జగిత్యాలలో తగ్గిన మిర్చి ధర

జగిత్యాలలో  తగ్గిన మిర్చి ధర
  •     సీజన్‌‌ ప్రారంభంలో క్వింటాల్‌‌కు రూ.25 వేలు 
  •     తాజాగా రూ.8 వేలకు పడిపోయిన ధర
  •     మార్కెట్‌‌ లేక రోడ్లపైనే మిర్చి అమ్మకాలు 

మెట్‌‌పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లాలో మిర్చి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. సీజన్​ ప్రారంభంలో రూ.25వేలు పలికిన మిర్చి ధరలు.. ఒక్కసారిగా రూ.8వేలకు పడిపోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఇదే టైంలో రూ.28వేలు పలికింది. దీంతో లాభాలు వస్తాయన్న ఆశతో ఈసారి రైతులు కూడా వేలాది ఎకరాల్లో సాగుచేశారు. ఏప్రిల్ మొదటి వారంలో రేటు బాగానే ఉన్నా ఆతర్వాత ఒక్కసారిగా పడిపోవడంతో రైతుల్లో టెన్షన్‌‌ నెలకొంది. మరోవైపు స్థానికంగా మిర్చి మార్కెట్​ లేకపోవడం రైతులకు శాపంగా మారింది. స్టోరేజీకి గోదాములు కూడా లేకపోవడంతో తక్కువ ధరకే పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి.

తగ్గిన సాగు విస్తీర్ణం 

జగిత్యాల జిల్లాలో మిర్చి సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది. గతేడాది 3,690 ఎకరాల్లో సాగవగా ఈ ఏడాది కేవలం 1,490 ఎకరాల్లో మాత్రమే సాగుచేశారు. జిల్లాలో మెట్‌‌పల్లి, మల్లాపూర్‌‌, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, కథలాపూర్‌‌, మేడిపల్లి, రాయికల్‌‌, సారంగాపూర్‌‌, మల్యాల మండలాల్లో మిర్చి సాగు అధికం. ఈక్రమంలో రోజురోజుకు మిర్చి  ధరలు పడిపోతుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. 

రోడ్లపైనే అమ్మకాలు 

ఉమ్మడి కరీంనగర్‌‌‌‌ జిల్లాలో  మిర్చి మార్కెట్‌‌ లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరంగల్‌‌ ఏనుమాముల మార్కెట్‌‌కు తీసుకెళ్లాలంటే ట్రాన్స్‌‌పోర్ట్‌‌ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. దీంతో మెట్‌‌పల్లి, కోరుట్ల  పట్టణాల్లోని వీధుల్లో తిరుగుతూ, మండలాల్లో వీక్లీ మార్కెట్లలో అమ్ముకుంటున్నారు. కొందరు ఎన్‌‌హెచ్‌‌ 63పై పెట్టి అమ్ముతున్నారు. ప్రస్తుతం కేజీకి రూ.70 నుంచి రూ.100 వరకే పలుకుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

పెట్టుబడి కూడా రావట్లే.. 

నేను రెండెకరాల్లో మిర్చి పంట సాగు చేసిన.. ఇందుకు రూ.1.80 లక్షలు పెట్టుబడి పెట్టిన.  ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా తెగుళ్లు సోకడంతో 10 క్వింటాళ్ల లోపే వచ్చింది. 15 రోజుల కింద క్వింటాలుకు రూ.25 వేలు పలికిన రేటు ప్రస్తుతం రూ.10 వేలలోపే  పలుకుతోంది. దీంతో పంట అమ్ముకుందామంటే పెట్టుబడి కూడా రాలేని పరిస్థితి. జిల్లాలో  మిర్చి అమ్మకాలకు ప్రత్యేక మార్కెట్ ఏర్పాటు చేస్తే రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది. మార్కెట్ లేకపోవడంతో గల్లీగల్లీ తిరుగుతూ అమ్ముకుంటున్నాం. 
- నూనె గంగాధర్, కథలాపూర్