ధర లేదని దాస్తలేరు! ..ఏనుమాముల మార్కెట్ లో ఖాళీగా మిర్చి కోల్డ్ స్టోరేజీలు

ధర లేదని దాస్తలేరు! ..ఏనుమాముల మార్కెట్ లో ఖాళీగా మిర్చి కోల్డ్ స్టోరేజీలు
  • గతేడాది దాచిన పంటకు క్వింటాల్ కు రూ.12 వేలు ధర  
  • కోల్డ్ స్టోరేజీల సామర్థ్యం 33.50 లక్షల బస్తాలు
  • ఈసారి 12 లక్షల బస్తాలలోపే వచ్చిన పంట
  • ఈ సీజన్ లో దాచేందుకు ఇష్టపడని రైతులు

వరంగల్‍, వెలుగు : ఆసియాలోనే రెండో పెద్ద మార్కెట్ అయిన వరంగల్ ఏనుమాములలో  మిర్చి కోల్డ్ స్టోరేజీలు ఖాళీగా ఉన్నాయి. గతేడాది వరకు ఏటా మిర్చి సీజన్‍ వచ్చిందంటే.. పంటను దాచుకోవడానికి దొరికేవి కాదు. మిర్చి లోడ్ ఆటోలు, లారీలు, ట్రాలీలు కిలోమీటర్లు బారులు కట్టేవి. ఇక పంటను త్వరగా కొనాలని రైతులు ధర్నాలు, ఆందోళనలు చేపట్టేవారు. ఈసారి కోల్డ్ స్టోరేజీల్లో పంటను దాచుకునేందుకు   రైతులు ఇష్టపడటంలేదు.  ధర పడిపోవడమే ఇందుకు కారణం.  

గతేడాది సీజన్‍కు ముందు క్వింటాల్‍ మిర్చికి రూ.20 వేలు– రూ.22 వేల మధ్య ధర పలికింది. సీజన్‍ షురూ అయి మార్చి, ఏప్రిల్‍ నాటికి రూ.16 వేలకు పడిపోయింది. దీంతో రైతులు ఆగ్రహం చెంది.. రేటు ఎలా తగ్గిస్తారంటూ మార్కెటింగ్ ఆఫీసర్లపై  సీరియస్‍ అయ్యారు. దీంతో జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రైతుల సమస్యను పరిష్కరించాలని ఆఫీసర్లను ఆదేశించారు. పంటకు డిమాండ్‍ వచ్చేవరకు దాచుకోడానికి కోల్డ్ స్టోరేజీలను వాడుకోవాలని రైతులకు  సూచించారు. దీంతో మార్కెట్ సమీపంలోని 25 స్టోరేజీలు పది రోజుల్లోనే నిండిపోయాయి.  

 రూ.16 వేల నుంచి రూ.12 వేలకు పడిపోగా.. 

గతేడాది సీజన్‍ మొదట్లో తేజ రకం మిర్చి క్వింటాలుకు రూ.22 వేల ధర పలికింది. మార్చి, ఏప్రిల్‍ నాటికి రూ.16 వేలకు పడిపోయింది. దీంతో అధికారులు భవిష్యత్ లో మిర్చికి మంచి ధరలు వస్తాయని, రైతులు తొందరపడి తక్కువకు అమ్ముకోవద్దని కోల్డ్ స్టోరేజీల్లో దాచుకోవాలని సూచించారు. దీంతో నాలుగైదు రోజులు శ్రమించి  నెలకు 8 వేలు అదె కడుతూ  9 నెలలు పంటను దాచారు. ఈ ఏడాది సీజన్‍ షురూ కాగానే మార్కెట్‍లో అమ్మడానికి తీసుకెళ్తే రూ.12 వేల ధర పలికింది. స్టోరేజీల్లో దాచిన పంట రంగు మారిందని, నాణ్యత లేదని వ్యాపారులు సాకు చూపి తక్కువ రేటుకు కొనుగోలు చేశారు. దీంతో రైతులు ఒక్కో క్వింటాల్‍పై రూ.4 వేలతో పాటు కోల్డ్ స్టోరేజీల అద్దె కూడా  నష్టపోయారు.

 12  లక్షల బస్తాలు కూడా దాచుకోలే

ఏనుమాముల మార్కెట్‍ పరిధిలో దాదాపు 33 లక్షల బస్తాల పంట నిల్వ సామర్థ్యం ఉంది. అయితే.. ఈసారి  రైతులు పంటను దాచుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇప్పటికే స్టోరేజీల్లో పలు పంటలకు చెందిన 8 లక్షల నుంచి 9 లక్షల బస్తాలు పాతవే ఉన్నాయి.   

మార్కెట్‌‌కు పోటెత్తిన మిర్చి

గ్రేటర్‌‌ వరంగల్/వరంగల్‌‌ సిటీ : వరంగల్‌‌ ఏనుమాముల మార్కెట్‌‌కు సోమవారం మిర్చి పోటెత్తింది. శుక్ర, శని, ఆదివారాలు సెలవులు రావడంతో సోమవారం రైతులు 60 వేల నుంచి 70 వేల బస్తాల మిర్చిని మార్కెట్‌‌కు తీసుకొచ్చారు. తేజ రకం మిర్చి క్వింటాల్‌‌కు గరిష్టంగా రూ.12 వేలు పలుకగా, కనిష్టంగా రూ. 8 వేలు పలికింది. వండర్‌‌ హాట్‌‌ రకం రూ. 13 వేల నుంచి రూ. 10 వేల మధ్య, యుఎస్​-341 రకరం రూ. 11 వేల నుంచి రూ. 8 వేల మధ్య, దేశీ రకం గరిష్టంగా రూ.27 వేలు పలుకగా.. కనిష్టంగా రూ.18 వేలు పలికింది. ధరలు ఇలాగే కొనసాగితే భారీ మొత్తం నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.   

పంటను దాచి లాస్‍ అయినం 

పంటను దాస్తే ధరలు పెరుగుతాయన్న ఆఫీసర్ల మాటలు నమ్మాం. గతేడాది కోల్డ్ స్టోరేజీల్లో మిర్చి పంటను దాచిపెట్టినం. అప్పుడు ధర రూ.16 వేలు ఉంటే కనీసం రూ.20 వేలకు పెరుగుతుందని అనుకున్నాం. తీరా చూస్తే రూ.12 వేలకు పడిపోయింది. దీంతో లాస్‍ అయినం. 8 నెలలు స్టోరేజీ అద్దెలు పోయాయి. అందుకే ఈసారి దాచే ఆలోచన చేయట్లేదు.- మోహన్‍, మిర్చి రైతు, నర్సంపేట 

కోల్డ్ స్టోరేజ్ లు నిండలేదు

గతంలో మాదిరిగా రైతులు పంటను దాచుకోడానికి రావట్లేదు. గతేడాది ఇదే టైమ్ కు స్టోరేజీల కోసం గొడవలకు దిగారు. ఈసారి12 లక్షలలోపే మిర్చి బస్తాలు వచ్చాయి. 33 లక్షల సామర్థ్యం కలిగిన కోల్డ్ స్టోరేజీల్లో వీటితో పాటు పాతవి కలిపి 8 లక్షల వరకు ఉన్నాయి. మిగతావన్నీ ఖాళీగానే ఉన్నాయి. - రెడ్డి నాయక్‍, ఏనుమాముల మార్కెట్‍ ఇన్ చార్జ్ సెక్రటరీ