ధరలపై తిరుగుబాటు

అల్లర్లు, కాల్పులు..11 మరణాలు..

ఇవన్నీ చిలీ దేశంలో ధరలపై జరుగుతున్న యుద్ధంలో చోటు చేసుకున్నవి. దక్షిణ అమెరికాలో పైనుంచి కిందకు సన్నటి చీలికలా ఉండే దేశం చిలీ. స్పానిష్​ వలస రాజ్యంగా ఉండే ఈ ప్రాంతం చాలా రిచ్​. అలాంటి దేశం ఈ రోజున భగభగ మండుతోంది. డాలర్​తో పెసో (చిలీ కరెన్సీ) మారకం దారుణంగా పడిపోవడంతో అక్కడ కాస్ట్​ ఆఫ్​ లివింగ్​ చాలా ఎక్కువైంది. దానికితోడు ప్రజా రవాణాని ప్రభుత్వం ఖరీదైనదిగా మార్చేసింది.  జనం గగ్గోలు పెడుతూ వీధుల్లోకి రావడంతో అల్లర్లకు దారి తీసింది.

ఏ దేశంలోనైనా సామాన్యుడు బతకలేని పరిస్థితులే గొడవలకు కారణమవుతాయి.  ప్రస్తుతం లాటిన్​ అమెరికాలోని చిలీలోనూ ఇదే పరిస్థితి. ‘కాస్ట్ ఆఫ్ లివింగ్’ అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతోంది. అసలే దేశంలో అన్నింటి ధరలూ విపరీతంగా పెరగిపోయి, బతకలేని విధంగా ఉంది. పుండుని కెలికినట్లుగా మెట్రో రైలు చార్జీలను సర్కార్ పెంచేసింది. దీంతో చిలీ జనాలు రెచ్చిపోతున్నారు.  వారం రోజులుగా అక్కడ జనం వీధుల్లోకి వచ్చి హింసకు దిగారు. రాజధాని శాంటియాగోతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరసనల్ని  కంట్రోల్ చేయడానికి పోలీసులు కాల్పులు జరిపారు. ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 11కు చేరింది. ఎన్నడో 45 ఏళ్ల నాటి పినోచెట్​ పాలనను గుర్తు చేస్తోందని సీనియర్​ సిటిజన్లు అంటున్నారు. 1973లో అలెండీ సోషలిస్టు విధానాలపై తిరుగుబాటు చేసి, జనరల్​ అగస్టో పినోచెట్​ అధికారానికొచ్చారు. ఆ తర్వాత 1990 వరకు ఆయన పాలన నియంతలా సాగింది. నాటి ఘటనలపై విచారించిన కమిషన్​ రిపోర్టు ప్రకారం 2,115 మందిని పినోచెట్​ పొట్టనబెట్టుకున్నాడు. దాదాపు 27 వేల మందిని టార్చర్​కు గురిచేశాడు. ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుని భయంతో వణికిపోతున్నారు చిలీ జనాలు.

ప్రభుత్వంపై ఇంత అసంతృప్తికి కారణం మెట్రో టికెట్ రేట్లను 800 నుంచి 830 పెసోలకు పెంచేయడమే. ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ప్రభుత్వ ఆందోళనలు మొదలయ్యాయి. శాంతియుతంగా ప్రారంభమైన ఆందోళనలు  హింసాత్మకంగా మారాయి. అనేక మెట్రో స్టేషన్లలో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. పెద్ద సంఖ్యలో బస్సులు తగలబెట్టారు.

