మిర్చి రైతుల తండ్లాట.. మద్దతు ధర లేక అరిగోస

  •  అకాల వర్షాలతో ఇబ్బందులు 
  • ప్రైవేట్‌‌ వ్యాపారుల బస్తాలతో నిండిన కోల్ట్‌‌ స్టోరేజీలు
  • రైతుల పంట స్టోరేజీకి నో ఛాన్స్‌‌

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: అకాల వర్షాలు..మార్కెట్​లో  తగ్గుతున్న రేట్లతో మిర్చి రైతులు తిప్పలు పడుతున్నారు. కల్లాల్లో పోసిన పంట తడవకుండా కాపాడుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్​లో ధరలు తగ్గడం..కోల్డ్ స్టోరేజీలు ప్రైవేట్ వ్యాపారస్తుల బస్తాలతో నిండిపోవడంతో ఏం చేయాలో తెలియక మదనపడుతున్నారు. పండిన పంటను అమ్ముకోలేక.. ఇంటి దగ్గర నిల్వ చేసుకోలేక.. కల్లాల్లో కాపాడుకోలేని దుస్థితి తలుచుకొని కుమిలిపోతున్నారు. 2017 నాటి పరిస్థితులే మళ్లీ పునరావృతమయ్యేలా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు.  

ఎకరానికి రూ.2 లక్షల పెట్టుబడి

ఈ సారి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఎకరాలకు పైగా మిర్చి సాగు చేశారు. దేశీయ రకం మిర్చీతో పాటు తేజ, వండర్‌‌ హాట్‌‌, చపాట రకానికి చెందిన 5531, 341, 1048 పంట అధికంగా పండించారు. సుమారు 4 లక్షల మెట్రిక్‌‌ టన్నుల వరకు పంట ఉత్పత్తి వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే, మిర్చి సాగుకు రైతులు భారీగా పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. మిర్చి గింజలకే ఎకరానికి 20 ప్యాకెట్లు కొనాల్సి వస్తోంది. ఒక్కో ప్యాకెట్‌‌కు రూ.700 నుంచి 1000 పడుతుంది. వీటికే రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు పెట్టారు. 

నారు పెంచడానికి ఒక్క మొక్కకు రూపాయి నుంచి రూపాయిన్నర చొప్పున ఎకరానికి సరిపడా మొక్కలు పెంచడానికి రూ.20 వేలకు పైగా పెట్టారు. పొలంలో  మొక్కలు నాటడానికి ఒక్కో కూలీకి రూ.400 నుంచి రూ.500 చొప్పున  పదిమంది కూలీలకు రూ.5 వేలు ఇచ్చారు.  మొక్క నాటినప్పటి నుంచి మిర్చి ఏరేవరకు 6 నెలల కాలంలో ఎరువులు, పురుగుల మందుల పేరిట ఒక్కో ఎకరానికి సుమారు రూ.లక్ష పెట్టుబడి పెట్టారు. పంట మధ్యలో ఎర్రనల్లి, నల్ల తామర ఆశించి వేలాది ఎకరాల్లో పంట నాశనమైంది. 

దీంతో మధ్యలోనే కొందరు రైతులు పంట తీసేశారు. ఇంకొందరు భారీగా పెట్టుబడి పెట్టి పంటను పసిపిల్లల్లా చూసుకున్నారు. ఇంత చేసినా ఒక్కో ఎకరానికి 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. మిర్చి ఏరడం నుంచి మొదలుకొని బస్తాల్లోకి తొక్కి, ప్రైవేట్‌‌ వెహికిల్స్​లో మార్కెట్‌‌ తీసుకెళ్లడానికి ఒక్కో క్వింటాల్‌‌కు రూ.3 నుంచి 4 వేలు ఖర్చు చేస్తున్నారు. 

దీంతో విత్తనం నాటినప్పటి  నుంచి బస్తాలను మార్కెట్‌‌కు తీసుకెళ్లి అమ్మే వరకు ఒక్క ఎకరానికి రూ.2 లక్షల దాకా ఖర్చు చేశారు. తీరా మార్కెట్‌‌లో మిర్చి క్వింటాల్‌‌కు రూ.15 వేల కంటే తక్కువ రేట్‌‌ రావడంతో పెట్టిన పెట్టుబడి ఖర్చులు కూడా రావట్లేదని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు.

కోల్డ్‌‌ స్టోరేజీల్లో పెత్తన‍ం అంతా ప్రైవేట్‌‌ వాళ్లదే..!

