మధిర, వెలుగు: భార్యపై అనుమానంతో ఓ భర్త తన ఇద్దరు పిల్లల ప్రాణాలు తీశాడు. ఖమ్మం జిల్లా మధిర మండలం రాయపట్నానికి చెందిన పార్శపు శివరాం గోపాల్ కూలీ. ఇతడి భార్య ఏసుమణి. వీరికి రామకృష్ణ (8), ఆరాధ్య (6) అనే ఇద్దరు పిల్లలున్నారు. రామకృష్ణ మూడో తరగతి చదువుతుండగా ఆరాధ్య ఒకటో క్లాస్ చదువుతోంది. కొంతకాలంగా శివరాం తన భార్య ఏసుమణిపై అనుమానం పెంచుకుని గొడవపడుతున్నాడు. కొద్ది రోజుల కింద కూడా లొల్లి పెట్టుకోవడంతో ఏసుమణి భర్తను, పిల్లలను వదిలి అదే ఊర్లోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది.
దీంతో పిల్లలను తండ్రి శివరాం చూసుకుంటున్నాడు. సోమవారం ఉదయం ఇద్దరు పిల్లలను రెడీ చేసి స్కూల్కు కూడా పంపాడు. సాయంత్రం స్కూల్కు వెళ్లి ఇద్దరినీ తీసుకువచ్చాడు. కొద్దిసేపటికే వారిద్దరిని హత్య చేసి పారిపోయాడు. నిర్జీవంగా పడి ఉన్న పిల్లలను చూసిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారమిచ్చారు. మధిర టౌన్ పోలీసులు అక్కడికి వచ్చి హత్య జరిగిన తీరును పరిశీలించారు. పిల్లలను ఎలా చంపాడన్నది ఇంకా తేలలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.