ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిల్డ్రన్ మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఇందులోభాగంగా మాట్లాడుతూ ఇలాంటి సమావేశాలు సమాజానికి చాలా అవసరం అని అన్నారు. అలాగే శాసన సభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు, సమాధానాలు... ఇతర అంశాలను విద్యార్థులు గమనించాలని సూచించారు. విపక్షాలు ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం వారి బాధ్యతని గుర్తు చేశారు.
లీడర్ ఆఫ్ ది హౌస్, లీడర్ ఆఫ్ ది అపొజిషన్ ఇద్దరికీ సమాన అవకాశాలు ఉంటాయని, సభను సమర్ధవంతంగా నడిపే బాధ్యత స్పీకర్ పై ఉంటుందని అన్నారు. అలాగే విపక్షాలు ఆందోళన చేసినా ప్రభుత్వం సమన్వయంతో సభను నడిపించేలా చూడాలని కానీ దురదృష్టవశాత్తు ఈరోజుల్లో కొందరు సభను ఎలా వాయిదా వేయాలా అనే విధంగా చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
చైల్డ్రన్ మాక్ అసెంబ్లీని స్ఫూర్తిదాయకంగా నిర్వహించిన మీ అందరినీ అభినందిస్తున్నానని అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ రెవల్యూషన్ తీసుకొచ్చారని, వారి వల్లే మనకు సమాజంలో ఇవాళ అవకాశాలు వచ్చాయని ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. దేశంలో నిర్బంధ విద్య అమలు చేసేందుకు సోనియా గాంధీ, మన్మోహన్ ఎంతో సింగ్ కృషి చేశారని 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కును అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీ గారిది అని ప్రశంసించారు.
ఇక ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసేందుకు 25 ఏళ్ల వయసు నిబంధన ఉందని, 21 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తే యువత రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని విద్యార్థులకి తెలిపారు. చిల్డ్రన్ మాక్ అసెంబ్లీలో ఇలాంటి బిల్స్ ను పాస్ చేయడం అభినందనీయమని అన్నారు.