శాంటియాగో అల్లకల్లోలం

దేశ రాజధాని శాంటియాగోలో నిరసనకారులు రెచ్చిపోయారు. ఎక్కడికక్కడ మార్కెట్లకు, ఫ్యాక్టరీలకు నిప్పు పెడుతున్నారు. దుకాణాలు, మాల్స్​​ లూటీ అవుతున్నాయి. శివారు ప్రాంతంలోని  ఒక గార్మెంట్ ఫ్యాక్టరీకి నిప్పు పెట్టడంతో ఐదుగురు, సూపర్ మార్కెట్​ని తగలబెట్టడంతో ముగ్గురు చనిపోయారు. దుకాణాల్లోకి, సూపర్ మార్కెట్లు, ఇతర మాల్స్ లోకి చొరబడి అందినకాడికి దోచుకెళ్లారు. ఇలాంటి లూటీలు 40 వరకు జరగ్గా మరో ముగ్గురు చనిపోయారు. రాజధానిలో ఎప్పుడేం జరుగుతుందో  తెలియని పరిస్థితి. అంతా అల్లకల్లోలంగా మారడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. పది వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని రాజధానిలో మోహరించింది. ఆందోళనకారులను చెదరగొట్టడానికి టియర్ గ్యాస్​ని, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించినా ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. పెద్ద సంఖ్యలో సైనికులు, ప్రజలు గాయపడ్డారు. 1,400 మందికి పైగా ఆందోళనకారులను  ప్రభుత్వం అరెస్ట్ చేసింది. రాజధాని పరిస్థితి ఒక యుద్ధ వాతావరణాన్ని గుర్తుకు తెచ్చేలా మారింది.

చివరికి, పినేరా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మెట్రో రైలు చార్జీలను తగ్గించింది. అయినాగానీ జనం శాంతించలేదు.  రైలు చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా మొదలైన ఆందోళన… చివరకు ‘కాస్ట్ ఆఫ్ లివింగ్’కు వ్యతిరేకంగా మారిందని చిలీ ఎనలిస్టులు అంటున్నారు. చిలీలో సాధారణ పరిస్థితులు ఏర్పడడానికి వీలుగా ఆందోళనకారులతో చర్చలు జరపాల్సిందిగా ప్రెసిడెంట్ పినేరాకు మాజీ ప్రెసిడెంట్, ప్రస్తుత యునైటెడ్ నేషన్స్ రైట్స్ చీఫ్ మిషెల్​ బాష్​లెట్ సలహా ఇచ్చారు. చిలీలో జరుగుతున్న విధ్వంసం బాగా కలచివేసిందని ఆమె  అన్నారు. జనరల్​ పినోచెట్​ పాలనతో ఇప్పటి పరిస్థితుల్ని పోల్చడాన్ని ఇంటర్నేషనల్​ కామెంటేటర్లు శ్రద్ధగా గమనిస్తున్నారు. ఇది చిలికి చిలికి సివిల్​ వార్​కి దారి తీసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

దక్షిణ అమెరికాలోని డబ్బున్న దేశం

చిలీలో 1973 నాటికి అలెండీ ప్రభుత్వం ఉండేది. ఆయన సోషలిస్టు విధానాలను పాటించేవారు. దాంతో పెట్టుబడులు వెనక్కిపోవడం, నిరుద్యోగం వంటివి చోటు చేసుకున్నాయి. అప్పటి అమెరికా ప్రెసిడెంట్​ రిచర్డ్​ నిక్సన్​ ప్రోత్సాహంతో అదే ఏడాది సెప్టెంబర్ 11న అలెండీ ప్రభుత్వంపై జనరల్​ పినోచెట్​ మిలిటరీ తిరుగుబాటు చేసింది.  పినోచెట్ పాలన 1973 నుంచి 1990 వరకు నడిచింది.  ఆయన నియంతృత్వ పాలన అంతమై ‘రిపబ్లిక్ ఆఫ్ చిలీ’ ఏర్పడింది. ఒక సుస్థిరమైన అడ్మినిస్ట్రేషన్​కి చిలీ పేరు తెచ్చుకుంది. దక్షిణ అమెరికాలో డబ్బున్న దేశంగా కూడా చిలీ పాపులర్ అయింది.  శాన్ ఫ్రాన్సిస్కోలో 1945లో యునైటెడ్ నేషన్స్ చార్టర్ పై సంతకం చేసిన 50 దేశాల్లో చిలీ కూడా ఉంది. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ కార్యక్రమాల్లో కూడా చిలీ ఉత్సాహంగా పాల్గొంటుంది. అనేక ఇంటర్నేషనల్ సమ్మిట్లు చిలీలో జరిగాయి.

