Family : పిల్లలు మిమ్మల్ని సతాయిస్తున్నారా.. అయితే ఈ విధంగా డీల్ చేయండి

Family : పిల్లలు మిమ్మల్ని సతాయిస్తున్నారా.. అయితే ఈ విధంగా డీల్ చేయండి

ఒకప్పుడు చిన్నపిల్లల్ని పెంచడం. పెద్ద సమస్య కాదు. గుక్కెడు పాలు తాగి, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చునే వాళ్లు, మారాం చేయడం, మొండిగా వాదించడం పిల్లలకు అసలు తెలిసేవే కావు. ఇప్పుడున్న పరిస్థితి దానికి భిన్నంగా ఉంటోంది. పెద్దవాళ్ల సాయం లేకుండానే అన్ని పనులు నేర్చుకోవడం, అదే కావాలి.. ఇదే కావాలి' అనే మొండిపట్టు నేటి పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అది మంచికా? చెడుకా? అనే విషయం పక్కన పెడితే... అలాంటి వాళ్లతో ఎలా వ్యవహరించాలో తెలుసుకుంటే ముఖ్యం.

ఈ జనరేషన్ పిల్లలు... అమ్మానాన్నలకు పెద్ద తలనొప్పే తెచ్చిపెడుతున్నారు. వాళ్ల ప్రవర్తనలో వస్తున్న మార్పులు పెద్దవాళ్లను ఆలోచనల్లో పడేస్తున్నాయి. దాంతో అమ్మానా న్నలు తమ పిల్లల్ని చుట్టుపక్కన ఉన్న పిల్లలతో పోల్చుకుని మరింత కంగారు పడుతున్నారు.. నిజానికి పిల్లలందరూ ఒకలా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తారు. అలాగే ఒకే విషయంలో ఒక్కోలా స్పందిస్తారు. అందుకే నేటి తల్లులకు పిల్లల విషయాల్లో చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి.

రెండేళ్ల పిల్లల్లో చాలామంది ఏదైనా పెడితే వద్దని కింద పడేస్తారు. అలాంటప్పుడు అమ్మా నాన్నలు వాళ్లపై కోప్పడటం, కొట్టడం చేయొద్దు. అలాగే వేరే పిల్లల ప్రస్తావన తేవడం, పోల్చడం కరెక్ట్ కాదు. అన్నం నోట్లోకి వెళ్లాలి తప్ప నేల మీద కాదని నెమ్మదిగా చెప్పాలి. కుటుంబం అంతా కలిసి తినడం వల్ల ఇలాంటి పరిస్థితుల ను తగ్గించొచ్చు. అలాగే పెట్టే దాని గురించి ఆస క్తిగా నాలుగు మాటలు చెప్తే, వాళ్లలో తినాలనే ఆసక్తి పెరుగుతుంది.

Also Read:- మీ ప్రేమ ఎంత పర్ఫెక్ట్.. తెలుసుకోవటం ఎలా

మూడేళ్ల అక్కకి ... ఏడాది వయసున్న తమ్ముడు కొన్నిసార్లు శత్రువుగా మారొచ్చు. తమ్ముడ్ని కొట్టడం, వాడి బొమ్మలు తీసేసుకోవడం లాంటివి సాధారణంగా జరుగుతుంటాయి. అమ్మానాన్నలు ఎప్పుడూ 'నీ బొమ్మలు తమ్ముడి కి ఇవ్వు, వాడితోనే ఆడుకో... జాగ్రత్తగా చూసుకో అని ఆర్డర్లు వేయడం వల్ల ఇలాంటివి రావచ్చు.  బాబు పుట్టక ముందు అమ్మానాన్నలు ఎక్కువ టైమ్, అటెన్షన్ కూతురిపైనే పెడతారు.   ఆ తరువాత ఇంకొకరు పుట్టిన తరువాత అవన్నీ ఒక్కసారిగా దూరమవ్వడం వల్ల కూడా  మూడేళ్ల పాప ప్రవర్తనలో మార్పులు రావచ్చు. చాలాసార్లు అలాంటివి తెలియకుండానే జరుగుతాయి. అందుకే బాబు విషయంలో పాపను తిట్టడం, బెదిరించడం, బాధ్యతలు బల వంతంగా రుద్దడం సరికాదు. చిన్నపిల్లాడితోనే కాకుండా పాపతో గడపడానికి కూడా అమ్మానా న్నలు టైమ్ ఇవ్వాలి. ఇద్దర్నీ సమానంగా చూస్తే, పిల్లల్లాగే వాళ్ల బంధం కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది.

 నాలుగేళ్ల పిల్లాడు... ఏది చెప్తే, దానికి వ్యతిరేకంగా చేస్తున్నాడా? అయితే అది పూర్తిగా అమ్మానాన్నల తప్పే ఎలాగంటే పిల్లలైనా ... పెద్దలైనా ఆర్డర్లను అంత సులువుగా అంగీకరించలేరు. ఇదే విధంగా పిల్లలతో 'చెప్పింది చెయ్యి, ఎందుకింత మొండిగా చేస్తున్నావ్? చెప్తే అర్థం కావట్లేదా?' లాంటి మాటలు ఉపయోగించొద్దు. చిన్నప్పట్నించే పిల్లలకు కొన్ని విషయాల్లో స్వేచ్ఛ నివ్వాలి. వాళ్లకు నచ్చిన పనుల్ని చేయనిస్తూనే.... మంచి ఏదో, చెడు ఏదో గమనించాలి. మొండిగా ఉంటున్న పిల్లలకు అమ్మానాన్నలు ఎప్పుడూ' చాయిస్ ఇవ్వాలి. నాలుగు చెప్పి, అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోమనాలి. ఇంకో మార్గం ఏంటంటే... పిల్లలనే కొన్ని విషయాల్లో ఇన్ చార్జిగా మార్చాలి. అప్పుడు వాళ్లలో విషయం జ్ఞానం పెరిగి, ఏది కరెక్టో తేల్చుకుంటాడు.

ఐదేళ్లు వచ్చినా... కొంతమంది పిల్లలు తెలివితక్కువగా వ్యవహరిస్తారు. మాట్లాడే మాటల్లో చేసే పనుల్లో ఆలోచన ఉండదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్లపై అరవడం, కొట్టడం, ఇది కూడా తెలియదా?" అనడం వంటివి వాళ్లలో కాన్ఫిడెన్స్ లెవల్స్ని తగ్గిస్తాయి. అందుకే వాళ్ల తెలివితక్కువతనాన్ని నలుగురిలో బయటపడేలా చేయకూడదు. వాళ్లను దగ్గరికి తీసుకుని చెప్పడం, వాళ్లకు తెలియని విషయాలపై అవగాహన కల్పించడం సరైన పద్ధతి. మెచ్యూరిటీ అనేది పిల్లల్లో తెలుసుకున్న విషయాలను బట్టి వస్తుంది. అందుకే వాళ్లతో చుట్టూ జరుగుతున్న విషయాల గురించి చర్చిస్తూ ఉండాలి.

-వెలుగు, లైఫ్​–