మెదక్, వెలుగు: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నర్సాపూర్ నియోజకవర్గంలోని కౌడిపల్లికి చెందిన చిలుముల సుహాసిని రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్ట్ కోసం జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేశారు. అయితే ఉన్నత విద్యావంతురాలైన సుహాసిని రెడ్డిని వరించింది.
ఈమె నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత చిలుముల విఠల్‌రెడ్డి కోడలు, టీఆర్ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన కిషన్‌రెడ్డి భార్య. గతంలో సుహాసిని రెడ్డి 1992 నుంచి 2001 వరకు సీపీఐ ఉమ్మడి మెదక్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా, 1994 నుంచి 1999 వరకు నర్సాపూర్ మండలం చిన్న చింతకుంట ఎంపీటీసీగా, 2001 నుంచి 2009 వరకు ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేశారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో సుహాసిని రెడ్డి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరారు.
నర్సాపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో, మెదక్ పార్లమెంట్ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు తీవ్రంగా కృషి చేశారు. తనకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి దక్కడం పట్ల సుహాసిని రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు.
సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా అంజయ్య
రాయికోడ్: సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా రాయికోడ్ మండలం నాగ్వార్ గ్రామానికి చెందిన గొల్ల అంజయ్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చిన అంజయ్య ఎంపీపీగా ప్రత్యక్ష ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. ఎల్ఎల్ బీ పూర్తి చేసిన ఆయన జిల్లా కోర్టులో లాయర్‌గా పనిచేస్తూనే రాజకీయాల్లో కొనసాగారు. టీడీపీ ప్రభుత్వ హయంలో రాయికోడ్ ఎంపీపీగా బాధ్యతలు నిర్వర్తించారు.
జహీరాబాద్ అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా టికెట్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ దక్కలేదు దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం జడ్పీటీసీ సభ్యుడిగా సేవలందించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి స్థానికంగా కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో మంత్రి దామోదర రానర్సింహకు ప్రధాన అనుచరుడిగా పేరు ఉండడం వల్ల అంజయ్యను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి దామోదర, సీఎం రేవంత్‌రెడ్డికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు.