదం, జీడిపప్పు, పిస్తాపప్పు ప్రొటీన్ పౌడర్ తయారీకి కావలసిన పదార్ధాలు
- బాదం పప్పు : అరస్పూన్
- జీడిపప్పు: అరస్పూన్
- పిస్తాపప్పు : అరస్పూన్
- కుంకుమపువ్వు రేకులు : అరస్పూన్
- పసుపు: అరస్పూన్
- జాజికాయ
తయారీ విధానం:జీడిపప్పు, పిస్తాలను కళాయిలో వేగించి చల్లారాక పొడి చేసుకోవాలి. ఇదే పద్ధతిలో కుంకుమపువ్వు రేకులను కూడా రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టాలి. అన్నింటిని. గ్రైండర్లో వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమానికి పసుపు, జాజికాయ పొడిని కలపాలి. ఆ తర్వాత అన్ని పొడులను మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. పొడి కొద్దిగా మెత్తగా, జిగటగా ఉండవచ్చు. దీనిని పాలల్లో కలుపుకొని తాగాలి
ఓట్స్, వేరు శెనగతో ప్రొటిన్ పౌడర్ తయారీకి కావలసిన పదార్ధాలు
- ఓట్స్ : 100 గ్రాములు
- వేరు శెనగ: 100 గ్రాములు
- బాదం: 100 గ్రాములు
- సోయా పిండి: 100 గ్రాములు
- పాలపొడి: 50 గ్రాములు
తయారీ విధానం: ఈ పదార్థాలను ఒకదాని తరువాత ఒకటి వేగించి వాటిని వేర్వేరు గిన్నెలలో చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీలో వేసి, పొడి చేయాలి. ఈ పొడిని పాలపొడితో కలిసి గ్రైండర్లో వేసి మెత్తగా చేయాలి. ఆపై జల్లెడ పట్టి, ఒక నిల్వచేయాలి. ఈ పొడిని పాలతో లేదంటే పండ్ల రసాలతో కలిపి తాగొచ్చు.
ఈ ప్రొటీన్ పౌడర్ కేవలం పిల్లలే కాదు పెద్దవాళ్లు కూడా తాగొచ్చు. రెగ్యులర్ గా -తాగడం వల్ల మెరుగైన ఫలితాలుంటాయి. శరీరానికి అవసరమైన శక్తినిస్తుంది. ఈ పాదర్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్స్, కాపర్, జింక్, మాంగనీస్ ఖనిజాలతోపాటు, విటమిన్, బి, పొటాషియం, ఫోలైట్ వంటి మినరల్స్ కూడా శరీరానికి అందుతాయి. సరిపడా డైటరీ ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఈజీగా జీర్ణమవుతుంది.
ప్రొటీన్ అవసరమేంటి?
శరీర కణజాలాల నిర్మాణానికి, శరీర ఎదుగుదలకు ప్రొటీన్ ఎంతో అవసరం కణాలు, కండరాలు, ఎంజైమ్ లు, హార్మోన్లను నిర్మించడం.. అవి వాటి వాటి విధులను నదిగా నిర్వర్తించేలా చేసేది కూడా ప్రొటీనూ.. ఒకవేళ ఏదైనా కండరం దెబ్బతింటే దానిని రిపేర్ చేయాలన్న ప్రొటీన్ కావాల్సిందే. ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలకు ప్రొటీన్ అవసరం ఎంతగానో ఉంటంది. ఇది పిల్లలకు శక్తిని కూడా అందిస్తుంది. గింజలు, చేపలు, గుడ్లు, చికెన్, పాల ఉత్పత్తులలో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది.
-వెలుగు, లైఫ్-