- రూ.లక్షల్లో నష్టం వస్తుందని వాపోతున్న రైతులు
- వ్యవసాయ అధికారులు పట్టించుకోవట్లేదని ఆవేదన
భద్రాచలం/చండ్రుగొండ: గోదావరి పరివాహక ప్రాంతంతో పాటు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో మిర్చి పంటకు తెగుళ్లు సోకి రూ. లక్షల్లో నష్టపోతున్నారు. మన్యంలో నల్లరేగడి నేలల్లో సాగు చేసే మిరప పంటకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో పెట్టుబడులకు లెక్క చేయకుండా రైతులు మిర్చి సాగు చేస్తుంటారు. గోదావరి వరదల కారణంగా మిరప సాగు మూడు నెలలు ఆలస్యం కాగా, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో తెగుళ్లు సోకుతున్నాయి. పంటలు చేతికొచ్చే సమయానికి ఇలా జరగడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో 25 వేలహెక్టార్లలో మిర్చి సాగు చేశారు. ఎకరానికి సుమారు రూ.1.30 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. తెగుళ్ల కారణంగా దిగుబడి ఎంత వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
వరుస తెగుళ్లతో ఆందోళన..
మిరప తోటలకు వరుస తెగుళ్లు సోకుతున్నాయి. గులాబీ రంగు పురుగుతో దిగుబడులు తగ్గుతున్నాయి. పంట ప్రారంభంలో బాగానే ఉన్నా పలు చోట్ల కంకర తెగులు వస్తోంది. పూత దశలో నల్లతామర తెగులు కన్పిస్తోంది. సుజాతనగర్, జూలూరుపాడులతో పాటు గోదావరి పరవాహక ప్రాంతాల్లోని మండలాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతోపాటు ఎండు తెగులు సోకుతుందని రైతులు వాపోతున్నారు. అలాగే వేరు కుళ్లు తెగులుతో మిరప మొక్క నిలువునా ఎండిపోతుంది. టేకులపల్లి, ఇల్లందు మండలాల్లో ఈ తెగులు ఎక్కువగా కనిపిస్తోంది. పురుగుల మందులు స్ప్రే చేస్తున్నా తెగుళ్ల ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. కొన్ని చోట్ల మొక్కల ఎదుగుదలలో తేడా కన్పిస్తోంది. గోదావరి వరదలతో రెండోసారి ఒక్కో మొక్కను రూ.2కు కొని సాగు చేశారు. దుక్కులు, మొక్కల కొనుగోలు, కూలీ, పురుగుల మందులు, ఎరువులు ఇలా ఖర్చు రెండింతలైంది. సుజాతనగర్ మండలం కోమటిపల్లి గ్రామంలో మూడ్ సాములు అనే రైతు 3 ఎకరాల్లో మిరప సాగు చేశాడు. 70 రోజులైనా ఎదుగుదల లేకపోవడంతో తోట మొత్తం పీకేశాడు. రూ.1.70 లక్షల పెట్టుబడి నష్టపోయానని వాపోతున్నాడు. చుట్టుపక్కల గ్రామాల్లోని 50 ఎకరాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ రూ.50 లక్షల వరకు పెట్టుబడులు నష్టపోవాల్సి వచ్చింది. చర్ల మండలం మొగళ్లపల్లి, లింగాపురం, వీరాపురం, కొత్తపల్లి, చర్ల, సుబ్బంపేట, కొయ్యూరు, మిడిసిలేరు, ఆర్కొత్తగూడెం, సత్యనారాయణపురం, చండ్రుగొండ మండలం గుర్రాయిగూడెం, రావికంపాడు, తుంగారం, గానుగులపాడు, బాలికుంట తదితర గ్రామాల్లో మిరప తోటలకు తెగుళ్లు సోకాయి.
పంటమార్పిడి చేసుకోవాలి
తెగుళ్లు సోకుతున్న మాట వాస్తవమే. అన్ని మండలాలు తిరుగుతూ తెగుళ్ల నివారణపై రైతులకు సలహాలు, సూచనలు అందిస్తున్నాం. ప్రతి ఏటా ఒకే పంట సాగు చేయడంతో ఈ పరిస్థితి వస్తోంది. పంట మార్పిడి చేసుకుంటే తెగుళ్ల బెడద ఉండదు.
- డా.శివ, సైంటిస్ట్, కృషి విజ్ఞానకేంద్రం
అప్పుల పాలయ్యాం
మిరప తోట సాగు కోసం అప్పుల పాలయ్యాం. మూడు ఎకరాల్లో మిర్చి పంట సాగుకు రూ.3లక్షల పెట్టుబడులు పెట్టినా. తెగుళ్లు సోకడంతో పురుగు మందులు కొని స్ప్రే చేసినా ఫలితం ఉండడం లేదు. అగ్రికల్చర్ ఆఫీసర్లు అవగాహన కల్పించక పోవడంతో నష్ట పోయాం. గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి తెగుళ్ల నుంచి పంటను కాపాడాలి.
- వెంకన్న, రైతు, గుర్రాయిగూడెం