నాలుగు రోజులుగా మబ్బులు పట్టి అక్కడక్కడ అకాల వర్షాలు పడుతున్నాయి. మరో వైపు మార్కెట్లలో రేట్లు డౌనయ్యాయి. మొన్నటిదాకా ఖమ్మం, వరంగల్‌‌ మార్కెట్లలో క్వింటాల్‌‌కు రూ.20 వేల దాకా పలికిన ధరలు ఇప్పుడు ఆకస్మాత్తుగా రూ.15 వేల కంటే కిందికి పడిపోయాయి. దీంతో రైతులు కల్లాల్లో ఉన్న మిర్చీని బస్తాల్లోకి ఎక్కించి కోల్డ్‌‌ స్టోరేజీలకు తీసుకెళదామంటే అక్కడ ప్రైవేట్‌‌ వ్యాపారస్తుల పెత్తనమే నడుస్తోంది. తక్కువ ధరలకు మిర్చి కొన్న అడ్తీ వ్యాపారులు, కొనుగోలుదారులు తమ బస్తాలను కోల్డ్‌‌ స్టోరేజీల్లో నిల్వ చేసుకుంటున్నారు.

 6 నెలల సమయానికి ఒక్క బస్తాకు రూ.160 చొప్పున తీసుకోవాలి. బ్లాక్‌‌లో దీనికి మూడు రేట్లు పెంచి రూ.480 తీసుకుంటున్నారు. అయినా రైతులు వేసుకునే బస్తాలకు స్థలం లేదని చెబుతున్నారు. వరంగల్‌‌ మార్కెట్‌‌ పరిసర ప్రాంతాల్లో 25 కోల్డ్‌‌ స్టోరేజీలుంటే అన్నీ మిర్చి బస్తాలతో నిండాయని చెబుతున్నారు. ఒక్కో కోల్డ్‌‌ స్టోరేజీలో 50 వేల నుంచి లక్షకు పైగా బస్తాలు నిల్వ చేసుకోవచ్చు. వీటిలో 70 శాతం బస్తాలు నిల్వ చేసుకునే అవకాశం మిర్చి రైతులకే ఉంటుంది. అయినా, కూడా రైతులకు మాత్రం ప్లేస్‌‌ దొరకట్లేదని చెబుతున్నారు. దీంతో కల్లాల్లోనే మిర్చిని కాపాడుకోవాల్సి దుస్థితి దాపురించింది.  

కోల్డ్​స్టోరేజీల్లో జాగా లేదట

రెండు ఎకరాలలో సింజెంట 5531 రకానికి చెందిన మిర్చి సాగు చేసిన. తెగుళ్లు, చీడపీడల నుంచి పంట రక్షించుకున్న. కూలీల కొరత ఉన్నా కూడా ఎక్కువ రేట్లకు మిర్చి ఏరించిన. ఎకరానికి రూ.2 లక్షల పెట్టుబడి పెట్టిన. ఎన్నో ఇబ్బందులు పడి పండించిన పంటను మార్కెట్ కు తీసుకెళ్తే కనీస ధర ఇవ్వట్లేదు. గతేడాది ఇదే రకానికి రూ.20వేల పైనే పలికింది. ప్రస్తుతం రూ.పదివేలు కూడా ఇవ్వట్లేదు. కోల్డ్ స్టోరేజీల్లో బస్తాలెద్దామంటే ఖరీదుదారులు అడ్వాన్సులు చెల్లించి 
బుక్ చేసుకున్నరు.  మా బస్తాలకు ఖాళీ లేదని చెప్తున్నరు. ఓనర్లు వారికే సహకరిస్తున్నరు. స్థానిక మార్కెట్ యార్డుల పరిధిలో కోల్డ్ స్టోరేజీలను నిర్మించాలే. 
అప్పుడే రైతుల బాధలు తీరుతయి. 

‒ జనగం మల్లయ్య, చిట్యాల మండల రైతు, జయశంకర్​ భూపాలపల్లి జిల్లా

రూ.10 వేల కంటే తక్కువే.. 

నాలుగు ఎకరాల్లో వండర్ హాట్ వెరైటీ మిర్చి సాగు చేసిన. ఎకరానికి రెండు లక్షల దాకా ఖర్చు చేసిన. వారం రోజుల నుంచి మార్కెట్​లో ధరలు పడిపోతున్నయి. ఇప్పుడు ఖరీదుదారులు క్వింటాల్​కు రూ.10 వేల కంటే తక్కువకే అడుగుతున్నరు. ఇప్పుడున్న ధరలకు మిర్చి అమ్ముకుంటే పెట్టుబడి ఖర్చులు కూడా 
వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలే.
- భాషబోయిన సమ్మయ్య,  జూకల్  రైతు,     
   జయశంకర్​ భూపాలపల్లి జిల్లా