ఆర్థిక యుద్ధం : చైనాకు వచ్చే అమెరికా సరుకు ఇదే.. వీటిపైనా 15 శాతం పన్ను

ఆర్థిక యుద్ధం : చైనాకు వచ్చే అమెరికా సరుకు ఇదే.. వీటిపైనా 15 శాతం పన్ను

చైనా నుంచి అమెరికాకు భారీగా వస్తువులు వస్తాయని అందరికీ తెలిసిందే.. ఇదే సమయంలో అమెరికా నుంచి కూడా చైనా చాలా వస్తువులు, ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది కూడా.. దిగుమతులపై అమెరికా విధిస్తున్న అదనరపు సుంకాలకు పోటీగా.. ఇప్పుడు చైనా కూడా అమెరికా నుంచి వచ్చే సరుకుపై 10 నుంచి 15 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. 2025, మార్చి 4వ తేదీ నుంచి ఈ పన్నులు అమల్లోకి వస్తాయని తేదీతో సహా ప్రకటించి.. అగ్రరాజ్యానికి షాక్ ఇచ్చింది చైనా. 

అమెరికా నుంచి చైనా దిగుమతి చేసుకునే సరుకు ఇదే :

  • చికెన్, గోధుమలు, మొక్కజొన్న, పత్తిపై 15 శాతం సుంకాలు విధిస్తుంది చైనా.
  • అమెరికా సోయాబీన్స్, జొన్నలు, పంది మాంసం, గొడ్డు మాంసం, చేపలు, రొయ్యలు, పీతలు వంటి జల ఉత్పత్తులు, ఫ్రూట్స్ (పండ్లు), కూరగాయలు, పాల ఉత్పత్తులపై 10 శాతం సుంకం విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది.

ఇదే సమయంలో చైనా నుంచి టిలాపియా రకం చేపలు అమెరికాకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతాయి. ఇప్పటికే వీటిపై అమెరికా 35 శాతం సుంకం విధిస్తుంది. ఇప్పుడు ట్రంప్ అదనంగా మరో 10 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించటంతో.. టిలాపియా చేపలపై సుంకం 45 శాతానికి చేరుకుంటుంది. ఇది చైనా మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది అంటున్నారు ఆర్థిక వేత్తలు. ఈసారి చైనాలో టిలాపియా చేపల ఉత్పత్తి అధిక స్థాయిలో ఉంది.. వీటిలో ఎక్కువ శాతం అమెరికాకే ఎగుమతి అవుతాయి. ఇప్పుడు సుంకాలు పెరగటంతో.. చైనా చేపల వ్యాపారులు ఆందోళనగా ఉన్నారు. 

Also Read:-వెయ్యి సార్లు రక్తదానం.. 20 లక్షల మంది పిల్లలకు ప్రాణదానం..

అదే విధంగా అమెరికా నుంచి చైనాకు భారీ ఎత్తున సోయాబీన్ వస్తుంది. ప్రస్తుతం అమెరికాలో సోయాబీన్ ఆఫ్ సీజన్. సో.. ఇప్పటికిప్పుడు దీనిపై ఎంత అనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. మరో మూడు, నాలుగు నెలల తర్వాత అమెరికాలో పెద్ద ఎత్తున సోయాబీన్ మార్కెట్ లోకి వస్తుంది. ఆ సమయంలోనే చైనాకు ఎగుమతులు ఉంటాయి. ఆ సమయంలోనే అమెరికా రైతులపై ఎంత ప్రభావం పడుతుంది అనే అంచనా వేయగలం అంటున్నారు షాంఘైలోని వ్యవసాయ ఉత్పత్తుల పరిశోధకుడు రోసా వాంగ్. 

అమెరికాకు ధీటుగా చైనా దిగుమతుల సుంకాలను విధించటం ద్వారా ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య ఆర్థిక యుద్ధం నడుస్తుందని.. ఇది ఎటువైపు దారి తీస్తుంది.. ఏయే దేశాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది రాబోయే ఆరు నెలల్లో స్పష్టంగా బయటపడుతుందని అంటున్నారు షాంఘై విశ్లేషకులు.