ఏనుమాముల మార్కెట్​కు పోటెత్తిన మిర్చి

  •     ఒక్కరోజే 70 వేల నుంచి లక్ష బస్తాలు

వరంగల్ సిటీ, వెలుగు : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ఎర్ర బారింది. మార్కెట్ ఆవరణలో ఎక్కడచూసినా మిర్చి బస్తాలే కనిపిస్తున్నాయి. మార్కెట్ కు  రెండు ప్రధాన దారులు ఉండగా ఆ దారుల్లో మొత్తం మిర్చి బస్తాలు పేరుకుపోయాయి. ఇప్పటివరకు 71 వేల నుంచి సుమారు లక్ష బస్తాల వరకు మిర్చి బస్తాలు వచ్చినట్టు మార్కెట్​ అధికారులు చెప్పారు.

ఈ సీజన్లో ఒక్కరోజు అత్యధికంగా 41 వేల బస్తాలు మాత్రమే రాగా..సోమవారం 71 వేల పైచిలుకు బస్తాలు ఒక్కరోజే వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.  యుఎస్-341 మిర్చి రకం క్వింటాల్ కు రూ.40 వేలు ధర సోమవారం పలికింది. మార్కెట్​ కు మిర్చి ఎక్కువ సంఖ్యలో రావడంతో సరుకు ధర నిర్ణయం 12 గంటల వరకు కొనసాగింది.  కాంటాలు వేయడం మాత్రం  అర్ధరాత్రి వరకూ కొనసాగాయి.  గతంలో అయితే ఉదయం 9 గంటల వరకు ధరలు నిర్ణయం కాగా, మధ్యాహ్నాం సమయంలో కాంటాలు సైతం పూర్తి అయ్యేవి. 

జాతర ఎఫెక్ట్​..వరుస సెలవులు..

మేడారం సమ్మక్క, సారక్క పండుగ సీజన్​ ఆరంభం కావడంతో మార్కెట్​కు వరుస సెలవులు (మేడారానికి  సంబంధించిన) ఇవ్వడం ఆనవాయితిగా వస్తోంది.  దీంతో రైతులు తమ సరుకులను మార్కెట్​కు  పెద్ద ఎత్తున తీసుకువస్తున్నారు. గత రెండు వారాల నుంచి మూడు రోజులు మార్కెట్​ నిర్వహిస్తే మరో మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈనెల 21 నుంచి 25 వరకు జాతర సెలవులు రానున్నాయి. దీంతో మార్కెట్​కు ఎర్ర బంగారం సోమవారం పోటెత్తింది.