Telangana Kitchen : వానాకాలంలో కారం కారంగా.. వెరైటీ కారాలు ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు..!

Telangana Kitchen : వానాకాలంలో కారం కారంగా.. వెరైటీ కారాలు ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు..!

వాతావరణం చల్లగా ఉన్నా... ముసుర్లు పడుతున్నా... పిల్లలు దగ్గర్నించి పెద్దోళ్ల వరకు సరో, దగ్గో వస్తనే ఉంటది. ఆ టైంలో నాలుకకు ఏది తిన్నా రుచించదు. అలాంటప్పుడు అన్నం, టిఫిన్లలో కారం వేసుకుని తింటే నోటికి మంచిగ అనిపిస్తది. అలాంటి కారాన్ని ఎన్నోరకాలుగా చేసుకోవచ్చు. అందులో కొన్ని వెరైటీస్.
 
ఎల్లిపాయ కారం

కావాల్సినవి 

ఎండుమిర్చి: పదిహేను, మినప్పప్పు: ఒక టేబుల్ స్పూన్, పెసరపప్పు: ఒక టేబుల్ స్పూన్, శెనగపప్పు: ఒక టేబుల్ స్పూన్, అవిసె గింజలు (కావాలనుకుంటే): ఒక టీ స్పూన్, పసుపు: అర టీ స్పూన్, మిరియాలు: అర టీ స్పూన్, జీలకర్ర: పావు టీ స్పూన్, ఉప్పు: తగినంత, వెల్లుల్లి గడ్డలు: రెండు, కరివేపాకు: రెండు రెమ్మలు

తయారీ : స్టవ్పై పాన్పెట్టి శెనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, ఎండుమిర్చి, అవిసె గింజలు, మిరియాలు, జీలకర్రలను విడివిడిగా వేగించాలి. స్టవ్ ఆఫ్ చేశాక, వేడిగా ఉన్న గిన్నెలో కరివేపాకు వేస్తే... అది కొద్దిగా వేగుతుంది. తర్వాత మిక్సీలో ఎండుమిర్చి తప్ప... వేగించుకున్న మిగతా అన్ని పదార్థాలను వేసి గ్రైండ్ చేయాలి. అది పొడి కాగానే కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలను వేసి మళ్లీ ఒక రౌండ్ తిప్పాలి. అందులో వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, పసుపు వేసి గ్రైండ్ చేయాలి. తర్వాత పొడిని గిన్నెలోకి తీసుకొని బాగా కలపాలి. వేడివేడి అన్నంలో ఈ ఎల్లిపాయ కారం కలుపుకుని తింటే.... అదిరిపోతుంది.

కరివేపాకు

కావాల్సినవి 
శెనగపప్పు: ఒక టేబుల్ స్పూన్, మినప్పప్పు: ఒక టేబుల్ స్పూన్, నువ్వులు: ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి: ఆరు, జీలకర్ర:ముప్పావు టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, కరివేపాకు: ఏడు రెమ్మలు, నూనె: సరిపడా

  తయారీ : పొడి కోసం కొంచెం ముదిరిన కరివేపాకుల్ని తీసుకోవాలి. వాటిని బాగా కడిగి ఆరబెట్టాలి. తర్వాత ఆకులను నూనెలో వేగించి పక్కన పెట్టాలి. స్టవ్పై పాన్ పెట్టి శెనగపప్పు, మినప్పప్పు, నువ్వులు, ఎండుమిర్చి, జీలకర్రను విడి విడిగా వేగించాలి. కరివేపాకు, ఎండుమిర్చిలను ఒకటి తర్వాత ఒకటి వేసి గ్రైండ్ చేయాలి. చివరగా వేగించిన పప్పులు, జీలకర్ర, నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి పొడి చేయాలి. ఈ పొడిని అన్నంలోనే కాదు... ఇడ్లీ, దోశలతోనూ తినొచ్చు. 

  ఎండు కొబ్బరి

కావాల్సినవి
ఎందు కొబ్బరి పొడి: రెండు కప్పులు, ఎండుమిర్చి: ఆరు, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, ఉప్పు: తగినంత, ధనియాలు: రెండు టీ స్పూన్లు, జీలకర్ర: అర టీ స్పూన్, పసుపు: చిటికెడు

 తయారీ

ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలను విడివిడిగా వేగించాలి. తర్వాత మిక్సీ గిన్నెలో ఎండుమిర్చి, ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. ఆపైన వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పసుపు, ధనియాలు, కొబ్బరి పొడి వేసి మళ్లీ గ్రైండ్ చేయాలి. వేడివేడి అన్నం లేదా టిఫిన్లలో కొబ్బరి కారం రుచిగా ఉంటుంది.