
- దళారులు చెప్పిందే రేటు
- ఈ ఏడాది రూ.9 వేల నుంచి రూ.10 వేల మధ్య ధరలు
గద్వాల, వెలుగు: మిర్చి ధరలు గణనీయంగా పడిపోయాయి. దీనికితోడు మూడేళ్లుగా అనుకున్న దిగుబడి రాకపోవడం, మార్కెటింగ్ వ్యవస్థ లేకపోవడం, దళారులు చెప్పిందే నడుస్తుండటంతో మిర్చి రైతులు నష్టపోతున్నారు. పంట పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది క్వింటాల్మిర్చికి రూ.9 వేల నుంచి రూ.10,500 మధ్య మాత్రమే ధర పలుకుతోందని, దీంతో తాము నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 19,767 మంది రైతులు 37,762 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారు.
ఎకరాకు రూ.లక్షకు పైగా పెట్టుబడి
మిర్చి సాగు చేసేందుకు రైతులు ఎకరాకు విత్తనాలు, కూలీలు, క్రిమిసంహారక మందుల కోసం రూ.లక్షకు పైగా పెట్టుబడి పెడుతున్నారు. అయితే, 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తేనే రైతుకు లాభం వస్తుంది. కానీ, ఈ ఏడాది పంట దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ప్రస్తుతం ఉన్న రేట్లు చూస్తే ఎకరాకు రూ.50 వేల వరకు రైతు నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది.
ఎగుమతుల్లేక పడిపోయిన ధరలు
మూడేళ్లుగా మిర్చి ఎగుమతుల్లేకపోవడం వల్ల ధరలు పెరగడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. అంతకుముందు ఎగుమతి చేయడం వల్ల క్వింటాల్మిర్చికి రూ.20 వేల నుంచి 25 వేల మధ్య రేటు వచ్చేదని అంటున్నారు.
దళారులు చెప్పిందే రేటు
జోగులాంబ గద్వాల జిల్లాలో మిర్చికి మార్కెటింగ్ లేదు. స్థానిక దళారులుతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కొందరు వ్యక్తులు మిర్చి పంటను కొనుగోలు చేయడానికి ఇక్కడికి వస్తుంటారు. వారు చెప్పిందే రేటు. మార్కెటింగ్ వ్యవస్థ లేకపోవటంతో రైతు వేరేచోట అమ్ముకోలేని పరిస్థితి. కొందరు గుంటూరు మిర్చి మార్కెట్ కు తీసుకెళ్తున్నా అక్కడా ధర రాకపోవడంతో దళారులకే విక్రయిస్తున్నారు.
ఆశతో ఏసీ గోదాముల్లో నిల్వ
భవిష్యత్తులో రేట్లు పెరుగుతాయని ఆశతో ఉన్న పలువురు రైతులు మిర్చిని ఏసీ గోదాముల్లో నిల్వ చేసుకుంటున్నారు. అయితే, కొందరు దళారులు కొన్ని రోజులకు గోదాముల నిర్వాహకులతో కుమ్మక్కై, అక్కడే మిర్చికి వేలంపాట నిర్వహించి, కొనుగోలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఎటుచూసినా తమను ముంచడానికే చూస్తున్నారని, లాభం చేకూర్చేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదని రైతులు వాపోతున్నారు.
దిగుబడి తగ్గింది వాస్తవమే
మిర్చి పంట దిగుబడి తగ్గిన మాట వాస్తవమే. ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్లు వస్తేనే రైతుకు లాభం ఉంటుంది. మార్కెటింగ్ లేకపోవడం వల్ల వారు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ధరల విషయంలో ప్రభుత్వమే స్పందించాల్సి ఉంటుంది.
సక్రియ నాయక్, డీఏవో, గద్వాల