తామర, ఎండు తెగుళ్లతో దెబ్బతింటున్న మిర్చిపంట

  • తామర, ఎండు తెగుళ్లతో దెబ్బతింటున్న మిర్చిపంట
  • ఎండిపోతున్న చేన్లు.. రాలుతున్న పూత, కాత
  • పురుగుల మందులకు లక్షలు ఖర్చు పెడ్తున్నా ఫలితం ఉంటలే
  • మూడు రోజుల వ్యవధిలోనలుగురు రైతుల ఆత్మహత్య

మహబూబాబాద్/ఖమ్మం/భద్రాద్రి కొత్తగూడెం/ఆసిఫాబాద్: ఎన్నో ఆశలతో మిర్చి పంట  సాగుచేసిన  రైతులకు ఈసారి తెగుళ్లతో  కన్నీళ్లే మిగులుతున్నాయి. మిర్చి నాటిన నెలరోజుల్లోనే నల్లి, వేరుకుళ్లు, ఆకు ముడత, గుబ్బ రోగాలు దెబ్బతీయగా, ఇటీవలి తుఫాను తర్వాత తామర, ఎండు తెగులు విజృంభించడంతో పూత, కాత పూర్తిగా రాలిపోతోంది. వీటి నివారణకు  మిర్చి రైతులు తమకు తోచిన మందులు పిచికారీ చేస్తుండడంతో తెగుళ్లు అదుపులోకి రావడం లేదు. ఒక్కో ఎకరాకు తక్కువలో తక్కువ లక్ష ఖర్చు చేస్తున్నా పంట చేతికివచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో ఆందోళన చెందుతున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

2.5 లక్షల ఎకరాల్లో సాగు.. 

గతేడాది మిర్చి క్వింటాల్‌కు రూ.20వేలకు పైగా రేటు పలకడంతో మిర్చి రైతులు ఈసారి సాగుపెం చారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్​, భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్​ తదితర జిల్లాల్లో 2.50లక్షల ఎకరాల వరకు మిర్చి సాగుచేసినట్లు హార్టికల్చర్​ ఆఫీసర్లు చెప్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఈ సారి అత్యధికంగా 92 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేసిన రైతులు తెగుళ్లతో తీవ్రంగా నష్టపోతున్నారు. మిర్చి నాటిన నెలరోజుల్లోనే నల్లి, వేరు కుళ్లు, ఆకు ముడత, గుబ్బ రోగాలు వచ్చాయి. వాటికి ఎన్ని మందులు కొట్టినా అదుపులోకి రాకపోవడంతో కొందరు రైతులు పంటను తొలగించి, మళ్లీ కొత్తగా మిర్చి సాగుచేశారు.  కానీ, ఎండు తెగులు కారణంగా కొణిజర్ల, తల్లాడ, ఏన్కూరు, వైరా మండలాల్లో చేన్లన్నీ ఎండిపోతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు 28వేల ఎకరాల్లో మిర్చి పంట సాగవుతోంది. ప్రారంభంలో తెల్లదోమ, నల్లి, తామర పురుగు ఉధృతితో సుజాతనగర్, జూలూరుపాడు, చండ్రుగొండ, టేకులపల్లి ఏరియాల్లో చాలా మంది రైతులు మిర్చి పంట తొలగించారు. దీంతో ఎకరానికి రూ. లక్ష నుంచి రూ. లక్షన్నర వరకు నష్టపోయారు. తీరా, ఇప్పుడు ఎండుతెగులుతో చేన్లు ఎండిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్  జిల్లాలో  మిర్చి  పంటకు  ఎండు తెగులు సోకి  వందల ఎకరాల్లో పంట మాడిపోతోంది. 

ఈ జిల్లాలో సుమారు 2 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేయగా 25 శాతం వరకు పంట నష్టం జరిగినట్లు హార్టికల్చర్​ ఆఫీసర్లు చెప్తున్నారు. మహబూబాబాద్​ జిల్లాలోని 81వేల ఎకరాల్లో  మిర్చి పంట సాగుచేయగా,  ఇటీవలి తుఫాన్​ ఎఫెక్ట్​తో  నల్ల తామర తెగులు ఉధృతి పెరిగింది.  దీంతో మిర్చిలో పూత, కాత పూర్తిగా రాలిపోతోంది. తెల్ల రంగులో ఉండే మిర్చి పూత సైతం నల్ల రంగులోకి మారుతోంది. దీంతో రైతులు తమకు తోచిన, వ్యాపారులు సూచించిన మందులను విచ్చలవిడిగా పిచికారీ చేస్తుండగా,  వైరస్​ అదుపులోకి రావడం లేదు.

