నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కర్నూల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఆగమైతున్న మిర్చి రైతులు

నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కర్నూల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఆగమైతున్న మిర్చి రైతులు
  • పంటకు సోకిన ఎండు, నల్లతామర తెగుళ్లు
  • కార్వాంగలో పంటను పరిశీలించి నిర్ధారించిన సైంటిస్టులు  
  • కొన్ని మందులు సూచించినా దాటిపోయిన అదును 
  • నష్టపోయాం..  సర్కారు ఆదుకోవాలని  రైతుల విన్నపం

నాగర్​కర్నూల్, వెలుగు: నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కర్నూల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో మిర్చి రైతులు ఆగం అవుతున్నారు. ఈ యేడు కురిసిన భారీ వర్షాలకు ఎండు, నల్లతామర తెగుళ్లు సోకినట్లు సైంటిస్టులు నిర్ధారించారు.  కొన్ని మందులు  స్ప్రే చేయాలని చెప్పినా.. ఇప్పటికే అదును దాటిపోవడంతో పంటను కాపాడడం కష్టమేనని రైతులు అంటున్నారు. తాము ముందు నుంచీ అధికారులు, సైంటిస్టులకు మొరపెట్టుకుంటున్నా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.  ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఆదేశిస్తే కాయదశకు వచ్చిన పంటను పరిశీలించి తెగుళ్లు సోకాయని చెప్పారని మండిపడుతున్నారు. విత్తనాలు ఎరువులు, ఫెస్టిసైడ్స్‌‌‌‌‌‌‌‌,  కలుపు, వేప పిండి తదితర ఖర్చులు కలుపుకొని ఎకరాకు రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టామని, సర్కారే ఆదుకోవాలని కోరుతున్నారు. పరిహారం ఇవ్వాలని గత గురువారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ ముందు ధర్నా కూడా చేశారు. 

6,277 ఎకరాల్లో సాగు

 జిల్లాలో 6,277 ఎకరాల్లో మిర్చిని సాగు చేశారు. ఇందులో తాడూరు, తెల్కపల్లి, తిమ్మాజీపేట, అమ్రాబాద్​ మండలాల్లోనే 5,033 ఎకరాలు ఉండడం విశేషం. పంట నాటు వేసినప్పటి నుంచి పూత దశ వరకు బాగానే ఉన్నా కాయలు పట్టే టైమ్‌‌‌‌‌‌‌‌లో తెగుళ్లు సోకాయి. దీంతో రైతులు అధికారులు, సైంటిస్టులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా ఫర్టిలైజర్ షాప్‌‌‌‌‌‌‌‌లను ఆశ్రయించాల్సి వచ్చింది.  వాళ్లు చెప్పిన మందులన్నీ పిచికారీ చేసుకుంటూ పోయినా.. ఫలితం మాత్రం కనిపించలేదు.

మంత్రికి మొరపెట్టుకున్న రైతులు 

ఇటీవల పాలెం వ్యవసాయ కాలేజీలో నిర్వహించిన ప్రోగ్రాంలో పాల్గొన్న అగ్రికల్చర్​ మినిస్టర్ నిరంజన్ రెడ్డితో మిర్చి రైతులు తమ బాధను చెప్పుకున్నారు. పంటకు తెగుళ్లు సోకినా అధికారులు,  సైంటిస్టులు పట్టించుకోవడం లేదని, ఫర్టిలైజర్ షాప్ ఓనర్లు చెప్పిన మందులు కొట్టినా ఫలితం ఉండడం లేదని వాపోయారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు  పాలెం సైంటిస్టుల టీం, అగ్రికల్చర్, హార్టికల్చర్ ఆఫీసర్లు తెల్కపల్లి మండలం కార్వాంగలో పర్యటించారు.  ఇక్కడ  267 ఎకరాల్లో సాగు చేసిన మిర్చి పంటను పరిశీలించి.. అధిక వర్షాల కారణంగా ఎండు తెగులు, నల్లతామర తెగులు సోకినట్లు గుర్తించారు.

మందులు సూచించినా..

పంటకు ఎండు తెగులు రాకుండా నాటు వేసే ముందే  ట్రెకొడర్మా విరిడె మందును ఎకరాకు 21 కేజీలు చల్లాలని సైంటిస్టులు చెప్పారు.  ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు వెంటనే కాపర్ యాక్సి క్లోరైడ్ ఎకరాకు మూడు లీటర్లు కలిసి మొక్క వేర్లకు తడిచేలా డ్రిప్ పద్ధతిలో చల్లాలని సూచించారు. అనంతరం రెండు రోజులకోసారి 45 నిమిషాల పాటు డ్రిప్ ద్వారా నీటిని పారించాలని తెలిపారు.  పిప్రోనిల్,  వేప నూనె  కలిసి పిచికారీ చేస్తే నల్లతామర పురుగును కంట్రోల్‌‌‌‌‌‌‌‌ చేయొచ్చన్నారు. అయితే,  ఇప్పటికే పంట చేతికొచ్చేదశ కావడంతో ఈ సారి పంటపోయినట్టేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

కొంపముంచిన హైబ్రిడ్ రకాలు!  

మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి ఏటా కొత్తకొత్త హైబ్రిడ్ రకాలు వస్తున్నాయి. రైతులు కూడా నార్మల్ సీడ్స్‌‌‌‌‌‌‌‌, సెమీ హైబ్రిడ్ ను వదిలి కొత్తవాటినే ఎంచుకుంటున్నారు. ఇందులో చాలా రకాలు తెగుళ్లను తట్టుకోలేనివే ఉంటుండడంతో నష్టం జరుగుతోంది.  కాగా,  వ్యవసాయ అధికారులు ఇచ్చిన రిపోర్డులో అగ్ని, అపర్ణ, అరుణిమ, భాస్కర్​, బ్యాడిగి, ధరణి, తేజ, ఎఫ్​1  హైబ్రీడ్​ సీడ్స్​వాడినట్లు ప్రస్తావిస్తే  రైతులు మాత్రం దామిని, దామిని720, జమున, 55 రకం, 720 సీడ్​ వాడినట్లు చెప్తున్నారు.  కొన్ని రకాలు బాగానే ఉన్నా మెజారిటీ సీడ్స్‌‌‌‌‌‌‌‌కు తెగుళ్లు సోకుతున్నాయని చెబుతున్నారు.