మిర్చి ఏరకుండా  వదిలేస్తున్నరు !

మిర్చి ఏరకుండా  వదిలేస్తున్నరు !
  • ఓ వైపు తెగుళ్లతో తగ్గిన దిగుబడి.. మరో వైపు మార్కెట్‌‌‌‌లో దక్కని ధర
  • క్వింటాల్‌‌‌‌కు రూ. 14 వేలకు మించని రేటు
  • కొందరు రైతులకు దక్కేది రూ. 6 వేలే...
  • కూలీ ఖర్చులు కూడా రావడం లేదంటున్న రైతులు

ఖమ్మం, వెలుగు :ఈ ఏడాది మిర్చి రైతులకు కలిసి రావడం లేదు. ఒకవైపు వేరుకుళ్లు, కొమ్మకుళ్లు, కాయకుళ్లు, నల్ల తామర వంటి తెగుళ్లు సోకి దిగుబడి తగ్గిపోగా... మరో వైపు చేతికొచ్చిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఎకరానికి సగటున 25 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి తెగుళ్ల కారణంగా సగానికి పడిపోయింది. చేతికొచ్చిన పంటను మార్కెట్‌‌‌‌కు తీసుకెళ్తే అక్కడ గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రైతులు రెండు విధాలుగా నష్టపోతున్నారు. ఖమ్మం రూరల్‌‌‌‌ మండలం ఆరెకోడు తండాలోని చాలా మంది రైతులది ఇదే పరిస్థితి. 

వర్షాలు, తెగుళ్లతో తగ్గిన దిగుబడి

రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లోనే తేజ రకం మిర్చిని సాగు చేస్తారు. ఘాటు ఎక్కువగా ఉండడంతో ఈ మిర్చి రకానికి విదేశాల్లో డిమాండ్‌‌‌‌ ఉంటుంది. గతంలో ఇక్కడి నుంచి థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌, బంగ్లాదేశ్, మలేషియా, చైనా, సింగపూర్‌‌‌‌ వంటి దేశాలకు మిర్చి ఎగుమతి అయ్యేది. ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో 90 వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు.

తోటలు వేసే సమయంలో విపరీతమైన ఎండల కారణంగా పెద్దఎత్తున మొక్కలు చనిపోయాయి. వాటి స్థానంలో మరోసారి విత్తనాలు వేయాల్సి రావడంతో రైతులకు పెట్టుబడి ఖర్చు పెరిగింది. సెప్టెంబర్‌‌‌‌లో వర్షాలు, వరదల కారణంగా తోటల్లో నీరు నిలిచింది. దీంతో మొక్కలు ఎరుపెక్కి కొంత మేర దెబ్బతిన్నాయి. ఆ తర్వాత గుబ్బ తెగులు, కొమ్మ కుళ్లు, వేరుకుళ్లు తెగుళ్లు ఆశించడంతో దిగుబడి భారీగా పడిపోయింది. 

మూడేండ్ల కింద రూ. 25 వేలు.. ప్రస్తుతం రూ. 14 వేలే...

మూడేండ్ల కింద ఖమ్మం మార్కెట్‌‌‌‌లో తేజ రకం మిర్చి క్వింటాల్‌‌‌‌కు రూ.25 వేలు పలుకగా, శుక్రవారం గరిష్టంగా రూ.14 వేలు మాత్రమే పలికింది. మార్కెట్‌‌‌‌కు 27 వేల బస్తాలు రాగా ఒకటి, రెండు లాట్లను మాత్రమే ఈ రేటుకు కొనుగోలు చేశారు. చాలా మంది రైతులకు రూ.13,300లోపే దక్కింది. మిర్చి డ్రైగా లేదని, కలర్‌‌‌‌ తక్కువగా ఉందని, అంతర్జాతీయంగా ఆర్డర్లు లేవంటూ రేటును అమాంతం తగ్గించేశారు.

కొందరు రైతులకైతే క్వింటాల్‌‌‌‌కు రూ. 6 వేల దక్కింది. అసలే దిగుబడి తగ్గి బాధల్లో ఉన్న రైతులకు ఇప్పుడు రేటు కూడా రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.  తెగుళ్ల కారణంగా ఓ వైపు రైతులు ఇబ్బంది పడుతుంటే రేటు విషయంలోనైనా పట్టించుకోవాల్సిన మార్కెటింగ్‌‌‌‌ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

మిర్చి తోటలను పరిశీలించిన హార్టికల్చర్‌‌‌‌ యూనివర్సిటీ సైంటిస్ట్‌‌‌‌లు

ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, చింతకాని, వైరా, కొణిజర్ల మండలాల్లోని మిర్చి తోటలను హైదరాబాద్‌‌‌‌లోని కొండా లక్ష్మణ్‌‌‌‌ హార్టికల్చర్‌‌‌‌ యూనివర్సిటీకి చెందిన సైంటిస్ట్‌‌‌‌లు పరిశీలించారు. మిరప తోటల్లో నల్ల తామర, ఎర్రనల్లి పురుగు, కాయ కుళ్లు తెగులు ఆశించినట్లు గుర్తించి, వాటి నివారణ చర్యలను రైతులకు వివరించారు.

నల్ల తామర పురుగులు అక్టోబర్ నుంచి పంటకు ఆశించి, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎక్కువగా వృద్ధి చెంది పూలు, లేత చిగుర్లను నాశనం చేస్తాయన్నారు. ఆకులపై రసం పీల్చడం వల్ల ముడత కనిపిస్తుందని, కాయ దిగుబడులు తగ్గేలా చేస్తాయన్నారు. ఈ పురుగు మూడు, -నాలుగు సంవత్సరాలుగా మిరప పంటలకు నష్టం చేస్తోందని వివరించారు. 

ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి తగ్గింది 

ఎకరంన్నర సొంత భూమితో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి సాగు చేసిన. ఈ ఏడాది తెగుళ్లు, వైరస్‌‌‌‌ల వల్ల దిగుబడి తగ్గింది. ఎకరానికి 25 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా... 15 క్వింటాళ్లే వచ్చింది. పురుగు మందులు, రెండు సార్లు మిర్చి ఏరినందుకు కూలి, ఇతర ఖర్చులన్నీ కలిపి ఇప్పటివరకు రూ.3.50 లక్షలు అయ్యాయి. దిగుబడి పడిపోవడంతో ఈ సారి అప్పులు తప్పేలా లేవు.- పందిరి వెంకటరెడ్డి, గురువాయిగూడెం

కూలీ ఖర్చులు కూడా వస్తలేవు 

ఖమ్మం మార్కెట్లో క్వింటాల్‌‌‌‌ మిర్చి రూ.10వేలు కూడా పలకడం లేదు. మిర్చి ఏరేందుకు కూలీలు కిలోకు రూ. 15 అడుగుతున్నారు. మరికొంత మంది తోట ఏరితే సగం రైతుకు, సగం కూలీలకు ఇవ్వాలని అడుగుతున్నారు. మిర్చి దిగుబడి చూస్తే కూలీ ఖర్చులు కూడా గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. అందుకే తోటను ఏరించడం కంటే వదిలేయడమే బెటర్‌‌‌‌ అనిపిస్తుంది.– రాజ్‌‌‌‌కుమార్‌‌‌‌, ఆరెకోడు తండా