పిల్లల్లో మయోపియా,ఇంటర్నెట్ వ్యసనం గురించి పెరుగుతున్న ఆందోళనలకు ప్రతిస్పందనగా చైనా ప్రభుత్వం కీలకం నిర్ణయం తీసుకుంది. 18 యేళ్ల లోపు పిల్లల స్మార్ట్ ఫోన్ వినియోగంపై నిబంధనలు పెట్టింది. ఈమేరకు చైనా సైబర్‌స్పేస్ రెగ్యులేటర్ 18 ఏళ్లలోపు పిల్లలు రోజుకు గరిష్టంగా రెండు గంటలు మాత్రమే స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించాలని ప్రకటించింది.
అయితే ఈ వార్త టెక్ కంపెనీ షేర్లు పడిపోయేలా చేసింది. బిలిబిలి షేర్లు 6.98 శాతం క్షీణించగా..కుయిషౌ షేర్లు 3.53 శాతం పడిపోయాయి. సోషల్ నెట్‌వర్క్ యాప్ WeChat ఆపరేటర్ టెన్సెంట్ హోల్డింగ్స్ షేర్లు 2.99 శాతం తగ్గాయి.
18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వినియోగదారుల కోసం మొబైల్ పరికరాల్లో ఇంటర్నెట్ యాక్సెస్‌ను రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు పరిమితం చేసే "మైనర్ మోడ్" ప్రోగ్రామ్‌లను రూపొందించాలని స్మార్ట్ పరికర తయారీదారులను సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా (CAC) కోరింది.
సీఏసీ నిబంధనల ప్రకారం.. 16 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల యూజర్లు రోజుకు రెండు గంటలు.. 8నుంచి 16 యేళ్ల లోపు పిల్లలకు ఒక గంట మాత్రమే స్మార్ట్ ఫోన్లు వినియోగించాలి. ఈ విషయంలో ప్రజలనుంచి అభిప్రాయ సేకరణ సెప్టెంబర్ 2 వరకు నిర్వహిస్తున్నట్లు సీఏసీ పేర్కొంది.