ముగ్గురు రైతుల ఆత్మహత్య

మిర్చిపై ఇప్పటికే ఎకరానికి రూ.2లక్షలకు పైగా పెట్టుబడి పెట్టడం, తెగుళ్లు అదుపులోకి రాకపోవడంతో కలత చెందిన రైతులు ఉసురు తీసుకుంటున్నారు. మహబూబాబాద్​ జిల్లాలో ఇప్పటికే ఇద్దరు మిర్చి రైతులు సూసైడ్​ చేసుకున్నారు. మహబూబాబాద్​ జిల్లా నరసింహులపేట మండలం జగ్గుతండాకు చెందిన మిర్చి రైతు అజ్మీరా శ్రీను (42) ఈనెల 11న ఇంట్లో ఉరివేసుకున్నాడు. తనకున్న 2 ఎకరాల్లో మిర్చికి తామర తెగులు సోకడంతో రూ.3లక్షలు ఖర్చు చేసినా అదుపులోకి రాలేదు. దీంతో అప్పులు ఎలా తీర్చాలనే ఆందోళనతో ప్రాణం తీసుకున్నాడు.  ఇదే జిల్లా కేసముద్రం మండలం నారాయణ పురం గ్రామ శివారు క్యాంపు తండాకు చెందిన ధరావత్​ వీరన్న (40), అతని భర్య లలిత చేను వద్ద ఈ నెల13న  పురుగుల మందు తాగగా, వీరన్న మృతి చెందాడు. లలిత ప్రాణాపాయ స్థితిలో ఉంది.  వీరన్న మూడెకరాల్లో మిర్చి, పత్తి, వరి పంటలను సాగు చేయగా, ఇటీవల వర్షంతో వడ్లు మొలకెత్తడం, మిర్చి పైరుకు తెగుళ్లు సోకడంతో  అప్పుల భారం పెరిగి, ఆత్మహత్య  చేసుకున్నాడు. అంతకుముందు ఈ నెల 10న ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని గోనేపల్లిలో చింత అనిల్ (36) అనే మిర్చి రైతు కూడా సూసైడ్​ చేసుకున్నాడు. మిర్చికి సోకుతున్న తెగుళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సరైన పురుగుమందులను సిఫార్సు చేయాల్సిన హార్టికల్చర్​ ఆఫీసర్లు జాడలేకపోవడం వల్లే రైతులకు దిక్కుతోచడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పురుగుల మందు తాగి మిర్చి రైతు బలవన్మరణం 

మంగపేట, వెలుగు : ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మంపేటలో పోకల పుల్లయ్య (53) అనే మిర్చి రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువుల కథనం ప్రకారం..పుల్లయ్య తిమ్మంపేట అత్త చెరువు సమీపంలో ఉన్న మూడున్నరెకరాల్లో మిర్చి సాగు చేస్తున్నాడు. కొద్ది రోజుల కింద కురిసిన అకాల వర్షాలకు పంటకు తెగులు సోకింది. దీంతో చేనులోనే గడ్డిమందు తాగాడు. గమనించిన రైతులు పుల్లయ్యను ఏటూరునాగారం గవర్నమెంట్ హాస్పిటల్​కు తరలించారు.  అక్కడి నుంచి వరంగల్​లోని ఓ ప్రైవేట్ ​హాస్పిటల్​కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశాడు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.

మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

గతంలో ఎన్నడూ లేని విధంగా  నల్ల తామర, దుబ్బ తెగుళ్ల మూలంగా మిర్చి పంట రోజుల వ్యవధిలోనే మాడిపోతోంది . లక్షల పెట్టుబడితో  సాగు చేశాం. పంట చేతికి వచ్చే దశలో మొత్తం నష్టపోవాల్సి వస్తోంది.  ప్రభుత్వం నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేల చొప్పున సహాయం అందించాలి.
- కొమ్మల ప్రభాకర్ రెడ్డి,  రైతు, నర్సింహులపేట

రెండేండ్లుగా ఇదే పరిస్థితి..

నారుదశలో అతివృష్టితో తెగుళ్ల బారి నుండి మొక్కలను కాపాడి నాటినం. పంట ఏపుగా పెరిగి, పూతకాత దశకు వచ్చేసరికి నల్ల తామర, ఎర్రనల్లి దాడి చేయడంతో నష్టం వాటిల్లింది. వారానికి రెండుసార్లు పురుగుల మందులు స్ప్రే చేస్తున్నాం. ఎకరానికి రూ.3 వేలు ఖర్చవుతున్నది. ఎకరాకు ఇప్పటికే రూ.లక్షా 50 వేలు పెట్టుబడి పెట్టినం. రెండేండ్లుగా ఇదే పరిస్థితి. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి మిర్చి పండిస్తే అప్పులే మిగులుతున్నయ్. ప్రభుత్వం ఆదుకోవాలే.
- గజనాల సమ్మయ్య,  రైతు, జూకల్ 

పిచికారీ మందులు తరచూ మార్చాలి  

జిల్లాలో మహబూబాబాద్​, కురవి, నరసింహులపేట,  మరిపెడ, కేసముద్రం, నెల్లికుదురు మండలాల్లోని మిర్చి పంటలో నల్ల తామర తెగులు అధికంగా ఉంది. రైతులు పురుగు మందులు పిచికారి చేసే క్రమంలో తరచుగా మారుస్తూ వినియోగించాలి.సింథటిక్​ పైరిత్రాయిడ్​ను వాడొద్దు.వేపనూనే, మైక్రో న్యూటియంట్స్​ పోషకాల మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. ఎకరానికి ఫిప్రోనిల్​80 గ్రాములు, 40 గ్రాముల  డై ఫెన్​తూరాన్​  కలిపి పిచికారీ చేయాలి .
- రాకేశ్​ , హర్టికల్చర్​ ఆఫీసర్​, తొర్రూరు