ఆన్ లైన్ లో మట్టిని తెగ కొంటున్నరు.. ఇంతకీ ఆ మట్టిలో ఏముంది.?

ఆన్ లైన్ లో మట్టిని తెగ కొంటున్నరు.. ఇంతకీ ఆ  మట్టిలో ఏముంది.?

ఆన్​లైన్ షాపింగ్ ట్రెండ్ మొదలయ్యాక ఇంట్లో సరుకుల నుంచి బట్టలు, ఎలక్ట్రానిక్స్, వెహికల్స్.. ఇలా బోలెడు కొనేస్తున్నారు. ఎప్పటికప్పుడు ట్రెండింగ్​లో ఉండాలని కంపెనీలు కూడా కొత్త ఆఫర్లు, డిస్కౌంట్లు, సేల్స్ ప్రకటిస్తుంటాయని తెలిసిందే. అయితే చైనాలో మాత్రం విచిత్రంగా ఒక నమ్మకం వాళ్లతో ఎక్కువ షాపింగ్ చేయించేస్తోంది. అదేంటో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. ఆ ఐటెమ్ ఏంటంటే.. మట్టి. అవును. చైనాలో ఇప్పుడు మట్టి తెగ కొంటున్నారు. ఎందుకంటే...

మామూలుగా అయితే కష్టపడి సంపాదించిన డబ్బును దాచుకోవడానికి బ్యాంక్​కి వెళ్తారు. అయితే చైనాలో సంపద కోసం బ్యాంకు దగ్గర ఉన్న మట్టిని నమ్ముకుంటున్నారు. అర్థం కాలేదా..  బ్యాంకులు ఉన్న ప్రదేశంలోని మట్టి చాలా మహిమగలదని, అదృష్టం కలిసొస్తుందని, సంపద పెరుగుతుందని అక్కడివాళ్లు నమ్ముతున్నారు. చైనాలో ఇప్పుడు ఇదే ట్రెండింగ్​. చైనాలోని ప్రధాన బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్​ చైనా, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్, అగ్రికల్చరల్, కన్​స్ట్రక్షన్, కమ్యూనికేషన్ విభాగాలకు చెందిన బ్యాంకుల దగ్గర నుంచి తెచ్చిన మట్టిని అమ్ముతున్నారు. 

వీటిలో మట్టి 260 రూపాయల నుంచి 10,200 రూపాయల మధ్య ఉంది. దీన్ని ‘బ్యాంక్ మట్టి’ పేరుతో ఆన్​లైన్​ షాపులు అమ్మేస్తున్నాయి. అక్కడి వాళ్లు రాత్రుళ్లు ఈ మట్టి తీసే పని పెట్టుకుంటారట. మట్టిని సేకరించడం కోసం బ్యాంకు వరండాల్లో ఉంచిన కుండీల్లో మట్టిని.. అంతెందుకు మనీ కౌంటింగ్ మెషిన్ మీద ఉన్న దుమ్మును కూడా వదలట్లేదట! అంతేకాదు.. ఈ మట్టి బిజినెస్​ వల్ల నూటికి 99 శాతం లాభం వస్తుందంటున్నారు అమ్మేవాళ్లు. మరోవైపు ఇతర వ్యాపారులు కూడా ఆ మట్టిని కొని బిజినెస్ డెవలప్​మెంట్ కోసం వాడుతున్నారని చెప్పారు. మరికొందరేమో ఇలాంటివన్నీ నమ్మకూడదు అని అవేర్​నెస్ కల్పిస్తున్నారు. చైనా చట్టాల ప్రకారం పబ్లిక్ ప్రదేశాల్లో మట్టిని తవ్వడం నిషిద్ధం.