మిడిల్​ క్లాస్​పై భారం

చిలీలో ఒక వైపు డబ్బున్నవాళ్లు, రెండో వైపు నిరుపేదలు ఉన్నారు. ఆర్థికంగా తేడాలు పెద్ద స్థాయిలో ఉన్నాయి. చిలీ గొడవలకు ప్రధాన కారణం మిడిల్​ క్లాస్​ తట్టుకోలేని స్థాయికి ‘ కాస్ట్ ఆఫ్ లివింగ్’ చేరడమే. కొన్నేళ్లుగా అన్ని వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి. మెజారిటీ చిలీ ప్రజలు ఆఫీసులకు వెళ్లడానికి ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్ పోర్టునే నమ్ముకుంటారు. మెట్రో రైలు టికెట్లను ప్రభుత్వం గత జనవరిలోనే పెంచింది. మళ్లీ లేటెస్ట్​గా పెంచడంతో ప్రజల్లో కోపం కట్టలు తెంచుకుని, విధ్వంసంగా మారింది. ప్రభుత్వ విధానాల కారణంగా మిడిల్ క్లాస్ పెరిగింది. దాంతోపాటు ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ రంగాలు కాస్ట్ లీ గా మారాయి.

ఎమర్జెన్సీ విధింపు

పరిస్థితి చేయి దాటి పోతుండడంతో శాంటియాగోలో ప్రెసిడెంట్ సెబాస్టియన్ పినేరా ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆ తరువాత దేశంలోని మరో ఆరు సిటీల్లో కూడా ఎమర్జెన్సీ విధించారు. ప్రజలు గుంపులు గుంపులుగా తిరగడంపై  నిషేధం విధించారు. ప్రదర్శనలపై కూడా బ్యాన్​ అమల్లోకి వచ్చింది. వీకెండ్​లో జరగాల్సిన ఫుట్​బాల్ మ్యాచులు రద్దయ్యాయి. టీవీలో ప్రెసిడెంట్​ పినేరా చేసిన ప్రకటనతో జనం మరింత రెచ్చిపోయారు. ‘మెట్రో టికెట్ల రేట్ల పెంపును అడ్డం పెట్టుకుని కొంతమంది దేశంలో విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్లంతా క్రిమినల్స్. ఎవరినీ లెక్కచేయని, దేనినీ గౌరవించని అరాచక శక్తులతో మనం యుద్ధానికి దిగుతున్నాం. మితిమీరిన హింసను, క్రిమినల్ యాక్టివిటీనే వాళ్లు ఇష్టపడుతుంటారు’ అని ప్రెసిడెంట్ అనడంతో ఆందోళన మరింత పెరిగింది. ప్రజలు ఎందుకింత ఆగ్రహంగా ఉన్నారో అర్థం చేసుకోకుండా, ఆందోళనకు దారి తీసిన కారణాలపై ఫోకస్ పెట్టకుండా వాళ్లను క్రిమినల్స్ అని అనడం కరెక్ట్ కాదన్న వాదనలు వచ్చాయి. ప్రెసిడెంట్ కామెంట్లను చాలా మంది తప్పు పట్టారు.

వీధుల్లోకి వచ్చిన స్టూడెంట్లు

మెట్రో రైలు చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా మొదట ఆందోళన ప్రారంభించింది యూనివర్శిటీ స్టూడెంట్లు. ఆ తరువాత మిడిల్ క్లాస్​కు చెందిన ఉద్యోగులు ఇందులో చేరారు. ఆందోళనలు తీవ్రమయ్యే కొద్దీ సామాన్య ప్రజలు కూడా వచ్చి చేరారు. శాంటియాగో కేంద్రంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి. 1990 తరువాత శాంటియాగోలో ఇంత పెద్ద ఎత్తున సైన్యాన్ని  మోహరించడం ఇదే మొదటిసారి.